Begin typing your search above and press return to search.
వైసీపీ మాట!:.బాబు నటనకు *నంది* ఇవ్వాల్సిందే!
By: Tupaki Desk | 23 Nov 2017 12:56 PM GMTటీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై సెటైరికల్ పంచ్ లు వేయడంలో వైసీపీ నేతలను మించిన వారు మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. సందర్భం ఏదైనా... దానికి బాబుకు ఆపాదించేస్తున్న వైసీపీ నేతలు... తమదైన శైలిలో విమర్శలు సంధిస్తున్నారు. ఈ తరహా విమర్శల్లో వైసీపీకి చెందిన కీలక నేత అంబటి రాంబాబు గతంలో అందరికంటే ముందు ఉండేవారు. అయితే ఇప్పుడు అంబటికి సాటి రాగల నేతలు వైసీపీలో చాలా మందే ఉన్నారన్న విషయాన్ని ఒప్పుకోక తప్పదు. ఈ తరహా నేతల లిస్టు వైసీపీలో చాంతాడంత ఉన్నా... కృష్ణా జిల్లాకు చెందిన నేతలు ఇప్పుడు బాబుపై విరుచుకుపడుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. అంశం ఏదైనా... దానిని తాము ప్రస్తావిస్తున్న అంశానికి జత కట్టేస్తూ ఆసక్తికరమైన వాదన వినిపించడంలో వైసీపీ సీనియర్ నేత - మాజీ మంత్రి కొలుసు పార్థసారధి ఇటీవలి కాలంలో చేయి తిరిగిన నేతగా ఎదిగారు.
తాజాగా నంది అవార్డుల వివాదం తెలుగు నాట బాగానే రక్తి కట్టిస్తోంది. ఈ వివాదాన్ని అందేసుకున్న పార్థసారధి... బాబుపై ఆసక్తికరమైన సెటైర్లు సంధించారు. పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడిన ఆయన ఆ విషయంలో చంద్రబాబు బాగానే నటిస్తున్నారని తనదైన శైలిలో స్టేట్ మెంట్ ఇచ్చేశారు. అయినా పార్థసారధి ఏమన్నారన్న విషయానికి వస్తే... పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రహసనంగా మార్చేశారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో చంద్రబాబు నటనకు నంది అవార్డు ఇవ్వాలన్నారు. పోలవరానికి కేంద్రం సహకరించకపోతే... ఎన్డీఏ ప్రభుత్వంలో ఎందుకు కొనసాగుతున్నారని సూటిగా ప్రశ్నించారు. పోలవరం విషయంలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కారు పాపాలను ప్రజలు భరించలేకపోతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
నకిలీ విత్తనాలకు ఏపీ నిలయంగా మారిందని దుయ్యబట్టారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమ పార్థసారధి ధ్వజమెత్తారు. రైతులకు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వరా? రైతులకు నిరసన తెలిపే హక్కు లేదా? అని కూడా ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలను - ఉద్యోగులను - నష్టపోయిన రైతులను కలవాలంటే ఎందుకు ప్రభుత్వం భయపడుతోందని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో నలుగుతున్న ప్రతి అంశాన్ని ప్రస్తావించిన పార్థసారధి... ఇప్పుడు జనాల నోళ్లలో నానుతున్న నంది అవార్డులను కూడా ప్రస్తావనకు తెచ్చి బాబు నటనకు నంది అవార్డు ఇవ్వాలన్న సెటైర్ మాత్రం బాగానే పేలిందనే చెప్పాలి. చివరగా తన సొంత జిల్లా కృష్ణా జిల్లా విషయాన్ని ప్రస్తావించిన పార్థసారధి... జిల్లాకు చెందిన మంత్రులు దద్దమ్మల్లా తయారయ్యారని ఘాటుగా విమర్శించారు.