Begin typing your search above and press return to search.

యువరాజ్ గొంతు కోస్తానన్న ఇంగ్లండ్ బౌలర్

By:  Tupaki Desk   |   29 April 2016 5:13 AM GMT
యువరాజ్ గొంతు కోస్తానన్న ఇంగ్లండ్ బౌలర్
X
దాదాపు తొమ్మిదేళ్ల క్రితం జరిగిన ఒక చారిత్రక ఘటనకు సంబంధించి స్వీట్ మెమరీస్ ను షేర్ చేసుకునే క్రమంలో టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒక సంచలన విషయాన్ని చెప్పుకొచ్చారు. క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల మద్య మాటల మంటలు ఏ స్థాయిలో ఉంటాయన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టటానికి కారణం ఏమిటన్న అసలు విషయాన్ని బయటకు వెల్లడించారు. యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరుసిక్సర్లు కొట్టానికి ముందు.. ఇంగ్లండ్ బౌలర్ ఫ్లింటాప్ తో గొడవ పడటం తెలిసిందే.

అయితే.. వారిద్దరి మధ్య ఏం మాటలు నడిచాయన్నది ఇప్పటివరకూ బయటకు రాలేదు. ఆ తర్వాతి ఓవర్ ను వేసిన స్టువర్ట్ బ్రాడ్ కు చుక్కలు చూపిస్తూ అతను వేసిన ఆరుబంతుల్ని ఆరు సిక్సర్లుగా మలచటం ఒక స్వీట్ మెమరీగా మారటమేకాదు.. పొట్టి ఫార్మెట్ లో స్పీడ్ హాఫ్ సెంచరీ రికార్డును యూవీ పేరిట నమోదయ్యేలా చేసింది. యూవీ వరుస సిక్సర్లు కొట్టటానికి ముందు ఫ్లింటాఫ్ తో నడిచిన మాటల్ని తాజాగా బయట పెట్టారు యువరాజ్.

ఒక టీవీ షోలో ఈ విషయాల్ని బయట పెట్టిన ఆయన.. తమ ఇద్దరి మధ్య నడిచిన అభ్యంతరకర పదాల్ని చెప్పేందుకు ఇష్టపడలేదు. కానీ.. జరిగిన ఉదంతాన్ని మాత్రం చెప్పుకొచ్చారు.‘‘నీ షాట్లు కామెడీగా ఉన్నాయంటూ యూవీని ఉద్దేశించి ఫ్లింటాప్ వ్యాఖ్యానించాడు. అతను ఆ మాటలు అనటానికి కారణం.. అతని బౌలింగ్ లో రెండు బౌండరీలు కొట్టా. దీనికి నేను ఘాటుగా సమాధానం ఇచ్చా. నా మాటలతో అతను ఆగ్రహం చెందాడు. ఏం మాట్లాడుతున్నావ్ అని అడిగాడు. నేనేం అన్నానో నువ్వు విన్నావుగా అని బదులిచ్చా. దాంతో మరింత ఆవేశపడి.. నీ గొంతు కోస్తా అని అన్నాడు. దీంతో కోపం వచ్చి.. నా బ్యాట్ చూశావుగా.. దాంతో నిన్ను ఎక్కడ కొడతానో తెలుసా? అంటు బదులిచ్చా. ఈ సంబాషణతో చాలా కోపం వచ్చింది. తర్వాత ఓవర్లో ప్రతి బంతిని స్టేడియం బయటకు బాదాలని నిర్ణయించుకున్నా. అలానే కొట్టా. అవన్నీ సిక్సర్లుగా మారాయి. ఇలాంటి ఆవేశం కొన్నిసార్లు మంచి చేస్తాయి. కొన్నిసార్లు ప్రతికూలంగా మారతాయి. ఆ రోజు మాత్రం.. ఆవేశం ప్రత్యర్థుల్ని దెబ్బ తీసిందని అనుకుంటున్నా’’ అంటూ గతాన్ని రివీల్ చేశాడు.