Begin typing your search above and press return to search.

మ‌నిషి మ‌నిషికీ లెక్క‌.. ఇదీ వైసీపీ వ్యూహం!

By:  Tupaki Desk   |   28 Oct 2022 2:30 PM GMT
మ‌నిషి మ‌నిషికీ లెక్క‌.. ఇదీ వైసీపీ వ్యూహం!
X
వ‌చ్చే ఎన్నిక‌లు వైసీపీకి భిన్నంగా ఉండ‌నున్నాయి. ఎందుకంటే ఇత‌ర‌పార్టీల మాదిరిగా కాకుండా వ‌చ్చే ఎన్నిక్ల‌లో క్లీన్ స్వీప్ చేయాల‌ని 175కు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ విజ‌యం ద‌క్కించుకోవాల‌ని వైసీపీ ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఇలా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పార్టీ కూడా ల‌క్ష్యం నిర్ణ‌యించుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పొరుగు రాష్ట్రాల్లోనూ ఈ రేంజ్‌లో ల‌క్ష్యం నిర్ణ‌యించుకున్న పార్టీ లేదు. దీనిని బ‌ట్టి ఇప్పుడు వైసీపీ దూకుడు నిర్ణ‌యాలు తీసుకుంటుందా లేక‌ ఎలా ముందుకు సాగుతుంది? అనేది ఆస‌క్తిగా మారింది.

ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షాల‌ను విమ‌ర్శించ‌డం వారిపై ఎదురు దాడి చేయ‌డం వ‌ర‌కు వైసీపీ నేత‌లు బాగానే ముందున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌న హామీల‌తో దూకుడు ప్ర‌ద‌ర్శించిన‌ వైసీపీ అధినేత జ‌గ‌న్‌ త‌ర్వాత‌ కాలంలో మాత్రం తాము అధికారంలోకి వ‌స్తే మ‌ళ్లీ మీద‌గ్గ‌ర‌కు సంక్షేమం చూపించిన త‌ర్వాతే ఓట్లు అడిగేందుకు వ‌స్తాం త‌ప్ప‌ ప్ర‌తిప‌క్షాల‌ను అడ్డం పెట్టుకుని మాత్రం రాబోము! అన్నారు. అంటే త‌న పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు చూపించి దాని ప్ర‌కార‌మే ఆయ‌న ఓట్లు అడిగేందుకు ముందుకు వ‌స్తార‌న్న మాట‌.

పైగా మూడున్న‌రేళ్ల పాల‌న త‌ర్వాత‌ ఇంకా ఇంకా ప్ర‌తిప‌క్షాల‌నే బూచిగా చూపించి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డాన్ని వైసీపీలోనూ కొంద‌రు వ్య‌తిరేకిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌నం ఏం చేశాం.. ఏం చెప్పాం.. అనే కాన్సెప్టును ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించారు.

ఈ క్ర‌మంలోనే త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో ఎవ‌రికి ఎంతెంత ల‌బ్ధి చేకూరింది.. ఎవ‌రెవ‌రికి ఎంతెంత ప్ర‌యోజ‌నం చేకూరింది అనే విష‌యాల‌ను వివ‌రించేందుకు ప్ర‌స్తుతం ప‌క్కా ప్లాన్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ఇప్ప‌టికే దీనికి సంబంధించి నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప‌క్కా లెక్క‌లు తేల్చేశారు.

ఇక‌, ఈ లెక్క‌లు తీసుకుని వైసీపీ నాయ‌కులు ఇంటింటికీ తిర‌గ‌నున్నార‌న్న మాట‌. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం.. ప్ర‌తి వార్డు.. ప్ర‌తి ఇల్లు అనే కాన్సెప్టును ఈ కార్య‌క్ర‌మంలో అమ‌లు చేస్తున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు ఎక్క‌డిక‌క్క‌డ‌ వైసీపీ ప్ర‌భుత్వం చేసిన‌మేలును కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌రించేలా హోర్డింగులతోపాటు ప్ర‌తి ఇంటికీ.. ప్ర‌హ‌రీ గోడ‌పైనా.. వివరించే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు.

అంటే త‌మ ప్ర‌భుత్వం సంక్షేమ ప్ర‌భుత్వం అని చెప్పుకొనేందుకు త‌ద్వారా ఓట్లు రాబ‌ట్టేందుకు వైసీపీ ప‌క్కా ప్లాన్ వేసింద‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.