Begin typing your search above and press return to search.

వైకాపా : ఊపిరి లేదు గానీ.. ఉత్సాహం ఉంది

By:  Tupaki Desk   |   28 Oct 2015 4:10 AM GMT
వైకాపా : ఊపిరి లేదు గానీ.. ఉత్సాహం ఉంది
X
తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీ దాదాపుగా ఉనికి కోల్పోయింది. కానీ త్వరలో జరుగునున్న వరంగల్ లోక్ సభ ఉపఎన్నికలలో పోటీ చేయాలని మాత్రం తాపత్రయపడుతోంది. తెలంగాణలో తమ పార్టీకి బలం లేదనుకుంటున్న వారు భ్రమల్లో బతుకుతున్నారని.. వరంగల్ ఎన్నికలో రంగంలోకి దిగి.. విజయం సాధించి వారి నోర్లు మూయిస్తామని.. తెలంగాణ వైకాపా బీరాలు పలుకుతోంది. పైకి ఎన్ని కారణాలు చెప్పినా తెలంగాణ టీడీపీకి - బీజేపీ రాష్ట్ర శాఖకు మధ్య ఉమ్మడి అవగాహనతో నిలబడనున్న అభ్యర్థి విజయావకాశాలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పథక రచన చేస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. పైగా కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరించేలా మాత్రమే జగన్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారనే ఒక ప్రచారానికి కూడా ఈ పోటీ బలం చేకూర్చేలా ఉంది.

పైకి మాత్రం జగన్ సోదరి షర్మిల ఇటీవల తెలంగాణ జిల్లాల్లో చేసిన పరామర్స యాత్రకు ప్రజలనుంచి అద్భుత స్పందన వచ్చిందని, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల జ్ఞాపకాల్లో నిలిచి ఉన్నాయని వైకాపా తెలంగాణ శాఖ ప్రచారం మొదలెట్టింది. వైకాపా తెలంగాణ శాఖ అధ్యక్షుడు పి. శ్రీనివాస రెడ్డి ఇదే విషయాన్ని చెబుతూ తెలంగాణ మొత్తం మీద వైఎస్సార్ హయాంలో అమలు చేసిన పథకాలతో ఎక్కువగా లబ్దిపొందింది వరంగల్ ప్రజలేనని గుర్తు చేశారు.

మరోవైపున పాలక తెరాస పార్టీ తన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, అందుకే తెలంగాణలో రైతులు ఎన్నడూ లేని విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైకాపా ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఉపఎన్నికలో ప్రజలు టీఆరెస్‌ ని పూర్తిగా తిరస్కరిస్తారని, తమకే పట్టం కడతారని వైకాపా ఆశాభావంతో ఉంది. తెలంగాణలో ప్రత్యేకించి వరంగల్‌ లో పేదలకు అసంఖ్యాకంగా ఇళ్లు కట్టించి ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమేనని, అందుకే ఆయనను జిల్లాప్రజలు నేటికీ మర్చిపోలేకున్నారని శ్రీనివాసరెడ్డి వివరించారు.

సంకుచిత రాజకీయాల వల్లే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారని ప్రత్యేకించి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం వల్ల కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకున్నదని, ఇక టీడీపీ-బీజేపీ కలయిక వల్ల వారికి తెలంగాణలో ఒరిగేదేమీ ఉండదని శ్రీనివాస రెడ్డి తెలిపారు. కానీ లోతుగా పరిశీలిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే వైకాపా వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేయనున్నదని, తద్వారా అంతిమంగా లబ్ది పొందేది తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.