Begin typing your search above and press return to search.

అది అక్కడ అతడికి తొలి బంతి.. శతాబ్దపు బంతి.. నేటికి 29 ఏళ్లయినా?

By:  Tupaki Desk   |   4 Jun 2022 11:30 AM GMT
అది అక్కడ అతడికి తొలి బంతి.. శతాబ్దపు బంతి.. నేటికి 29 ఏళ్లయినా?
X
క్రికెట్ ప్రపంచం ఎందరో దిగ్గజాలను చూసి ఉండొచ్చు.. మరెందరో మేటి ఆటగాళ్లను చూసి ఉండొచ్చు.. ఇంకెందరో గొప్ప వారిని చూసి ఉండొచ్చు..? కానీ, అతడు మాత్ర ఓ అద్భుతం.. అతడు వేసిన బంతి మహాద్భుతం... ఆ ఆటగాడు, ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్ వార్న్. సరిగ్గా మూడు నెలల కిందట అంటే.. మార్చి 4న కన్నుమూసిన వార్న్ తన బౌలింగ్ లాగే ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. అనూహ్యంగా మెలికలు తిరిగి అతడి స్పిన్ లాగే అతడి నిష్ర్కమణ కూడా జరిగింది. ఏమైందో తెలుసుకునేలోపే వికెట్ గిరాటేసే అతడి బంతిలాగే తన ప్రస్థానమూ ముగిసింది.

క్రికెట్ ప్రపంచంపై తన ముద్ర వేసి..

షేన్‌ వార్న్‌ అంటే.. శతాబ్దపు బంతి (బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ) గుర్తు రాకమానదు. అంతలా క్రికెట్ ను ప్రభావితం చేసింది ఆ బంతి. కొన్నేళ్ల పాటు క్రికెటర్ల మెదడులో మెదిలింది ఆ బంతి. లెగ్ స్టంప్ కు కాస్త పక్కగా పిచ్ అయిన బంతి.. ఆఫ్ వికెట్ ను గిరాటేయడం అంటే అద్భుతం కాక మరేమిటి?.. ఆ రోజుల్లో టీవీ ప్రసారాలు ఇంతగా లేవు కానీ.. ఉండి ఉంటే మరింత ప్రచారం లభించేది ఆ బంతికి. ఆ బాల్ డెలివరీ వీడియోలతో సోషల్ మీడియా హోరెత్తిపోయేది. వాట్సాప్ లో వేలమంది స్టేటస్ లు పెట్టుకుని ఉండేవారు. ఇన్ స్టాలో రీల్స్ నిండిపోయేవి.

రిపీటెడ్ వ్యూయర్స్త్ తో యూట్యూబ్ హోరెత్తిపోయేది. అందుకే అది బాల్ ఆఫ్ ద సెంచరీ అయింది. అయితే, వార్న్ సంధించిన‘‘ఆ బంతి ’’ గురించి పత్రికల్లో తెలుసుకున్న కుర్రాళ్లు.. ఇప్పటి నడి వయస్కులు ఇప్పటికీ కథలుగా చెప్పుకొంటారు. అంతలా వారి మీద ప్రభావం చూపింది. అసలు వార్న్ తరహాలో ఆ బంతిని వేయాలని ఆ రోజుల్లో ఎంతమంది ప్రయత్నించారో లెక్కే లేదు.

ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది?

1993లో యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా ఇంగ్లండ్ వెళ్లింది. ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జూన్ 4న తొలి టెస్టు. క్రీజులో ఇంగ్లండ్ దిగ్గజ బ్యాట్స్ మన్ మైక్ గ్యాటింగ్. బౌలింగ్ కు దిగింది 23 ఏళ్ల కుర్రాడు వార్న్. అది ఇంగ్లండ్ లో అతడికి తొలి బంతి కూడా. అంతకుముందు వార్న్ క్రీడా చరిత్ర ఏమంత గొప్పగానూ లేదు. అప్పుడప్పుడే ఎదుగుతున్న ఆ దశలో ఆ బంతి అతడి జీవితాన్నే మార్చేసింది. ఓ 15 ఏళ్ల వెనక్కుతిరగకుండా చూసుకునేలా చేసింది. నాటి మ్యాచ్‌లో షేన్‌ వార్న్‌ అద్భుతమైన బంతితో ఇంగ్లాండ్‌ ఆటగాడు మైక్‌ గాటింగ్‌ను బోల్తా కొట్టించాడు.

ఆ బంతి లెగ్‌స్టంప్‌ ఆవల పడటంతో వైడ్‌ అవుతుందని భావించి బ్యాటర్‌ దానిని వదిలేశాడు. కానీ, అది ఒక్కసారిగా గింగిరాలు తిరుగుకుంటూ ఆఫ్‌ స్టంప్‌ని గిరాటేసింది. దీంతో ఆటగాడితోపాటు అంపైర్‌ కూడా బిక్కమొహం వేశారు. ఈ బంతిని ‘బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ’గా పేర్కొంటూ అప్పట్లో వార్న్‌పై ప్రశంసల వర్షం కురిసింది. ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తూ ఐసీసీ తాజాగా ట్వీట్‌ చేసింది.

‘1993.. సరిగ్గా ఇదే రోజు.. ప్రపంచం షేన్‌ వార్న్‌ బాల్‌ ఆఫ్‌ ది సెంచరీని చూసింది’ అని షేన్‌ వార్న్‌ను గుర్తు చేస్తూ ట్వీట్‌ చేసింది. ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌. క్రికెట్ చరిత్రలో ఎన్నో మైలురాళ్లను అందుకున్న ఆయన ఈ ఏడాది మార్చిలో అనుమానస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. తాజాగా అతడి బౌలింగ్‌ మాయాజాలాన్ని గుర్తుచేస్తూ ఐసీసీ ఓ ట్వీట్‌ చేసింది.