Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో వైసీపీ హవా ఎందుకు తగ్గింది?

By:  Tupaki Desk   |   29 Aug 2019 5:32 AM GMT
సోషల్ మీడియాలో వైసీపీ హవా ఎందుకు తగ్గింది?
X
ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్పు కోసం గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ అవినీతి రహిత పాలన కోసం జగన్ శ్రమిస్తూ ఉన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ వ్యవహరించని రీతిలో అవినీతి వ్యతిరేక పాలన కు జగన్ ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు. ఇక సంక్షేమ పథకాలతో పేదల బతుకులు మెరుగయ్యేందుకు కృషి చేస్తూ ఉన్నారు.

అదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అతికించిన గుదిబండలు మరో ఎత్తు. రాజధానితో సహా - అప్పులు వంటివన్నీ రాష్ట్రానికి గుదిబండగా తయారయ్యాయి. వాటన్నింటినీ జగన్ డీల్ చేస్తూ ఉన్నారు. ఇంత చేస్తున్నా ఏదో రకంగా జగన్ మీద బురద జల్లడానికి తెలుగుదేశం వర్గాలు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా కొంత కుట్ర జరుగుతూ ఉంది.

దాన్ని ఎదుర్కొనడానికి విజయసాయి రెడ్డి లాంటి వాళ్లు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. ట్విటర్లో యాక్టివ్ గా ఉండటం ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ల సోషల్ మీడియా విష ప్రచారానికి - టీడీపీ లీడర్ల విమర్శలకు విజయసాయి రెడ్డి కౌంటర్లు ఇస్తున్నారు. 'సైరా పంచ్' అటూ విజయసాయి రెడ్డి గట్టి సమాధానాలు ఇస్తున్నారు. ఎన్ని లక్షల మందికి అయినా సోషల్ మీడియా ద్వారా ఆయన సమాధానం ఇస్తున్నారు.

అయితే ఎటొచ్చీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైన్యం మాత్రం ఇప్పుడు చేష్టలుడిగినట్టుగా అగుపిస్తోంది. ఎన్నికలకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వలంటీర్లు పూర్తి ఇన్ యాక్టివ్ అయిపోయారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా శ్రేణులు ప్రత్యర్థులపై తీవ్రంగా విరుచుకుపడేవి. అధికారంలో లేకపోయినా అన్నింటినీ ఎదుర్కొంటూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా శ్రేణులు ధీటుగా స్పందించేవి.

అయితే పార్టీ అధికారంలోకి వచ్చాకా మాత్రం సోషల్ మీడియా వలంటీర్లు పూర్తిగా నిస్తేజపడినట్టుగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వాళ్ల తీరుపై సెటైర్లకు బోలెడంత అవకాశం ఉంది. కోడల వంటి వాళ్లు అడ్డంగా దొరికిపోవడం, లోకేష్ రొటీన్ గానే దొరికిపోతూ ఉండటంతో సహా సుజనా చౌదరి వంటి వాళ్లు కండువాలు మార్చి చేస్తున్న రాజకీయం పై ఘాటుగా స్పందించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అవకాశం ఉంది. అయితే ఆ అవకాశాన్ని వారు ఉపయోగించుకోవడం లేదు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైన్యం పూర్తిగా నిస్తేజంగా కనిపిస్తోంది. బహుశా పార్టీ అధికారంలోకి వచ్చిందని ప్రత్యర్థులకు సమాధానాలు ఇవ్వడం కూడా ఆపేశారా? లేక పార్టీ నేతలు తమను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని సోషల్ మీడియా వలంటీర్లు పూర్తిగా కామ్ డౌన్ అయ్యారా.. అనే విషయాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకత్వమే సమీక్షించుకోవాలేమో!