Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ వేళ.. జూమ్ వాడుతున్నారా.. జర భద్రం

By:  Tupaki Desk   |   17 April 2020 5:00 AM GMT
లాక్ డౌన్ వేళ.. జూమ్ వాడుతున్నారా.. జర భద్రం
X
కరోనా కష్టకాలంలోనూ ఇంట్లో ఉండి బతుకుబండిని లాగించేందుకు ఉన్న ఏకైక మార్గం వర్క్ ఫ్రంట్ హోం. అందరికి కాకున్నా.. కొందరికి మేలు చేసే ఈ విధానానికి తోడ్పాటు ఇస్తున్న మాధ్యమాల్లో జూమ్ యాప్ అసరాగా నిలిచింది. వీడియో కాన్ఫరెన్సులు.. ఆన్ లైన్ లో మాట్లాడుకోవటానికి.. ఇతర అవసరాలకు జూమ్ లో ఉన్నంత సౌలభ్యం మరే యాప్ లో లేకపోవటంతో దీనికి ఆదరణ పెరిగింది.

ఎంతలా అంటే.. లాక్ డౌన్ ముందు వరకూ పెద్దగా పరిచయం లేని జూమ్ యాప్ ఇప్పుడు అందరి నోట నానటమే కాదు.. పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఈ యాప్ లో ఉన్న ఫీచర్ల పుణ్యమా అని మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోని పలు దేశాలు ఈ యాప్ ను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నాయి. అయితే.. ఈ యాప్ నకు సంబంధించిన తాజాగా వెలువడిన వార్నింగ్ షాక్ కు గురి చేసేలా మారింది.

ఈ యాప్ ఏ మాత్రం సురక్షితం కాదని.. దీన్ని వినియోగించే యూజర్ల సున్నితమైన సమాచారాన్ని చోరీ చేయటమే కాదు.. డార్క్ వెబ్ సైట్ లో అమ్మకానికి పెట్టిన తీరును గుర్తిచారు. ఈ యాప్ ను ప్రభుత్వం.. ప్రైవేటు అన్న తేడా లేకుండా వాడేశారు. చివరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లాంటి వారు సైతం వినియోగించారని చెబుతున్నారు. అయితే.. ఈ యాప్ డేటా యాక్సిస్ చేయటానికి చైనాకు అవకాశం ఉందన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు. దీంతో ఈ యాప్ ఏ మాత్రం సేఫ్ కాదని భారత సైబర్ సెక్యురిటీ సంస్థ ప్రకటించింది.

దీంతో కొంత గందరగోళం నెలకొంది. జూమ్ ను వాడేయటం అలవాటుగా మారిన వారికి దీన్ని వాడకుండా ఉండటం కష్టమని చెబుతున్నారు. దీంతో అలెర్ట్ అయిన కేంద్ర హోం శాఖ తాజాగా తానే స్వయంగా రంగంలోకి దిగింది. జూమ్ యాప్ ఏ మాత్రం సేఫ్ కాదని.. దాన్ని వినియోగిస్తే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడటం ఖాయమని హెచ్చరిస్తోంది.

ఈ వాదనకు బలం చేకూరుస్తూ.. ఈ యాప్ ను వినియోగిస్తున్న ఐదు లక్షల వినియోగదారుల డేటా వివరాల్ని హ్యాకర్లు డార్క్ నెట్ లో అమ్మకానికి పెట్టిన వైనం వెలుగు చేసింది. దీంతో.. ఈ యాప్ లో ఉన్న లోపాల కారణంగా దీన్ని వినియోగించే వారికి సంబంధించిన సున్నితమైన.. వ్యక్తిగత సమాచారాన్ని కొల్లగొట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ యాప్ ను వినియోగించటం అంటే.. నిప్పుతో చెలగాటం ఆడినట్లే అన్న మాట వినిపిస్తోంది. సో.. జూమ్ యాప్ ను వాడేస్తున్న వారంతా కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది.

ఒకవేళ జూమ్ యాప్ వాడక తప్పని పరిస్థితి ఉంటే మాత్రం.. ఈ అంశాల్ని పాటిస్తే ప్రమాదాన్ని కొంతమేర తప్పించుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది. అవేమంటే..
% మీటింగ్‌ షెడ్యూల్‌ను ఉద్యోగులకు ఈ-మెయిల్‌ ద్వారా తెలపాలి.
% ప్రతి ఉద్యోగికి యూజర్ఐడీ, పాస్‌వర్డ్‌ ఇవ్వాలి.
% మీటింగ్‌ ప్రారంభం కావటానికి ముందు.. ఎవరూ జాయిన్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
% ‘వెయిటింగ్‌ రూం’ ఫీచర్‌ ను ఉపయోగించుకోవాలి.
% దీంతో ఎవరినైతే కాన్ఫరెన్స్ లోకి ఆహ్వానించాలో వారే వస్తారు. మిగిలిన వారు వెయిటింగ్ రూంలో ఉంటారు.
% ఇన్విటేషన్ లేకుండా ఎవరైనా వచ్చారేమో చెక్ చేసుకోవాలి.
% అడ్మిన్‌ మినహా.. మిగతా వారికి ఫైల్‌ షేరింగ్‌ అవకాశం ఇవ్వకూడదు.
% కాన్ఫరెన్స్‌ లో జాయిన్‌ కాగానే.. ‘లాక్‌ మీటింగ్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
% అదే సమయంలో ‘రికార్డ్‌ మీటింగ్‌’ ఆప్షన్‌ను డిజేబుల్‌ చేయాలి.
% మీటింగ్‌ పూర్తి అయ్యాక ‘ఎండ్‌ మీటింగ్‌’ను ఎంచుకోవాలి. అడ్మిన్‌ మీటింగ్‌ నుంచి తప్పుకోకూడదు.