Begin typing your search above and press return to search.

నాన్న మీద ఆన : పాలేరుకు పెద్ద పాలేరును ...?

By:  Tupaki Desk   |   19 Jun 2022 10:30 AM GMT
నాన్న మీద ఆన : పాలేరుకు పెద్ద  పాలేరును ...?
X
నాన్న నా ఆస్తి నాన్న నా చిరునామా. నన్నెవరు అడ్డేది, నాన్న పిలుపే నా గెలుపు అంటున్నారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఫాదర్స్ డే వేళ తండ్రిని తలచుకుని మరీ తన రాజకీయ కార్యాచరణను ప్రకటించేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నుంచి తాను పోటీ చేయనున్నట్లుగా షర్మిల చేసిన ప్రకటన ఒక విధంగా తెలంగాణా రాజకీయాల్లో సంచలనమే. ఆమె వైఎస్సార్ తనయగా తెలంగాణా ప్రజలకు పరిచయం.

వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ గా ఆమె కాలికి బలపం కట్టుకుని తెలంగాణా రోడ్లను మైళ్ళకు మైళ్ళు కొలుస్తున్నా కూడా ప్రధాన రాజకీయ పార్టీలకు అసలు పట్టడంలేదు. ఆమె బలం ఎంత అన్నది కూడా అంచనా లేదు. ఆమె తరఫున ఎంతమంది గెలుస్తారు అన్నది పక్కన పెడితే షర్మిల వచ్చే ఎన్నికల తరువాత అసెంబ్లీలోకి రాగలరా అన్న చర్చ కూడా ఉంది.

దానికి జవాబు అన్నట్లుగా ఎన్నికలకు ఏడాదిన్నర ముందే షర్మిల తాను పోటీ చేసే సీటుని వెతుక్కున్నారు. అక్కడ ఆమె కుదురుకుంటానని చెప్పేశారు. ఇక పాలేరు విషయానికి వస్తే కాంగ్రెస్ కి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ప్రాంతం. అంతే కాదు రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఏరియా. ఇక వైఎస్సార్ అభిమానులు దండీగా ఉన్న చోటు కూడా ఇదే. అందుకే అన్నీ ఆలోచించి ఆమె ఇక్కడ పాగా వేయాలని నిర్ణయించుకున్నారు.

పాలేరులో టీయారెస్ వీక్ గానే ఉంది అని లెక్కలు చెబుతున్నాయి. ఇక ఇపుడు కాంగ్రెస్ కూడా పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు అని కూడా ఆమె ఊహించుకుంటున్నార్ట. సో ఎలా చూసుకున్నా తెలంగాణాలోని 119 నియోజకవర్గాల్లో నూటికి నూరు శాతం తాను గెలిచే సీటు ఇదే అని షర్మిల బలంగా నమ్ముతున్నారు. ఇక తన ఆస్తి రాజన్న అని తండ్రిని తలచుకున్నారు. భారం అంతా తండ్రి మీద పెట్టేశారు.

ఇలా షర్మిల ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే తెలంగాణాలో టీయారెస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ కూడా పోటీలో ఉంటాయి. ఇక పాలేరులో వామపక్షాలకు కూడా బలం ఉంది. సీటు చూసుకోవడం కాదు, జనాల అభిమానం చూసుకోవాలి. అంతే కాదు వైఎస్సార్ అభిమానులు అంతా బూతుల వద్ద నిలిచి ఓట్లు వేయించే పార్టీ యంత్రాంగం కూడా ఉండేలా చూసుకోవాలి. అపుడే షర్మిల అనుకున్న రాజకీయం పండుతుంది.

ఇక చూస్తే పాలేరు సెగ్మెంట్ ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలకు సరిహద్దుల్లో ఉంటుంది. దాంతో ఆంధ్రాలోని వైఎస్సర్ ఫ్యాన్స్ కూడా సహకరిస్తారు అన్న లెక్కలేవో ఉన్నాయట. మొత్తానికి షర్మిల తాను అయినా గెలవాలని చూస్తున్నారు. ఎన్నికల నాటికి ఏ రకమైన పరిణామాలు జరుగుతాయో తెలియదు కానీ నాన్న మీద ఆన అని ఒట్టేసి మరీ పాలేరు జనాలకు పాలేరుగా ఉంటాను అంటున్నారు. మరి ఆమె బరువు బాధ్యతలు అంతా పైనున్న వైఎస్సారి, దిగువన ఉన్న వైఎస్సార్ అభిమానులే చూసుకోవాలి.