Begin typing your search above and press return to search.

ఎప్పటికీ బాబే కావాలంటున్న వైసీపీ...ఇదేమి లాజిక్కు...?

By:  Tupaki Desk   |   2 Dec 2022 11:30 PM GMT
ఎప్పటికీ బాబే కావాలంటున్న వైసీపీ...ఇదేమి లాజిక్కు...?
X
చంద్రబాబుకు జగన్ కి పచ్చగడ్డి వేయకపోయినా మధ్యన మండుతుంది అని అంతా నమ్ముతారు. ఈ ఇద్దరూ రాజకీయంగా ప్రత్యర్ధుల కంటే శత్రువుల మాదిరిగానే తలపడతారు అని కూడా అంటారు. అలాంటిది వైసీపీకి చంద్రబాబు మీద ఒక్కసారిగా ప్రేమ ఎందుకో పెల్లుబుకుతోంది. అదెలా అంటే ఏనాటికీ ఎన్ని ఎన్నికలకు అయినా బాబే తమకు అసలు సిసలు విపక్ష నేతగా ఉండాలిట.

ఈ కోరిక ఎంత విడ్డూరంగా ఉన్నా దీని వెనక విశేషమూ చాలానే ఉంది మరి. చంద్రబాబు సత్తు కేసు సాంబయ్యట. ఈ మాటలు అన్నది ఎవరో కాదు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు లాంటి పాత తరం ఔట్ డేటెడ్ పొలిటీషియన్ తమకు ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే ఫుల్ హ్యాపీస్ అంటున్నారు. బాబు అక్కడ ఉంటే జగన్ విజయం ఎపుడూ నల్లేరు మీద నడకేనని పేర్ని నాని కొత్త విషయాలను చెప్పారు.

చంద్రబాబు జిల్లా టూర్లలో తనను చంపడానికి వైసీపీ చూస్తోంది అని అదే పనిగా ఆరోపణలు చేస్తున్నారు అని అయినా బాబును ఎవరు చంపుతారు, ఎందుకు చంపుతారు అని ఆయన ప్రశ్నించారు. ఎవరూ నమ్మని ఎవరినీ నమ్మని బాబు తమకు ప్రత్యర్ధిగా కలకాలం ఉండాలనే తాము కోరుకుంటాం తప్ప ఆయనను లేపేయాలని ఎందుకు చచ్చు పుచ్చు ఆలోచనలు చేస్తామని పేర్ని నాని గడుసుగానే ప్రశ్నించారు

మెదడులో బఠాణీ గింజ అంత తెలివి తేటలు ఉన్న వాడు, ఆ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాడు ఎవరైనా బాబుని చంపాలని చూస్తారా అని ఎదురు ప్రశ్నించారు. బాబు రాజనాల నాగభూషణం కాలం నాటి కుట్రలు పాత ప్లాన్లనే ఇంకా నమ్ముకుంటున్నారని, అవే జనాలకు చెప్పి నమ్మించాలని చూస్తున్నారని పేర్ని నాని సెటైర్లు వేశారు.

అప్పుడెపుడో మల్లెల బాబ్జీ అనే ఒక వ్యక్తిని ముందు పెట్టి ఎన్టీయార్ మీద హత్యా యత్నం జరిగింది అని నాటకం ఆడించినది చంద్రబాబే కదా అని ఆయన ప్రశ్నించారు. అలాంటి బాబు ఇపుడు తన మీద సానుభూతి కోసం ఈ చావు డ్రామాకు తెర తీశారని నిందించారు. బాబు ఎన్ని రకాలుగా డ్రామాలు ఆడినా ఈ కాలంలో ఎవరూ ఆయన్ని నమ్మేది లేదని అన్నారు. బాబు రాజకీయం పూర్తిగా పాతకాలానికి చెందినదని, ఆయన ఇంకా అదే చేస్తూ అభాసుపాలు అవుతున్నారని కూడా నాని విమర్శించారు.

చంద్రబాబు వంటి నాయకుడు ఎల్ల కాలం అలా విపక్షంలోనే ఉంటారు, ఎప్పటికీ ఆయన సీఎం కాలేరని నాని జోస్యం చెప్పారు. ఇక్కడ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే చూస్తూ బాధపడుతూ ఇదేమి ఖర్మరా బాబూ అని చంద్రబాబు అనుకోవడమే 2024 ఎన్నికల తరువాత ఇక మిగిలిందని, అదే జరగబోతోందని నాని చెప్పుకొచ్చారు.

కర్నూల్ సభలో తనకు చివరి ఎన్నికలు అని చెప్పిన చంద్రబాబు గోదావరి జిల్లాలకు వచ్చేసరికి ప్రజలకు చివరి ఎన్నికలు అంటున్నారని, ఇదేమైనా ప్రజలకు ఆయన ఇస్తున్న ఆఫరా అని నాని వెటకారం చేశారు. ప్రజల నుంచి అధికారం కుర్చీ తనకు కావాలి, వారికి మాత్రం ఓట్లేసేందుకు ఇవే లాస్ట్ చాన్స్ అని బాబు మార్క్ ఆఫర్లు ఇస్తున్నారని, అలా ఇవ్వడానికి ఆయన ఎవరని నాని మండిపడ్డారు. మొత్తానికి చూస్తే తనదైన వెటకారంతో నాని బాబుతో మాటల చెలగాటం ఆడేశారు. మనలో మాట చంద్రబాబు విపక్షంలో ఉంటే జగన్ కి ఫుల్ హ్యాపీస్ నా. ఏమో 2024 ఎన్నికల తరువాత జనాల తీర్పు చూసిన మీదటనే దాని మీద ఎవరైనా నిర్ణయానికి రావాల్సి ఉంటుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.