Begin typing your search above and press return to search.

అమరావతే రాజధానికి వైసీపీ ఓకే... కానీ... ?

By:  Tupaki Desk   |   16 Feb 2022 4:30 PM GMT
అమరావతే రాజధానికి వైసీపీ ఓకే... కానీ... ?
X
వేస్తే వేపకొమ్మ తీస్తే అమ్మ వారు అని ఒక ముతక సామెత ఉంది. అలా ఒక ప్రాజెక్ట్ ని ఎవరైనా మొదలుపెడితే దాన్ని వేరే వాళ్ళు వచ్చి వద్దు కాదు, రద్దు అంటే అసలు కుదరదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజలే ప్రభువులు. అంతే కాదు ప్రభుత్వమే శాశ్వతం. ఎవరు పాలించినా కూడా జనాలు ప్రభుత్వం అంటే ఒకటే అని భావిస్తారు. అలా ఒక ప్రభుత్వం చేసిన దాన్ని తరువాత వచ్చిన వారు కాదనే సీన్ అయితే ఎక్కడా లేదు.

దానిని అలా కాదంటే మాత్రం గొడవలు వచ్చేస్తాయి. అవి ఎలాంటివో అమరావతి రాజధాని సాక్షిగా యావత్తు ఏపీ అందరికీ బాగా అర్ధమైపోయింది. అమరావతి పేరిట రాజధానికి జగన్ విపక్ష నేతగా మద్దతు ఇచ్చి ఉన్నారు. అదే జగన్ సీఎం కాగానే మూడు రాజధానులు అన్నారు. మూడు చోట్లా రాజధానులూ మూడు ప్రాంతాలూ అభివృద్ధి, సమతూల్యత అని వైసీపీ నేతలు రకరకాలుగా మాట్లాడారు.

అయితే అమరావతి ఏకైక రాజధాని అని మాత్రమే రైతులు వేలాది ఎకరాల భూములను ఇచ్చారు. అక్కడ అభివృద్ధిలో తమ భాగం ఉంటుందని బలంగా నమ్మారు. కానీ జరిగింది వేరు. అందుకే సీన్ రివర్స్ అయింది. దీని మీద కోర్టులో కేసులు పడ్డాయి. ప్రభుత్వం గత ఏడాది చివరలో మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసుకుంది. లేకపోతే కోర్టులే దాన్ని కొట్టేసేవి అన్న అభిప్రాయం కూడా న్యాయ వర్గాలలో ఉంది.

అయినా సరే వైసీపీ మూడు రాజధానులు అంటోంది. ఆ పార్టీకి చెందిన మంత్రులు కొడాలి నాని, బొత్స సత్యనారాయణ వంటి వారు తప్పనిసరిగా విశాఖ రాజధాని అవుతుందని కూడా చెప్పారు. మరి అదెలా సాధ్యం అంటే అక్కడే ఇపుడు పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతోంది. మొదటి చట్టంలో ఏవైతే పొరపాట్లు జరిగాయో వాటిని సరిదిద్దేలా ఇపుడు చేస్తున్నారు అని అంటున్నారు.

ఒక చోట రాజధాని ఉండగా మూడు రాజధానులు అని చట్టం చేయడం వివదానికి దారి తీసింది. అందుకే ఈసారి అలా కాకుండా అమరావతినే రాజధానిగా ప్రభుత్వం గుర్తించనుందిట. అంటే అమరావతిని రాజధానిగా అలా ఉంచేస్తూనే రెండు ఉప రాజధానులను ముందుకు తెస్తున్నారు. అంటే విశాఖ, కర్నూల్ లో రాజధాని అని ఇక మీదట చెప్పలేరు. అవి ఉప రాజధానులుగా మాత్రమే ఉంటాయి.

ఈ విధంగా న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తూ మూడు రాజధానుల చట్టం స్థానంలో కొత్త బిల్లుని బడ్జెట్ సమావేశాలో సభ ముందుకు తీసుకువస్తున్నారు అని అంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఇబ్బంది ఉండదని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఇది అమలవుతోందిట.

దాంతో వచ్చే బడ్జెట్ సమావేశాలలో అమరావతి మన రాజధాని అని ప్రభుత్వం ప్రకటిస్తుంది. అదే విధంగా ఉప రాజధానులుగా విశాఖపట్నం, కర్నూల్ లను పేర్కొంటుంది. ఆ విధంగా సమగ్రమైన బిల్లుని శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా చేయడానికి సన్నద్ధమవుతోంది అంటున్నారు.

ఇక ఉప రాజధానుల ట్యాగ్ ఉన్నా కూడా పరిపాలనా సౌలభ్యం కోసం అక్కడ కూడా భవనాలు ఏర్పాటు చేసి వివిధ ప్రభుత్వ శాఖలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది అన్న మాట. ఇవన్నీ సరే కానీ విశాఖ వరకూ బాగానే ఉన్నా కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు అంటే మాత్రం కష్టమైన విషయమే. అది కేంద్రం తలచుకుంటే తప్ప జరగదు. మొత్తానికి వైసీపీ తన వరకూ తన చిత్త శుద్ధిని చాటుకుంటున్నట్లుగా ఒక రాజధాని రెండు ఉప రాజధానులు కాన్సెప్ట్ తో సాగుతుంది అంటున్నారు. ఆ విధంగా విశాఖ నుంచి పాలన చేసేందుకు మార్గాలు అన్వేషిస్తుంది అని కూడా చెబుతున్నారు.