Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు త‌ప్పులు.. వైఎస్సార్ సీపీ ఎందుకు స‌రిచేయ‌డం లేదు?

By:  Tupaki Desk   |   4 March 2022 4:30 PM GMT
చంద్ర‌బాబు త‌ప్పులు.. వైఎస్సార్ సీపీ ఎందుకు స‌రిచేయ‌డం లేదు?
X
రాజ‌కీయాల్లో నేత‌లు మాట్లాడే మాట‌ల‌కు చేసే ప‌నుల‌కు మ‌ధ్య సంబంధం ఉండ‌డం లేదు. ఎన్నిక‌ల‌కు ముందు ఒక‌టి చెప్పి.. అధికారంలోకి వ‌చ్చాక‌.. మ‌రొక‌టి చేసే ప‌రిస్థితులు.. రాష్ట్రంలో విచ్చ‌ల‌విడిగా సాగుతున్నాయ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన ప‌రిణామాల‌ను.. ఇప్పుడు జ‌రుగుతున్న‌ప‌రిణామాల‌ను పోల్చి గ‌మ‌నిస్తే.. ఏపీలో జ‌రుగుతున్న రాజ‌కీయాలు ఇంత వింత‌గా ఉంటాయా? అనిఅనిపించ‌క మాన‌దు!. అప్ప‌టి ఎన్నిక‌ల‌కు ముందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనాయ‌కులు.. అప్ప‌ట్లో అధికారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌ప్పుల‌పై త‌ప్పులు చేస్తున్నార‌ని పెద్ద ఎత్తున ఊరూవాడా ప్ర‌చారం చేశారు.

ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ఊద‌ర గొట్టారు. ఇక‌, రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ కూడా చంద్ర‌బాబు త‌ప్పుల‌ను ఎత్తి చూపారు. వీటిని వైసీపీ నాయ‌కులు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చి రెండున్న‌రేళ్లు పూర్తి చేసుకుంది. ఈ రెండున్న‌రేళ్ల కాలంలో చంద్ర‌బాబు చేసిన త‌ప్పుల‌ను ఎందుకు స‌రిచేయ‌లేక పోయింద‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. ఇదే విష‌యంపై పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోందని మేధావులు సైతం చెబుతున్నారు. అంతేకాదు.. ప్ర‌తిసారీ ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం ఏదో ఒక స‌మ‌స్య‌ను తెర‌మీదికి తీసుకువ‌చ్చి.. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న విష‌యాల‌ను దారిమ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేస్తోంద‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.

ఉదాహ‌ర‌ణ‌కు.. అప్ప‌టి టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు నాయుడు పోల‌వరం మీద పెద్ద ఎత్తున అవినీతి చేశార‌ని, త‌న కు అనుకూలంగా కాంట్రాక్ట‌ర్ల‌ను మార్చుకున్నార‌ని.. ఇది కేంద్ర ప్ర‌భుత్వ ప్రాజెక్టు అయినా.. నిర్మాణ బాధ్య‌త‌ల‌ను ఏరికోరి తీసుకున్నార‌ని.. దీనివెనుక అవినీతి ఉంద‌ని వైసీపీ నాయ‌కులు ఆరోపించారు. అయితే.. గ‌త రెండున్న‌రేళ్ల వైసీపీ పాల‌న‌లో ఈ అవినీతిని ప‌ట్టించుకోలేదు. చంద్ర‌బాబు అవినీతిపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదు? అనేవి ప్ర‌ధాన ప్ర‌శ్న‌లుగా ఉన్నాయి. అంతేకాదు.. విభ‌జ‌న చ‌ట్టం మేర‌కు హైద‌రాబాద్ నుంచి ఏపీకి 30 వేల కోట్ల రూపాయ‌ల ఆస్తులు రావాల‌ని అప్ప‌ట్లో వైసీపీ నేత‌లు చెప్పారు.

