Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను పొగిడేస్తున్న జగన్ బ్యాచ్

By:  Tupaki Desk   |   3 April 2016 5:12 AM GMT
కేసీఆర్ ను పొగిడేస్తున్న జగన్ బ్యాచ్
X
చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవటంలో మొనగాడు ఎవరైనా ఉన్నారంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదట నిలుస్తారు. తన తండ్రి పేరు వచ్చేలా పార్టీ పేరును డిజైన్ చేసి.. (అసలు పార్టీ వేరన్నది వేరే విషయం) జనాల మనుసుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేయటంతో పాటు.. తన తండ్రిని విపరీతంగా అభిమానించే నేతల్ని తన వర్గంగా మార్చుకొన్న ఆయన.. పవర్ కోసం చాలానే ప్రయత్నాలు చేశారు.

అదేం చిత్రమో.. నోటి వరకూ వచ్చే ముద్ద.. నోట్లోకి రాకుండా ఆగిపోయే దుస్థితి. తాను విజిలేస్తే.. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేకమేడలా కూలిపోతుందని చెప్పిన జగన్.. అదెంత చేశారో అందరికి తెలిసిందే. ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టటం తర్వాత.. రాజకీయ క్రీడలో వేసిన తప్పటడుగుల కారణంగా కాంగ్రెస్ అధినేత్రి కోపానికి గురై జైల్లో నెలలతరబడి మగ్గాల్సిన దుస్థితి.

ఆ సంగతిని పక్కన పెడితే.. తన తండ్రి పేరును తన ప్రతిమాటలోనూ మిస్ కాకుండా ప్రస్తావిస్తూ జాగ్రత్త పడే జగన్.. ‘ఆ దివంగత మహానేత’ అంటూ తరచూ చెలరేగిపోవటం చూస్తుంటాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఏ చిన్న విమర్శ చేసినా.. ఆయన మొత్తంగా కదిలిపోతారు. మన మధ్యన లేని వ్యక్తి మీద ఇన్ని బండలు వేస్తారా? అంటూ బోరుమంటాడు. వినేందుకు ఇదంతా బాగానే ఉంటుంది. తండ్రి మీద కొడుక్కి ఆ మాత్రం ప్రేమాభిమానాలు ఉండవా? అని సరిపెట్టుకోవచ్చు. కాకపోతే.. ఏపీ అధికారపక్షం తన తండ్రిని ఒక్కమాట అన్నా కదిలిపోయే జగన్ బాబు.. తెలంగాణ అధికారపక్షం పవర్ పాయింట్ ప్రజంటేషన్ పెట్టి.. తూర్పార పట్టినా కిమ్మనకుండా ఉండటం జగన్ కు మాత్రమే చెల్లుతుంది.

తండ్రి పేరును తన బ్రాండ్ గా పెట్టుకొని రాజకీయాల్లో నెట్టుకొస్తున్న జగన్.. మరి.. అదే తండ్రిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసిన చందంగా.. తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో దారుణంగా మోసం చేశారని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తే జగన్ బాబు ఇప్పటివరకూ నోటి మాటగా అయిన రియాక్ట్ అయ్యింది లేదు. ఆయనకున్న పరిమితుల దృష్ట్యా నోటి నుంచి మాట రాలేదని అనుకుందాం. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయనకు చెందిన సాక్షి మీడియాలో కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ గురించి పొగిడేయటం.. అపూర్వం.. అద్వితీయం అనేయటం కూసింత షాక్ కి గురి చేయక మానదు.

‘‘సాంకేతికతను వినియోగించుకొని సభ్యులందరికి.. ప్రజలందరికి సుబోధకంగా జలవనరుల విధానాన్ని వివరించటం మనస్ఫూర్తిగా స్వాగతించవలసిన ఆధునిక ప్రక్రియ’’ అంటూ మొదటి పదం నుంచి పొగడటం మొదలు పెట్టి.. ‘‘ప్రసారమాధ్యమాలను సద్వినియోగం చేసుకొని పారదర్శకత పాటించటంలో.. ప్రగతికి సంబంధించి ప్రజలకు తాజా సమాచారం అందించటంలో కొత్త పుంతలు తొక్కినట్టు అవుతుంది. రాజకీయ నాయకులకు కొత్త ఒరవడి సృష్టించినట్టు అవుతుంది. అవినీతికి అతీతంగా.. ప్రజల ప్రయోజనాలే పరమావధిగా.. జవాబుదారీతనం ప్రదర్శిస్తూ పరిపాలించిన తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయే సువర్ణావకాశం కేసీఆర్ కు అందుబాటులో ఉన్నది’’ అంటూ చివరి పదం వరకూ ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా పొగిడేయటం విస్మయాన్ని కలిగించటం ఖాయం. తండ్రి తీరును తప్పు పట్టిన కేసీఆర్ ను పొగిడేసేలా జగన్ బ్యాచ్ తీరుతో.. జగన్ మైండ్ సెట్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో..?