Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియా ఇజ్జత్ పాయే.. మొన్న లంక చేతిలో.. నేడు జింబాబ్వే చేతిలో..

By:  Tupaki Desk   |   3 Sep 2022 8:30 AM GMT
ఆస్ట్రేలియా ఇజ్జత్ పాయే.. మొన్న లంక చేతిలో.. నేడు జింబాబ్వే చేతిలో..
X
పసికూన జింబాబ్వే రాటుదేలుతోంది. మొన్న ఇండియా దగ్గర దాని పప్పులు ఉడకలేదు కానీ.. అంతకుముందు బంగ్లాదేశ్ ను ఓడించి షాకిచ్చింది. ఇప్పుడు ఏకంగా ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఔరా అనిపించింది. ఆస్ట్రేలియా లాంటి ఆజేయ జట్టు ఇలా పసికూన జింబాబ్వే చేతిలో ఓడిపోవడం చూసి క్రికెట్ ప్రపంచం నెవ్వెరపోయింది.

ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. మూడు వికెట్ల తేడాతో ఆతిథ్య కంగారూలను ఓడించి భారీ షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించి జింబాబ్వే సంచలనం సృష్టించిందనే చెప్పాలి. తద్వారా మూడు వన్డేల సిరీస్ ను 2-1తో తగ్గించి మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయకుండా అడ్డుకుంది.

మొదటి రెండు వన్డేల్లో ఆస్ట్రేలియా ఈజీగానే గెలిచింది. ఏకపక్ష విజయం సాధించింది. ఇక నామమాత్రపు మూడో వన్డేలో కూడా ఆస్ట్రేలియానే గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా జింబాబ్వే షాకిచ్చింది.

ఆస్ట్రేలియాను మూడో వన్డేలో ఓడగొట్టింది ఖచ్చితంగా జింబాబ్వే బౌలర్ రియాన్ బర్ల్ మాత్రమే. అతడు 5 వికెట్ల తేడాతో చెలరేగి ఆస్ట్రేలియాను 141 పరుగులకే ఆలౌట్ చేశాడు. ఇందులో 94 పరుగులు ఓపెనర్ డేవిడ్ వార్నర్ చేసినవే కావడం గమనార్హం.

ఇక జింబాబ్వే కూడా లక్ష్యఛేదనలో తడబడింది. కానీ ఓపెనర్ తాడివానాషే, కెప్టెన్ చకబ్వాలు తలో 37 పరుగులు చేసి జింబాబ్వేను గెలిపించారు. 39 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి జింబాబ్వే 142 పరుగులు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో జింబాబ్వేకు సంతోషం.. ఆస్ట్రేలియాకు ఘోర అవమానం మిగిలింది.

గత కొంతకాలంగా జింబాబ్వే ఆకట్టుకునే ప్రదర్శన చేస్తోంది. జులై-ఆగస్టులో బంగ్లాదేశ్ లో పర్యటించిన జింబాబ్వే.. అక్కడ మూడు టీ20ల సిరీస్ ను 2-1తో గెలిచించింది. వన్డే సిరీస్ 2-1తో కైవసం చేసుకొని బంగ్లా పులులకు షాకిచ్చింది. ఇక ఆగస్టులో జింబాబ్వేలో పర్యటించిన భారత జట్టును దాదాపు ఓడించినంత టైట్ ఫైట్ ఇచ్చింది. కానీ సాధ్యం కాలేదు. టీమిండియా సిరీస్ గెలిచింది. ఇప్పుడు ఆసీస్ ను ఓడించి సత్తా చాటింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.