Begin typing your search above and press return to search.

ఉర‌వకొండ‌లో ఓట‌మి భ‌యం.. టీడీపీ ఓట్లతొల‌గింపు

By:  Tupaki Desk   |   4 Jan 2023 10:59 AM GMT
ఉర‌వకొండ‌లో ఓట‌మి భ‌యం.. టీడీపీ ఓట్లతొల‌గింపు
X
వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని తీరాల‌ని భావిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ.. ఈ క్ర‌మంలో చేస్తున్న కొన్ని ప‌నులు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ‌లో టీడీపీ సానుభూతి ప‌రుల ఓట్ల‌ను తొల‌గించేందుకు వ‌లంటీర్ల‌ను ఉప‌యోగించుకుంటున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో ముందే అలెర్ట్ అయిన టీడీపీ... దీనిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది.

ఈ క్ర‌మంలో రంగంలోకి దిగిన ఎన్నిక‌ల సంఘం.. ఇక్క‌డ ఏం జ‌రుగుతోందో తెలుసుకుని స‌రిదిద్దాల‌ని.. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి తాజాగా లేఖ రాసింది. దీంతో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం.. ఇక్క‌డ ఏం జ‌రుగుతోందో తెలుసుకునే ప‌నిలో ప‌డింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ నాయ‌కుడు ప‌య్యావుల కేశ‌వ్ విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ పాగా వేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

2014లో ఇక్క‌డ విశ్వేశ్వ‌ర‌రెడ్డి(న‌క్స‌ల్స్ మాజీ సానుభూతిప‌రుడు) విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో టీడీపీ దూకుడు ఎక్కువ‌గా ఉంది. దీంతో విశ్వేశ్వ‌ర‌రెడ్డి సూచ‌న‌ల మేర‌కే.. ఇక్క‌డ త‌మ సానుభూతి ప‌రుల ఓట్ల‌ను తొల‌గిస్తున్నార‌ని ప‌య్యావుల ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇదే విష‌యంపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఆయ‌న లేఖ రాశారు. ఈ క్ర‌మంలో తాజాగా ఇక్క‌డ ఆడిట్ నిర్వ‌హిస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని నిగ్గు తేల్చటానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారి స్వయంగా ఉర‌వ‌కొండ‌కు చేరుకున్నారు. మ‌రోవైపు సీఈసీ ఆదేశాలతో అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి హడావిడిగా ఇద్దరు బీఎల్వోలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామం.. వైసీపీని డిఫెన్స్‌లో ప‌డేసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.