Begin typing your search above and press return to search.

నాన్నను కుట్ర చేసి చంపారు.. నన్ను చంపడానికి కుట్రలు.. బేడీలతో ప్రెస్ మీట్లో షర్మిల హల్ చల్

By:  Tupaki Desk   |   18 Sep 2022 6:48 AM GMT
నాన్నను కుట్ర చేసి చంపారు.. నన్ను చంపడానికి కుట్రలు.. బేడీలతో ప్రెస్ మీట్లో షర్మిల హల్ చల్
X
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెచ్చిపోయారు. ప్రెస్ మీట్ కు ఏకంగా పోలీస్ బేడీలతో వచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. తెలంగాణలో దాదాపు 2వేల కి.మీల పాదయాత్ర చేసినా కూడా వైఎస్ షర్మిలకు ఆశించిన ప్రయోజనం, ఆదరణ దక్కలేదన్న ప్రచారం ఉంది. అందుకే ప్రజల్లో ఫోకస్ కావడానికి ఈ మధ్య టీఆర్ఎస్ నేతలతో పెట్టుకుంటోందని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. ఇటీవల టీఆర్ఎస్ నేతలను బండ బూతులు తిట్టడంతో వారంతా స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ పరిణామంతో వైఎస్ షర్మిలకు మంచి మైలేజ్ వచ్చింది.

దీంతో ఇదే అస్త్రంతో తాజాగా సెంటిమెంట్ ను జోడించి ప్రెస్ మీట్ కు వచ్చినట్టుగా తెలుస్తోంది. తాజాగా పోలీస్ బేడీలతో ప్రెస్ మీట్ కు వచ్చిన షర్మిల రెచ్చిపోయారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు తనను కూడా చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. తాను పులిబిడ్డను అని.. తనకు భయం లేదని ఆమె చెప్పారు. కేసులు పెడితే భయం లేదని.. దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటూ షర్మిల కేసీఆర్ సర్కార్ కు నేరుగా సవాల్ చేశారు.

వనపర్తి పాదయాత్ర ప్రెస్ మీట్ లో షర్మిల చేసిన ఈ కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. కుట్ర చేసి వైఎస్ చంపారని ఆమె ఆరోపించారు. తనని కూడా చంపాలని చూస్తున్నారని అన్నారు.

పాదయాత్ర ఆపేందుకు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కుట్రలు చేస్తున్నారని.. మంత్రి నిరంజన్ రెడ్డిది నోరా? మోరీనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళలకు గౌరవం లేదా? అని ప్రశ్నించారు. పోలీసులు టీఆర్ఎస్ కు గులాంగిరి చేస్తున్నారన్నారు. నన్ను అరెస్ట్ చేసి పాదయాత్ర ఆపాలని చూస్తున్నారని విమర్శించారు.

మంత్రి నిరంజన్ రెడ్డి తనపై ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ పెట్టారని.. తనను మరదలు అన్నందుకు ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టరా? అని షర్మిల మండిపడ్డారు. నా ఆత్మాభిమానం దెబ్బతీస్తున్నారని.. తెలంగాణలో మహిళల మీద గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. పోలీస్ శాఖను టీఆర్ఎస్ లో విలీనం చేయండి అంటూ షర్మిల మండిపడ్డారు.

పాదయాత్రకు మైలేజ్ రావడం లేదని భావిస్తున్న షర్మిల ఇలా ప్రెస్ మీట్ లో బేడీలు పట్టుకొని.. వైఎస్ఆర్ మరణాన్ని.. తన హత్యకు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నట్టు టీఆర్ఎస్ శ్రేణులు అనుమానిస్తున్నాయి. అధికార పార్టీని తిడితే రియాక్షన్ వస్తుందని.. ఫేమస్ అయిపోవాలని చూస్తోందని... ఆమె మాటలపై స్పందించవద్దని టీఆర్ఎస్ పెద్దలు సూచించినట్టు తెలిసింది. ఆమెను అనవసరంగా ఫేమస్ చేయవద్దని ఆదేశాలిచ్చినట్టు సమాచారం.