Begin typing your search above and press return to search.

అతి చేస్తే వైసీపీకే బూమరాంగ్... ?

By:  Tupaki Desk   |   8 May 2022 7:31 AM GMT
అతి చేస్తే వైసీపీకే బూమరాంగ్... ?
X
ఏది అయినా ఒక సహేతుకమైన విమర్శగా ఉండాలి. అది జనంలో అలా చర్చకు పెట్టి ఉంచాలి. ఆ మీదట వారు ఏం ఆలోచించుకుంటారో వారి ఇష్టం అన్నట్లుగా వదిలేయాలి. కానీ ఏపీలో చూస్తే అధికార వైసీపీ ఒక అంశం పట్టుకుని తెగ వేలాడుతోంది. అది తనకు సంబంధం లేని సమస్య. పైగా రాజకీయంగా అది ఒక విషయం. అందులో తప్పేంటో కూడా తెలియదు. లాజిక్ లేకుండా మంత్రులు సామంతులూ అందరూ కలసి అదే పనిగా పదే పదే దాన్నే ఫోకస్ చేస్తూ నోరు చేసుకుంటున్నారు.

ఆ అంశమే టీడీపీ జనసేన పొత్తు. నిజానికి ఈ రెండు పార్టీల మధ్య స్నేహం కొత్త కాదు, 2014లోనూ చెలిమి చేశాయి. మధ్యలో కొంత ఎడం వచ్చింది, ఇపుడు మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అది వారి ఇష్టం. రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. పొత్తులు ఎవరితో పెట్టుకోవాలి అన్నది కూడా ఆయా పార్టీల సొంత నిర్ణయం. ఇందులో వైసీపీకి కానీ మరో పార్టీకి కానీ పోయేది ఏమీ లేదు.

ఇక చూడబోతే పొత్తులు అన్నవి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి తొలి ఎన్నికల నుంచి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అంతకు ముందు కూడా బ్రిటిష్ వారి ఏలుబడిలో కూడా కొన్ని చోట్ల ఎన్నికలు పెడితే అలాగే భావసారూప్యం కలిగిన పార్టీలు జత కట్టాయి. అందులో తప్పొప్పులు ఉంటే జనాలే వద్దు అనుకుంటారు. అంతే తప్ప మధ్యలో వైసీపీ ఎవరు. ఇదే ఇపుడు వస్తున్న అతి పెద్ద ప్రశ్న.

నిజానికి గత ఏడాదిగా వైసీపీ నేతలు టీడెపీ జనసేన పొత్తులు అంటూ ప్రచారం స్టార్ట్ చేశారు. అది ఇపుడు ఒక సంకేతంగా బయటకు వచ్చింది. రేపో మాపో సాకారం కూడా కావచ్చు. మరి దాన్ని చూపించి మేము ముందే చెప్పాం కదా అని క్రెడిట్ ని క్లెయిం చేసుకుంటారా. దాని వల్ల వచ్చే ఉపయోగం ఏంటి. వైసీపీ ఇలా అతి చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి అన్నదే ఇక్కడ ప్రశ్న.

జనసేన టీడీపీ కలిస్తే కచ్చితంగా తమకు ఓటమి లభిస్తుంది అన్న కంగారు, బెదురే ఈ రకమైన ప్రచారం ద్వారా ప్రజలకు చేరుతున్న సందేశం. దాని వల్ల ప్రజలు మరింతగా ఈ పొత్తులను స్వాగతించి ఆ రెండు పార్టీలను అక్కున చేర్చుకుంటే దెబ్బ పడిపోయేది అధికార పార్టీకే అన్న చర్చ కూడా ఉంది. అయినా పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన‌ అన్నీ అనుకూలం కాలేవు. అలాగని విడిగా పోటీ చేసినంతమాత్రాన వైసీపీ గెలిచేదీ ఉండదు.

ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఏంటి అంటే అధికార పార్టీ మీద ప్రజలలో వ్యతిరేకత ఉందా లేదా. అది కనుక ఉంటే ఓట్ల కలయికలు, చీలికలతో సంబంధం లేకుండా ఓటమి వచ్చి వరిస్తుంది. అందువల్ల వైసీపీ చూసుకోవాల్సింది తన పరిపాలన గురించి, తన తప్పులను సరిదిద్దుకోవడం గురించి. అంతే తప్ప ఏయే పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయి అని చెప్పడం, దెప్పిపొడవడం కానే కాదు. అలా కనుక పదే పదే అంటూ కూర్చుంటే చివరికి వైసీపీకే పొలిటికల్ గా డేంజర్ సిగ్నల్స్ చూపిస్తాయి. తస్మాత్ జాగ్రత్త అని చెబుతున్నారు.