Begin typing your search above and press return to search.

పండుగ లేన‌ప్పుడూ హిందూ సంప్ర‌దాయం పాటించావేంటి జ‌గ‌న్‌?

By:  Tupaki Desk   |   12 Dec 2019 1:15 PM GMT
పండుగ లేన‌ప్పుడూ హిందూ సంప్ర‌దాయం పాటించావేంటి జ‌గ‌న్‌?
X
వివాదం చేయాల‌నుకుంటే...పైన పేర్కొన్న‌ట్లే ఆలోచించ‌వ‌చ్చు! ఆరోప‌ణ‌లు చేయ‌వ‌చ్చు!! `అస‌లు పండుగ లేన‌ప్పుడూ హిందూ సంప్ర‌దాయం పాటించ‌డం ఏంటి జ‌గ‌న్‌?` అని ప్ర‌శ్నించ‌వ‌చ్చు. ఎందుకంటే..రాజ‌కీయాల్లో మంచి ఉద్దేశాలు కూడా పెద్ద ఎత్తున్నే వ‌క్రీక‌ర‌ణ‌ల‌కు గుర‌వుతాయి క‌దా!! అదో దుర‌దృష్ట‌క‌ర‌మైన పరిస్థితి!! ఇంత‌కీ విష‌యం ఏంటంటే...ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌ ను తాజాగా ఆ రాష్ట్ర మహిళా మంత్రులు - ఎమ్మెల్యేలు కలిసి రాఖీ కట్టి - స్వీట్లు తినిపించారు. ధ‌న్య‌వాదాలు తెలిపారు. దీనిపైనే వివాదం రేప‌వ‌చ్చు....చేయాల‌ని అనుకుంటే?!. సీఎం జ‌గ‌న్ చేసిన మంచి ప‌నిని ప‌క్క‌న‌పెట్టి.!!

ఇక ఈ రాఖీ క‌ట్టిన సంద‌ర్భం విష‌యానికి వ‌స్తే... మహిళలు - బాలికలపై క్రూరమైన నేరాలకు పాల్పడే వారికి ఇక జీవితం ఉండదనే రీతిలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ లా(సవరణ) చట్టం -2019(ఆంధ్రప్రదేశ్‌ దిశ యాక్ట్‌)ను ఏపీ జగన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఆమోదించిన సంగ‌తి తెలిసిందే. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు - ఇతర నేరాలను అరికట్టేందుకు.. కేవలం 21 రోజుల్లో తీర్పు వచ్చేలా తీసుకువచ్చిన దిశ చట్టంతో మహిళలకు మంచి రోజులు వస్తాయని స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే... ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి - హోంమినిస్టర్‌ సుచరిత - మంత్రి తానేటి వనిత - ఏఐసీసీ చైర్మన్‌ రోజాతో పాటు మహిళా ఎమ్మెల్యేలు జగన్‌ ను కలిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపి రాఖీలు క‌ట్టారు.

మహిళలు - బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా.. నిర్ధారించే ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు ఇచ్చేలా చారిత్రాత్మక ముసాయిదా బిల్లుకు బుధవారం ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలప‌డం సంతోష‌క‌ర‌మ‌ని ఈ సంద‌ర్భంగా మ‌హిళా నేత‌లు పేర్కొన్నారు. మహిళల రక్షణ, భద్రతకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి తీసుకువచ్చిన దిశ చట్టం.. దేశవ్యాప్తంగా మహిళలపై దాడులను అరికట్టి - మంచి పరిణామాలు తీసుకు రావడానికి కొంతమేర కారణం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.