కానీ, చంద్ర‌బాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని, భ‌య‌ప‌డి ఏపీకి పారిపోయి వ‌చ్చార‌ని.. అందుకే నిధులు కూడా అడ‌గ‌లేక పోతున్నార‌ని .. వైసీపీ నాయ‌కులు చెప్పుకొచ్చారు. మ‌రి ఈ రెండున్న‌రేళ్ల‌లో వైసీపీ ప్ర‌భుత్వం దీనిపై చ‌ర్చ‌లుకానీ, చ‌ర్య‌లు కానీ ఎందుకు తీసుకోలేక పోయింది? ఇక‌, మ‌రో కీల‌క విష‌యం ఏపీకి ప్ర‌త్యేక హోదా. ఈ విష‌యం కూడా ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌ధాన ప్ర‌చారం అస్త్రంగా మారింది. త‌మ‌కు ఎంపీల‌ను ఇస్తే.. కేంద్రం మెడ‌లు వంచైనా హోదా సాధిస్తామ‌ని చెప్పిన వైసీపీ నాయ‌కులు, పాల‌కులు ఇప్పుడు మౌనంగా ఉన్నారు. పైగా కేంద్రంలో బీజేపీకి ఫుల్ మెజారిటీ వ‌చ్చింది అని.. మ‌నం అడ‌గ‌డం త‌ప్పితే.. ఏమీ చేయ‌లేము అని చేత‌లు ఎత్తేశారు.

మ‌రి అప్ప‌ట్లో టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసి.. కేంద్రంపై ఒత్తిడి తెస్తే అన్నీ బాగుంటాయ‌ని చెప్పిన వైసీపీ నాయ‌కులు.. ఇప్పుడు ఆ ప‌నిచేయ‌డం లేదు ఎందుకు? అనేది కూడా ప్ర‌శ్న‌గా మారింది. అంతేకాదు.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో అభివృద్ధిపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అప్పులు త‌ప్పితే.. అభివృద్ధి ఎక్కాడా క‌నిపించ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అదేవిధంగా రోడ్ల‌మీద కూడా పెద్ద ఎత్తున చ‌ర్చ‌సాగుతోంది. చంద్ర‌బాబుపాల‌న‌లో ర‌హ‌దారుల‌ను స‌రిగా వేయ‌లేద‌ని విమ‌ర్శించిన వైసీపీ నాయ‌కులు..ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఏమీ చేయ‌లేక పోతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

అదేవిధంగా విభ‌జ‌న చ‌ట్టంలోనే పేర్కొన్న విధంగా ఒక్క‌టైనా కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ను ఏపీకి తీసుకువ‌చ్చారా? అంటే అది కూడా క‌నిపించ‌డం లేదు. కొత్త‌గా ఉద్యోగాలు సృష్టిస్తామ‌ని చెప్పారు. అంటే.. స‌చివాల‌యంలో ఉద్యోగాలు ఇచ్చామ‌ని అంటున్నారు. అయితే.. వీరికి కూడా ఇంకా ప‌ర్మినెంట్ చేయ‌లేదు. దీంతో ఈ ఉద్యోగులు కూడా ఇబ్బంది ప‌డుతున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగం అని భావించి.. ఎంటెక్ చేసిన వారు కూడా స‌చివాల‌యంలో 15 రూపాయ‌ల జీతానికి ఉద్యోగంలో చేరారు. అయితే.. ఇది విఫ‌ల‌మైంద‌ని అంటున్నారు. ఇక‌, రాజ‌ధాని విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా తేల్చ లేదు. హైకోర్టు గురువారం చెప్పింది కాబ‌ట్టి మ‌రి ప్ర‌భుత్వం ఏం చేస్తుందో.. చూడాల‌ని అంటున్నారు. ఏదేమైనా.. ఎన్నిక‌లకు ముందు ఒక‌లా.. త‌ర్వాత మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు అయితే.. గుప్పుమంటుండ‌డం గ‌మ‌నార్హం.