Begin typing your search above and press return to search.

దావూద్ ఆస్తుల వార్తలన్నీ బుస్సేనంట

By:  Tupaki Desk   |   7 Jan 2017 1:55 PM GMT
దావూద్ ఆస్తుల వార్తలన్నీ బుస్సేనంట
X
ఇప్పుడీ వార్త చదివితే గుండెలు బాదుకోవాల్సిందే. దేశంలో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒకటి కాదు రెండు కాదు.. ఆ పత్రిక.. ఈ పత్రిక అన్న తేడా లేకుండా అన్నీ జాతీయ.. ప్రాంతీయ పత్రికలు.. విశ్వసనీయతకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పే మీడియా సంస్థలు రాసి పారేసిన వార్త అడ్డదిడ్డమని.. అసలు నిజమే కాదన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన రూ.15వేల కోట్ల విలువైన ఆస్తుల్ని యూఏఈ ప్రభుత్వం జఫ్తు చేసిందని.. దీనికి క్రెడిట్ అంతా ప్రధాని మోడీకే దక్కుతుందంటూ.. రెండు రోజుల క్రితం వార్తాసంస్థల్లో వార్తలు భారీగా వచ్చాయి. అంతేనా.. చివరకు బీజేపీ సైతం.. సోషల్ మీడియాలోని తన అధికారిక ఖాతాలో ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ.. తమ నాయకుడి గొప్పతనాన్ని.. వీరత్వాన్ని పొడిగేసిన వైనం మర్చిపోలేం.

మరింత భారీగా ప్రచారమైన వార్తలో నిజం ఎంతన్న సందేహం చాలామందికి రాలేదు. కానీ.. ఈ వార్తను చూసిన చాలామంది సీనియర్ జర్నలిస్టులకు వచ్చేసింది. అంతే.. ఎవరికి వారు తమకున్న పరిచయాల్ని.. నెట్ వర్క్ ను కదిపారు. అధికార గణాన్ని సంప్రదించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ వార్తకు సంబంధించిన అధికారిక ధ్రువీకరణ ఏ ఒక్కరూ చెప్పకపోయేసరికి.. యూఏఈలో ఉన్న అధికారుల్ని.. జర్నలిస్టులను కాంటాక్ట్ చేశారు. అయినా.. ఎలాంటి ఫలితం లేకపోగా.. ఇలాంటి వార్త తమ దగ్గర అస్సలు రాలేదే? అంటూ ఆశ్చర్యపోయేసరికి.. షాక్ తినటం సీనియర్ జర్నలిస్ట్ ల వంతైంది. వెంటనే.. వారు.. ఈ వార్తకుమూలం ఎక్కడుందన్న శోధన రివర్స్ గేర్ లో షురూ చేశారు.

అలా తవ్వుకుంటూ పోతే.. ఈ వార్తను తొలుత ఇచ్చింది జీ న్యూస్ అన్నది తేల్చారు. ఈ వార్త దగ్గర ‘‘జీ న్యూ బ్యూరో’’గా పేర్కొన్నారు. దీని సోర్స్ ఏమిటి? ఈ వార్తకు సంబంధించిన అధికారిక సమాచారం ఎక్కడ ఉందన్న వాస్తవాన్ని తెలుసుకునేందుకు జీ న్యూస్ బ్యూరోను పలువురు సీనియర్ జర్నలిస్టులు సంప్రదించారు. అయితే..ఆయన నుంచి సమాధానం లేదు.

ఇలా కాదనుకొని.. ఏకంగా బీజేపీ వర్గాల్ని ప్రశ్నించినప్పుడు.. వారి నుంచి ఎలాంటి సమాచారం రాని పరిస్థితి. ఇక.. ఈ వార్తను ప్రచురించిన పెద్ద పెద్ద మీడియా సంస్థల వార్తల్ని మరోసారి నిశితంగా చదివితే అప్పుడో ఆసక్తికర అంశం కనిపించింది. అదేమిటంటే.. ‘‘ఎకార్డింగ్ టు మీడియా రిపోర్ట్స్’’ అంటూ కొన్ని మీడియా సంస్థలు తామిస్తున్న సమాచారం తమది కాదని.. కొన్ని మీడియా రిపోర్ట్స్ ఆధారంగానే వార్తను ఇచ్చినట్లుగా పేర్కొనటం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే.. మోడీ ఇమేజ్ ను భారీగా పెంచేసిన ఒక వార్తకు సంబంధించిన అసలుసిసలు నిజం ఏమిటన్నది కంటికి కనిపించకుండా.. ఆధారాలు లేకుండా ఎంతగా పాపులర్ కావటం చూస్తే.. రోజువారీగా మనం చూసే వార్తల్లో నిజాలు ఎన్ని? కల్పితాలు ఎన్ని? అన్న సందేహం కలగక మానదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/