Begin typing your search above and press return to search.

లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఉద్యోగుల తొలగింపుకి సిద్దమైన జొమాటో

By:  Tupaki Desk   |   15 May 2020 12:00 PM GMT
లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఉద్యోగుల తొలగింపుకి సిద్దమైన జొమాటో
X
లాక్‌ డౌన్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆన్ ‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో తమ ఉద్యోగుల్లో 13 శాతం మంది అంటే 520 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ ఉద్యోగులకు నోట్ పంపారు. ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడడానికి వేతనాల్లో కోతలు తప్పవని అన్నారు. లాక్‌ డౌన్ కారణంగా ఆర్థికంగా బాగా నష్టపోయామని, ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు జొమాటో ప్రకటించింది.

లాక్ డౌన్ కారణంగా మన వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. చాలా రెస్టారెంట్లు శాశ్వతంగా మూతపడ్డాయి. వచ్చే 6-12 నెలల మధ్యకాలంలో మరో 25-40 శాతం రెస్టారెంట్లు మూత తప్పదు అని ఉద్యోగులకు పంపిన నోట్‌లో దీపిందర్ తెలిపారు. ఇది వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపిందని, తప్పని పరిస్థితుల్లో కిరాణా సరుకులు డెలివరీ చేయాల్సి వస్తోందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులందరినీ భరించే శక్తి లేదని, అందరికీ పని కల్పించలేమని ఆయన తెలిపారు. కాబట్టి మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం మందిని తొలగించాలని నిర్ణయించినట్టు తెలిపారు

అయితే, ప్రస్తుతం వదులుకుంటున్న వారు మరో ఉద్యోగం చూసుకునేంత వరకు గరిష్టంగా ఆరు నెలల పాటు 50 శాతం జీతాలు చెల్లిస్తామని సంస్థ ప్రకటించింది. స్వచ్చందంగా ముందుకు వచ్చే వారిని ఎంపిక చేయనున్నట్టు తెలిపింది. అలాగే, జూన్ 1 నుంచి సంస్థలోని ఉద్యోగులందరి వేతనాల్లో తాత్కాలికంగా కోతలు ఉంటాయని , తక్కువ వేతనాలు ఉన్న వారికి తక్కువగా, ఎక్కువ వేతనాలు కలిగిన వారికి 50 శాతం వరకు కోతలు ఉంటాయని వివరించారు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిన వెంటనే కోతలు ఆగిపోతాయని, అయితే, దీనికి కనీసం ఆరు నెలలు పట్టే అవకాశం ఉందని దీపిందర్ తెలిపారు.