Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వాలంటున్న రోజా

By:  Tupaki Desk   |   3 Dec 2018 7:41 AM GMT
ఎన్టీఆర్ ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వాలంటున్న రోజా
X
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మ‌రోసారి త‌న మాట‌ల‌తో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై విరుచుకుప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రిపాల‌న‌ను గాలికొదిలేసి చంద్ర‌బాబు దేశ‌మంత‌టా తిరుగుతున్నార‌ని విమ‌ర్శించారు. నంద‌మూరి కుటుంబాన్ని రాజ‌కీయాల‌కు వాడుకొని క‌ర్వేపాకులా ఆయ‌న తీసేస్తున్నార‌ని అన్నారు. ఇప్ప‌టికైనా క‌ళ్లు తెరిచి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుకోవాల‌ని జూనియ‌ర్‌ ఎన్టీఆర్‌ కు హిత‌బోధ చేశారు.

కూక‌ట్‌ ప‌ల్లిలో నంద‌మూరి సుహాసినిని చంద్ర‌బాబు టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో దించ‌డాన్ని రోజా త‌ప్పుప‌ట్టారు. హ‌రికృష్ణ జీవించి ఉన్న‌న్నాళ్లూ ఆయ‌న్ను చంద్ర‌బాబు మాన‌సికంగా వేదించార‌ని ఆరోపించారు. పార్టీలో ఆయ‌న‌కు ప్రాధాన్య‌మే ఇవ్వ‌లేద‌ని సూచించారు. ఇప్పుడు భౌతికంగా హ‌రికృష్ణ దూర‌మ‌య్యాక‌.. ఆయ‌న మ‌ర‌ణాన్ని సొమ్ము చేసుకునేందుకు బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఓడిపోయే సీటు అని తెలిసి కూడా కూక‌ట్‌ప‌ల్లి నుంచి సుహాసినిని చంద్ర‌బాబు బ‌రిలో దించార‌ని ఆరోపించారు. నిజంగా నంద‌మూరి ఫ్యామిలీపై చంద్ర‌బాబుకు అభిమానం ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోడ‌లిగా ఉన్న సుహాసినికి ఇక్క‌డే ఎమ్మెల్సీ సీటిచ్చి మంత్రి ప‌ద‌వి ఇవ్వొచ్చు క‌దా అని ప్ర‌శ్నించారు. టీడీపీ త‌ర‌ఫున శాయ‌శ‌క్తులా పోరాడే స్వ‌భావ‌మున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ లేదా క‌ల్యాణ్ రామ్‌ కు ఎమ్మెల్సీ ప‌ద‌వులిచ్చి మంత్రుల‌ను చేయొచ్చు క‌దా అని నిల‌దీశారు.

త‌న కొడుకు నారా లోకేష్‌ కు మాత్రం ఎమ్మెల్సీ - మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన చంద్ర‌బాబు.. నంద‌మూరి వార‌సుల‌కు అలా ఎందుకు చేయ‌డం లేద‌ని రోజా ప్ర‌శ్నించారు. మున్ముందు ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా నంద‌మూరి ఫ్యామిలీని చంద్ర‌బాబు ప్ర‌చారానికి వాడుకొని ఆపై క‌ర్వేపాకులా తీసిపారేయ‌డం గ్యారెంటీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ తో టీడీపీ పొత్తు కుద‌ర్చ‌డంతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభించి ఉంటుంద‌ని సూచించారు. ఇక‌నైనా చంద్ర‌బాబు కుట్ర‌ల‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్ అర్థం చేసుకోవాల‌ని.. రంగంలోకి దిగి ప‌రిస్థితుల‌ను చక్క‌దిద్దాల‌ని హిత‌బోధ చేశారు.