Begin typing your search above and press return to search.

ప్రేమికులకు పెళ్లి చేసిన వైసీపీ ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   19 Dec 2022 12:51 PM GMT
ప్రేమికులకు పెళ్లి చేసిన వైసీపీ ఎమ్మెల్యే!
X
యువతీ యువకులు ప్రేమించుకోవడం.. వారి పెళ్లికి పెద్దలు నో చెప్పడం వంటి సాధారణంగా జరిగేవే. ఎక్కడో కొన్నిచోట్ల తప్ప ప్రేమికులకు పెద్దల నుంచి తిరస్కారమే ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రేమికులు కలిసి బతకలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం ధైర్యంగా ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుని ఒక్కటవుతున్నారు.

అయితే ఇక్కడ ప్రేమికుల కథ మాత్రం వైసీపీ ఎమ్మెల్యే చొరవతో సుఖాంతమైంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరిగిన ఈ ఘటనకు పూర్వాపరాలు ఇవి..

అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురానికి చెందిన లంకలపూడి దుర్గామల్లేష్, విజయ వేర్వేరు కులాలకు చెందినవారు. వీరి మధ్య ఏర్పడిన పరిచయం స్వల్ప కాలంలోనే ప్రేమగా మారింది. అయితే, వారి ప్రేమ వ్యవహారం ఇరువురి తరఫు తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీంతో వారి పెళ్లికి నిరాకరించారు.

దీంతో ఈ వ్యవహారం గ్రామ పెద్దల వరకు వెళ్లింది. వారు కూడా ప్రేమికుల తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో ఈ ప్రేమను చాలించాలని వారించారు. అయినా ప్రేమ జంట వెనక్కి తగ్గలేదు. గ్రామ పెద్దల ద్వారా ఈ వ్యవహారం స్థానిక వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డికి తెలిసింది. దీంతో ప్రేమికుల తల్లిదండ్రులను ఒప్పించిన ఎమ్మెల్యే.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలోనే వారికి పెళ్లి జరిపించారు.

ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి.. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలని ఒప్పించారు. గ్రామ పెద్దలు, కుటుంబసభ్యుల సమక్షంలో ఆ ప్రేమికులను కలిపారు. అనపర్తిలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఈ ప్రేమ పెళ్లికి వేదికైంది. వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నత్తి సూర్యనారాయణరెడ్డి ప్రేమ జంటకు దండలు మార్పించారు. దీంతో ప్రేమ జంట దుర్గామల్లేష్, విజయల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

దీంతో ప్రేమికుల జంట ఎమ్మెల్యే కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది. ఈ పెళ్లికి లక్ష్మీ నరసాపురం గ్రామ పెద్దలు, ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, బంధువులు హాజరయ్యారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.