Begin typing your search above and press return to search.

అపర కుబేరుడికి గాళ్ ఫ్రెండ్ కావాలట

By:  Tupaki Desk   |   13 Jan 2020 10:39 AM GMT
అపర కుబేరుడికి గాళ్ ఫ్రెండ్ కావాలట
X
అతడో అపర కుబేరుడు. సంపద కు.. సంపాదన కు ఏ మాత్రం లోటు లేదు. ఇతగాడి తీరు ఎలా ఉంటుందన్న దానికో చిన్న ఉదాహరణ చెప్పొచ్చు. ఇటీవల అతగాడి ట్విట్టర్ అకౌంట్లో తనను ఫాలో అయ్యే వెయ్యి మంది ఫాలోయర్స్ కు ఏకంగా రూ.65 కోట్ల మొత్తాన్ని పంచేసి సంచలనం గా మారారు. అంతేనా.. తనకు నచ్చాలే కానీ డబ్బు ఖర్చు చేయటానికి అస్సలు వెనకాడడు.

ఇంతకీ అతగాడి పేరేమిటి? ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తుంటాడు? ఇప్పుడు అతగాడికి అర్జెంట్ గా గాళ్ ఫ్రెండ్ అవసరం ఎందుకొచ్చింది? మధ్యలో ఈ చందమామ టూర్ ఏమిటి? లాంటి విషయాల్లోకి వెళితే..సంచలన ప్రకటనలకు.. నిర్ణయాలకు.. చేష్టలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే జపాన్ కుబేరుడు.. ఆన్ లైన్ ఫ్యాషన్ వ్యాపార దిగ్గజం యుసాకు మేజావా అనే వ్యాపారవేత్త సంచలన ప్రకటన చేశారు.

నలభైనాలుగేళ్ల వయసులో ఇప్పటికే ఇద్దరితో ప్రేమాయాణం.. జీవితాన్ని పంచుకొని బ్రేకప్ చెప్పేసిన అతను ఇప్పుడు సింగిల్ స్టేటస్ లో ఉన్నాడు. అయితే.. సింగిల్ గా ఉండటం ఇతగాడికి ఈ మధ్యన అస్సలు నచ్చట్లేదట. అందుకే.. తనకో గాళ్ ఫ్రెండ్ కావాలంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేశాడు.

ఈ మధ్యనే జపాన్ కు చెందిన ప్రముఖ నటికి బ్రేకప్ చెప్పిన మేజావా.. తానిప్పుడు లైఫ్ టైం పార్టనర్ కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. తన కొత్త గాళ్ ఫ్రెండ్ అన్వేషణ ప్రక్రియను ఒక వెబ్ స్ట్రీమింగ్ సర్వీసు ద్వారా టీవీ షోగా మారుస్తానని వెల్లడించాడు కూడా. మధ్య వయసులో ఉన్న తాను ఒంటరినన్న్ భావన ఈ మధ్యన ఎక్కువ అవుతుందని.. అందుకే తాను మరో భాగస్వామి కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. ఈసారి తాను ఎంపిక చేసుకునే అమ్మాయితో జీవితాంతం ఉండాలని భావిస్తున్నట్లు చెప్పాడు.

గతంలోని ఇద్దరు భార్యలతో ముగ్గురు సంతానం ఉన్న అతగాడు.. తన కొత్త గాళ్ ఫ్రెండ్ గా ఎంపికయ్యే అమ్మాయితో చంద్రుడికి వద్దకు వెళ్లే టూర్ లో తనతో పాటు తీసుకెళతానని చెప్పాడు. గాళ్ ఫ్రెండ్ కోసం అప్లికేషన్లు పెట్టాలనుకునే వారికి ఈ నెల 17 వరకు మాత్రమే టైమిచ్చాడు. అప్లికేషన్లు పెడుతున్న వారిలో ఎంపికైన వారితో డేటింగ్ లకు వెళుతూ.. ఫైనల్ గా వారిలో ఒకరిని మార్చి నాటికి జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు.

స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన వ్యోమనౌకలో చంద్రమండల యాత్రకు తొలి ప్రైవేటు ప్యాసింజర్ గా అతగాడు ఇప్పటికే బుక్ చేసుకున్నాడు. తనతో పాటు.. తాను ఎంపిక చేసుకునే జీవిత భాగస్వామిని కూడా తనతో తీసుకెళ్లనున్నట్లు చెప్పాడు. ఇతగాడి నిర్ణయాలు ఎలా ఉంటాయనటానికి నిదర్శనంగా ఒక ఉదాహరణను చెప్పొచ్చు. ఏడాది క్రితం ఇతగాడికి ఒక పెయింటింగ్ నచ్చటంతో దాన్ని 11.50 కోట్ల డాలర్లు పెట్టి కొనేసి వార్తల్లో నిలిచారు. ఇలా చిత్ర విచిత్రమైన తీరును ప్రదర్శించే జపాన్ కుబేరుడి కొత్త గాళ్ ఫ్రెండ్ స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారన్నది తేలాలంటే మార్చి వరకూ వెయిట్ చేయాల్సిందే.