Begin typing your search above and press return to search.

పాల‌మూరు ప్రాజెక్టు: నోరువిప్పిన వైసీపీ

By:  Tupaki Desk   |   18 July 2015 9:53 AM GMT
పాల‌మూరు ప్రాజెక్టు:  నోరువిప్పిన వైసీపీ
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్-తెలంగాణ రాష్ర్టాల మ‌ధ్య ర‌చ్చ‌గా మారిన పాల‌మూరు ఎత్తిపోత‌ల ప్రాజెక్టుపై ఇరు రాష్ర్టాల్లోని అధికార పార్టీల‌యిన తెలుగుదేశం, టీఆర్ఎస్‌లు త‌మ స్వ‌రాన్ని వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్ప‌టివ‌ర‌కు త‌న అభిప్రాయం ఏంటో బ‌య‌ట‌పెట్ట‌లేదు. త్వ‌ర‌లో పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఆ పార్టీ త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించింది.

వైసీపీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పార్టీ ఎంపీల‌తో స‌మావేశం అయ్యారు. పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా అనుస‌రిచాల్సిన వ్యూహంపై చ‌ర్చించారు. ఓటుకునోటు, పుష్క‌రాల్లో భ‌క్తుల మ‌ర‌ణం, ఏపీకి ఇచ్చిన హామీలు త‌దిత‌ర అంశాల గురించి ఎంపీలు, జ‌గ‌న్ త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్నారు. అనంత‌రం వైసీపీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో ఏర్పాటుచేయ‌నున్న పాల‌మూరు ఎత్తిపోత‌ల ప్రాజెక్టుకు తాము వ్య‌తిరేకం అని స్ప‌ష్టం చేశారు. త‌మ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలో జ‌రిగిన స‌మావేశంలోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పాల‌మూరు ప్రాజెక్టు నిర్మాణం వ‌ల్ల ఏపీలో నీటి ఆధారిత ప్రాజెక్టుల నిర్మాణం ఇబ్బందిగా మారుతుంద‌ని..అందుకే తాము వ్య‌తిరేకిస్తున్న‌ట్లు చెప్పారు.

ఇన్నాళ్లు స‌మ‌స్య నానుతున్న‌ప్ప‌టికీ ఏమీ మాట్లాడ‌ని వైసీపీ ఇపుడు తాజాగా నోరెత్త‌డం అదికూడా ఏపీ అనుకూల వైఖ‌రితో మాట్లాడ‌టంపై ఆస‌క్తిక‌ర‌మే. అయితే తెలంగాణ‌లో పార్టీ నామ‌మాత్ర‌పు స్థాయికే ప‌రిమితం అవ‌డం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న బ‌లాన్ని కాపాడుకునేందుకు ఈ నిర్ణ‌యం తీసుకొని ఉంటార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.