Begin typing your search above and press return to search.

ఈసీ దృష్టికి వెళ్లిన బాబు ఫిరాయింపుల ప‌ర్వం

By:  Tupaki Desk   |   12 April 2017 9:46 AM GMT
ఈసీ దృష్టికి వెళ్లిన బాబు ఫిరాయింపుల ప‌ర్వం
X
ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. ఫిరాయింపుల్ని ప్రోత్స‌హిస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై పోరాటాన్ని ఉధృతం చేస్తోంది ఏపీ ప్ర‌తిప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్ర‌తిప‌క్ష పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేల్ని త‌మ పార్టీలోకి తీసుకోవ‌టం తెలిసిందే. జంపింగ్‌కు పాల్ప‌డిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు ఫిర్యాదు స్పీక‌ర్ వ‌ద్ద పెండింగ్ ఉన్న వేళ‌.. అందులోని ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన చంద్ర‌బాబు తీరుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

నిత్యం నీతులు చెప్పే చంద్ర‌బాబు లాంటి నేత‌.. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు పెద్ద ఎత్తున మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌టం ఏమిట‌న్న విస్మ‌యాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే అంశాన్ని జాతీయ స్థాయిలో ప‌లువురు నేత‌ల దృష్టికి తీసుకెళ్ల‌టం.. ఏపీలో జ‌రుగుతున్న దార‌ణ రాజ‌కీయం గురించి.. చంద్ర‌బాబు వ్య‌వ‌హార‌శైలి గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వివ‌రించ‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా జ‌గ‌న్ పార్టీకి చెందిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎన్నిక‌ల క‌మిష‌న్ ను ఢిల్లీలో క‌లిశారు. ఏపీలో టీడీపీ స‌ర్కారు ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంద‌ని.. ఫిరాయింపు ఎమ్మెల్యేల్ని అధికార‌పార్టీలో చేర్చుకోవ‌ట‌మే కాదు.. వారితో రాజీనామా చేయించ‌కుండానే న‌లుగురికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌టంపై ఫిర్యాదు చేశారు.

త‌మ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం సానుకూలంగా స్పందించింద‌ని వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. నిర్ణీత స‌మ‌యంలో స్పీక‌ర్ కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకోని ప‌క్షంలో నోటీసులు పంపుతామ‌ని ఎన్నిక‌ల సంఘం చెప్పిన‌ట్లుగా పేర్కొన్నారు. మ‌రి.. బాబు తీరుకు ఈసీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.