Begin typing your search above and press return to search.

టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి...ఆర్డర్స్ రిలీజ్

By:  Tupaki Desk   |   21 Jun 2019 3:52 PM GMT
టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి...ఆర్డర్స్ రిలీజ్
X
వైసీపీ కీలక నేత - ఆ పార్టీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైవీ సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కాసేపటి క్రితం జగన్ సర్కారు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గడచిన ఎన్నికల్లో పార్టీ సమీకరణాల్లో భాగంగా తన సిట్టింగ్ సీటు ఒంగోలు లోక్ సభ స్థానాన్ని త్యాగం చేసిన వైవీ సుబ్బారెడ్డికి కీలక పదవి దక్కుతుందన్న ఊహాగానాలు వెలువడ్డాయి. రాజ్యసభకు పంపుతారని అంతా అనుకున్నా... అంతకంటే ముందుగానే టీటీడీ చైర్మన్ పదవిని కేటాయించి... పార్టీ కోసం సీటును త్యాగం చేసిన తన బాబాయికి జగన్ న్యాయం చేశారన్న వాదన వినిపిస్తోంది. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి... జగన్ సీఎం అయిన వెంటనే పదవీ బాధ్యతలు చేపడతారని వార్తలు వినిపించాయి. అయితే ఆ పదవిలో ఉన్న టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేసే విషయంలో మంకుపట్టు పట్టడంతో కాస్తం ఆలస్యమైంది.

జగన్ కేబినెట్ లో దేవదాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెలంపల్లి శ్రీనివాస్... మొన్న తిరుమల వెంకన్న దర్శనం సందర్భంగా టీటీడీ పాలకమండలిని రద్దు చేస్తున్నామని ప్రకటించడంతో దారికి వచ్చిన పుట్టా తన పదవికి రాజీనామా చేశారు. టీటీడీ పాలక మండలికి చైర్మన్ - సభ్యులు రాజీనామాలు చేయకుండా కొత్త పాలక మండలిని ప్రకటించడం కుదరదు. ఈ కారణంగానే టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని ఎప్పుడో ఖరారు చేసుకున్న వైవీ సుబ్బారెడ్డి.. పుట్టా రాజీనామా చేసేదాకా ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు పుట్టా కూడా రాజీనామా చేయడంతో జగన్ సర్కారు... టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తున్నట్లుగా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రేపో - ఎల్లుండో టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి.