Begin typing your search above and press return to search.

బేరం ఫైనలైన తరువాతే జలీల్ చేరిక

By:  Tupaki Desk   |   21 Feb 2016 6:15 AM GMT
బేరం ఫైనలైన తరువాతే జలీల్ చేరిక
X
విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే - వైసీపీ నేత జలీల్‌ ఖాన్ టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల చంద్రబాబును ఆయన కలవడంతో ఈ దిశగా ప్రచారం జరిగిన ఆ ప్రచారాన్ని జలీల్ ఖండించారు. కానీ, తాజా పరిణామాలు మాత్రం ఆయన చేరిక ఖాయమని చెబుతున్నాయి. ముఖ్యంగా మంత్రి దేవినేని ఉమాతో జలీల్ వరుస భేటీలు జరుపుతున్నారు. టీడీపీలో తనకు దక్కాల్సిన ప్రాధాన్యం, పదవులపై జలీల్ ముందే మాట్లాడుకుంటున్నారని... అవన్నీ తేలగానే చేరుతారని తెలుస్తోంది.

జలీల్‌ తన సోదరుడు, కుమారుడు మరో ఇద్దరు ముగ్గురితో కలసి త్వరలో చంద్రబాబును కలిసే ఆలోచనలో వున్నట్టు సమాచారం. ఆ భేటీలోనే అన్ని విషయాలు ఫైనల్‌గా మరోసారి మాట్లాడాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. భవానీపురంలో నిర్మించే హజ్‌ హౌస్‌ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించే విషయమై ఆయనను కలవనున్నప్పటికీ అసలు అజెండా మాత్రం టీడీపీలో చే రే అంశం పైనే చర్చ జరపనున్నట్టు తెలిసింది. ప్రధానంగా వచ్చే ఎన్నికలలో పశ్చిమ నియోజకవర్గ సీటుపై హామీ పొందడంతోపాటు ఆయన మంత్రి పదవిని కూడా ఆశిస్తున్నారు. అయితే ఇంతకుముందు జరిగిన చర్చలలో చంద్రబాబు సీటు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారు. కాని మంత్రి పదవిపై ఎటువంటి హామీ ఇవ్వలేదు. దీంతో టీడీపీలో చేరే విషయాన్ని జలీల్‌ఖాన్ వాయిదా వేస్తూ వచ్చారు. మంత్రి దేవినేని ఉమాతో జలీల్‌ రెగ్యులర్ గా టచ్ లో వుంటున్నారు. శనివారం కూడా ఆయనతో భేటీ అయ్యారు. పార్టీలో చేరితే ఆయనకు మైనారిటీ కార్పోరేషన్ పదవి ఇవ్వడానికి చంద్రబాబు సుముఖంగా వున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా జలీల్‌ ఖాన్ ను చేర్చుకుంటే ముస్లింలలో పట్టు పెరుగుతుందని టీడీపీ భావిస్తోంది. 2014 ఎన్నికలలో టీడీపీ పశ్చిమ సీటు ముస్లింల కోటాలో విజయవాడ టీడీపీ మాజీ అర్బన్ అధ్యక్షుడు నాగుల్‌ మీరాకు ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ కారణాలతో చివరి నిమిషంలో ఆసీటును బీజేపీకి కేటాయించింది. బీజేపీకి అక్కడ బలం ఏమీ లేనప్పటికీ టీడీపీ మద్దతుతో గెలుపు వరకు వచ్చినా చతికిల పడింది. బుద్దా వెంకన్న ఫ్లైఓవర్‌ కోసం చేసిన పోరాటం ద్వారా ఆ నియోజకవర్గంలో బలం పెంచుకున్న టీడీపీ ముస్లింల మద్దతు కూడా వుంటే నియోజకవర్గంలో పునాదులు గట్టిగా వుంటాయనే భావనతోనే జలీల్‌కు పెద్ద పీట వేస్తున్నట్టు భావిస్తున్నారు. అయితే చాలా కాలంగా పార్టీనే నమ్ముకున్న నాగుల్‌ మీరాను ఏం చేస్తారన్నది చూడాలి.