Begin typing your search above and press return to search.

దేశంలో జికా వైరస్ కలకలం ..జాగ్రత్తలు తీసుకోవాల్సిందే !

By:  Tupaki Desk   |   13 Nov 2021 4:30 PM GMT
దేశంలో జికా వైరస్ కలకలం ..జాగ్రత్తలు తీసుకోవాల్సిందే !
X
దేశంలో కొన్ని రాష్ట్రాల్లో జికా వైరస్‌ కేసులు రోజురోజు కి ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ వైరస్ ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. డెంగ్యూ, మలేరియా మాదిరిగానే జికా వైరస్ కూడా దోమల ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

డెంగ్యూ మాదిరిగానే ఈ వైరస్ కూడా చాలా ప్రమాదకరం. కాబట్టి, దీనిని నుంచి రక్షణ పొందే మార్గాలను అనుసరించాలి. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన డాక్టర్ అమరీందర్ సింగ్ మల్హి మాట్లాడుతూ జికా ఒక ప్రమాదకరమైన వైరస్. ఇందులో మరణాల రేటు చాలా ఎక్కువ.

తరచుగా పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించని వ్యక్తులు లేదా దోమలు ఎక్కువ సంఖ్యలో వృద్ధి చెందే ప్రాంతాల్లో ఈ వైరస్ బారిన పడతారు. డాక్టర్ అమరీంద్ర ప్రకారం, జికా వైరస్ సంక్రమణ చాలా ప్రమాదకరమైనది. దీనివలన ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి కూడా రావచ్చు.

దీని ప్రారంభ లక్షణాలు జ్వరం, శరీరంపై దద్దుర్లు, కీళ్ల నొప్పులు, వాంతులు, విరేచనాలు. దోమల బారిన పడకుండా శరీరం మొత్తం కప్పేలా దుస్తులు ధరించాలి. మంచంపై దోమతెరను పెట్టుకోవాలని డాక్టర్ అమరీందర్ సింగ్ మల్హి ప్రజలకు సూచించారు. చుట్టుపక్కల ఎక్కడైనా నీరు పేరుకుపోతే, దానిని శుభ్రం చేయండి. జికా నివారణకు డెంగ్యూ నివారణకు అవలంబిస్తున్న పద్ధతులు కూడా అవసరం. అని ఆయన వివరించారు.

గర్భిణీ స్త్రీలు ఈ వైరస్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గర్భిణీ స్త్రీకి ఈ వైరస్ సోకినట్లయితే, ఆమె బిడ్డ మానసికంగా బలహీనపడవచ్చు. చాలా సందర్భాలలో, పిల్లవాడు మైక్రోసెఫాలీ అనే సమస్య బారిన పడే అవకాశం ఉంటుంది. ఇందులో నవజాత శిశువు మెదడు, తల సాధారణ పరిమాణం కంటే చిన్నవిగా మారతాయి.

గర్భిణీ స్త్రీలు ఈ వైరస్ కు సంబంధించిన ఏవైనా లక్షణాలను గమనిస్తే, వారు రక్తం లేదా మూత్ర పరీక్ష కోసం వైద్యుడిని సంప్రదించాలి.చాలా సందర్భాలలో ఈ వైరస్ రక్తమార్పిడి సమయంలో కూడా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఒక వ్యక్తి క్రమం తప్పకుండా రక్తం తీసుకుంటే, అతను చాలా జాగ్రత్తగా ఉండాలి. జికా వైరస్ సోకిన కొంతమందికి గులియన్ బారే సిండ్రోమ్ కూడా వస్తుంది. ఈ సిండ్రోమ్ ప్రమాదకరమైన వ్యాధి అని సంబంధిత వైద్యులు చెప్తున్నారు.