Begin typing your search above and press return to search.

వారిని చీల్చాలి...వీరిని చేర్చాలి... వైసీపీ నయా స్ట్రాటజీ... ?

By:  Tupaki Desk   |   20 March 2022 1:30 PM GMT
వారిని చీల్చాలి...వీరిని చేర్చాలి... వైసీపీ నయా స్ట్రాటజీ... ?
X
ఏపీలో రాజకీయ వ్యూహాలు ఒక్కో పార్టీదీ ఒక్కోలా ఉంటున్నాయి. అవి ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాగానే పదును తేరుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ తానే పవర్ లోకి రావాలనుకుంటుంది. ఆ విధంగా చూసుకుంటే వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళూరుతోంది. అందుకోసం తాను నమ్మిన ప్రశాంత్ కిశోర్ కే వ్యూహ కర్త బాధ్యతలు అప్పగించింది.

అయితే ఈసారి వైసీపీ పవర్ లోకి రావడం అంటే చాలా కష్టపడాలి అన్న భావన ఉంది. ఎందుకంటే జగన్ సర్కార్ అయిదేళ్ల పాలన చూసి ఈసారి జనాలు తీర్పు చెబుతారు. అదే టైంలో జగన్ ఏలుబడిలో సంక్షేమానికి మార్కులు పడుతున్నాయి. కానీ అభివృద్ధి విషయంలో మాత్రం మైనస్సులు ఎక్కువగా ఉన్నాయి.

దాంతో ఈ రెండింటినీ సరిచేసుకుని ఎలా అధికారంలోకి రావడం అన్నదే ఇపుడు చర్చ. దీనితో పాటు సామాజిక సమీకరణలు కూడా గతసారిలా ఉండవు. ఈసారి కాపులు మొత్తం పోలరైజ్ అవుతున్నాయి. పడితే గిడితే టీడీపీకి కొంత శాతం పడినా మెజారిటీ కాపులు జనసేనతో ప్రయాణం చేయనున్నారని తేలిపోతున్న సత్యం.

ఇక బీసీలు నాడు వైసీపీకి జై కొట్టారు. ఇపుడు చూస్తే వారు ఏ వైపు అన్నది ఆలోచించుకోవాలి. సహజంగా బీసీ ఓటు ఎక్కువగా టీడీపీకి వెళ్తుంది. కానీ గతసారి అందులో నుంచి సగానికి పైగా వైసీపీ మళ్ళించుకుంది. ఇపుడు అధికారంలో ఉన్న పార్టీ మీద సహజంగా ఉండే వ్యతిరేకత. తమకేమి పనులు కావడంలేదు అన్న అసంతృప్తితో బీసీలు టీడీపీ వైపు ఎక్కువ శాతం మళ్ళితే ఇబ్బందే.

దాంతో వైసీపీ వ్యూహాలు మారుతున్నాయి. కాపుల ఓట్లు తమకు పడకపోయినా అవి చీలితే చాలు అన్నది ఒక స్ట్రాటజీ అయితే బీసీలను ఏదో విధంగా దగ్గరకు చేసుకోవాలన్నదే నయా స్ట్రాటజీ. మరి దీని మీదనే పీకే టీం సలహా సూచనలు ఇస్తోంది అంటున్నారు. ఏపీలో సామాజికవర్గ సమీకరణలు చూస్తే కాపుల విషయంలో వైసీపీ పెద్దగా ఆశలు పెట్టుకోవడంలేదు అనే అంటున్నారు.

బీసీల విషయంలోనే ఇంకా చేయాల్సింది చేసి వచ్చే ఎన్నికల వేళకు వారిని తమ వైపుగా ఉంచుకోగలిగితే మరో మారు పవర్ మ్యాజిక్ ని కాప్చర్ చేయగలుగుతామని ఆశిస్తోంది. మరి వైసీపీ ఆశలు వ్యూహాలు ఎంత మేరకు నెరవేరుతాయి. పీకే స్ట్రాటజీలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయన్నది చూడాలి.