Begin typing your search above and press return to search.

యాదాద్రిలో సారూ.. కారు బొమ్మ వ్యవహారం రచ్చ రచ్చ

By:  Tupaki Desk   |   6 Sep 2019 12:20 PM GMT
యాదాద్రిలో సారూ.. కారు బొమ్మ వ్యవహారం రచ్చ రచ్చ
X
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంలో నిర్మిస్తున్న ఆలయ శిలల మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు కారు.. టీఆర్ఎస్ పథకాల బొమ్మలు చెక్కించిన వైనం బయటకు రావటం.. అదో సంచలనంగా మారటం తెలిసిందే. ఈ అంశంపై వేస్తున్న ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు.

గుట్టుగా బొమ్మలు చెక్కిన అంశం.. ప్రముఖ మీడియా అచ్చేసిన ప్రత్యేక కథనంతో బయటకు రావటంతో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. గుడిలో ఏర్పాటుచేసిన శిలలపై ముఖ్యమంత్రి బొమ్మ.. పార్టీ గుర్తులను ఎలా చెక్కిస్తారంటూ వేస్తున్న ప్రశ్నలతో గులాబీ పరివారం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

ఈ అంశంపై యాదాద్రి టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్ కిషన్ రావు రియాక్ట్ అవుతూ.. ఈ బొమ్మల విషయం తమకు తెలీదని.. స్తపతితో మాట్లాడి వివరణ తీసుకుంటానని చెప్పారు. ఆలయంలో ఇలాంటి బొమ్మలు ఎలా చెక్కిస్తారన్న ప్రశ్నకు.. ఆ విషయం తనకు జరిగిందన్నది తెలీదని.. పత్రికల్లో వచ్చిన విషయాల్ని ఒకసారి చెక్ చేసుకోవాలంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ అంశంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తీవ్రంగా తప్పు పడుతున్నాయి. కేసీఆర్ అహంకారానికి ప్రతీకగా పలువురు నేతలు అభివర్ణిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. గుడిలో సారు..కారు.. సర్కారు పథకాల బొమ్మలు కొత్త రచ్చకు కారణమయ్యాయని చెప్పక తప్పదు.