Begin typing your search above and press return to search.

పుట్టిన బిడ్డను తల్లికి ఇవ్వడానికి లంచమా? హైకోర్టు ఆగ్రహం

By:  Tupaki Desk   |   11 Feb 2022 5:11 AM GMT
పుట్టిన బిడ్డను తల్లికి ఇవ్వడానికి లంచమా? హైకోర్టు ఆగ్రహం
X
కడుపున పుట్టిన బిడ్డను తల్లికి ఇవ్వడానికి కోఠిలోని మెటర్నిటీ హాస్పిటల్లో లంచం డిమాండ్ చేస్తున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. రూ.5వేల నుంచి రూ.10వేల వరకూ లంచం అడుగుతున్నారని హైకోర్టు నియమించిన అమికస్ క్యూరీ (కోర్టు సహాయకులు) కోర్టుకు సమర్పించిన నివేదికలో నిగ్గుతేల్చారు.

కోఠి ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రికి వచ్చే రోగులు.. గర్భిణుల దుస్థితిపై 2016లో పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. గత ఏడాది నవంబర్ 18న ఈ అంశంపై విచారణ సందర్భంగా ఆస్పత్రిలో పరిస్థితులను పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు కే.కిరణ్మయి అనే న్యాయవాదిని అమికస్ క్యూరీగా నియమించింది.

తాజాగా ఈ పిటీషన్ పై చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర, జస్టిస్ అభినందన్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అమికస్ క్యూరీ హైకోర్టుకు నివేదికను సమర్పించారు. నివేదికను పరిశీలించిన ధర్మాసనం.. వైద్య, ఆరోగ్యశాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మెటర్నిటీ దవాఖానాలో అంతా బాగుందంటూ కోర్టును తప్పుదోవ పట్టించారని అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ధర్మాసనం సీరియస్ అయ్యింది. మనకు అనారోగ్యం వస్తే ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులున్నాయని.. మరి పేదల పరిస్థితి ఏంటని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు నిలదీసింది.

అమికస్ క్యూరీ వాదనలు వినిపిస్తూ ఆస్పత్రిలో సమస్యలు అలాగే ఉన్నాయని.. తాను వ్యక్తిగతంగా పేషెంట్లు, అధికారులు, సిబ్బందితో మాట్లాడానని పేర్కొన్నారు. ఆస్పత్రిలో 244 పోస్టులకు గాను 157 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పుట్టిన బిడ్డను సొంతవారికి అప్పగించేందుకు కూడా లంచం డిమాండ్ చేస్తున్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందని పేర్కొన్నారు.

ఇప్పటికీ కోఠి ఆస్పత్రిలో రోగుల బంధువులు చెట్ల కిందే ఉంటున్నారని..వారికి కనీస వసతులు లేవని అమికస్ క్యూరీ పేర్కొంది. దీంతో అమికస్ క్యూరీ నివేదికను వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి అందించాలని హైకోర్టు ఆదేశించింది. నివేదికలో పేర్కొన్న ప్రతి సమస్యను నాలుగువారాల్లోగా పరిష్కరించాలని ఆదేశాలిచ్చింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ రిపోర్టు దాఖలు చేయాలని పేర్కొంది. విచారణను ఏప్రిల్ కు వాయిదా వేసింది.