Begin typing your search above and press return to search.

నాలుగైదు దశలో నువ్వా నేనా ?

By:  Tupaki Desk   |   23 Feb 2022 9:30 AM GMT
నాలుగైదు దశలో నువ్వా నేనా ?
X
ఉత్తరప్రదేశ్ లో జరగనున్న నాలుగు, ఐదో దశలో జరగబోయే పోలింగ్ రెండు ప్రధాన పార్టీలకు చాలా కీలకంగా మారింది. ఇప్పటికే పూర్తయిన మూడు దశల పోలింగ్ అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ కూటమికే అడ్వాంటేజ్ గా ఉందనే విశ్లేషణలు వినబడుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీ కూటమి కూడా సైలెంటుగా ఉండటం విశ్లేషణలు నిజమనేట్లే ఉన్నాయి. అయితే నాలుగు, ఐదో దశల పోలింగ్ మాత్రం రెండు పార్టీలకు చాలా కీలకం కాబోతున్నాయి.

ఎందుకంటే రెండు పార్టీలకు 70 స్ధానాలకు జరగబోయే పోలింగ్ లో కొన్ని ప్లస్సులు, మరికొన్ని మూనస్సులున్నాయి. కోవిడ్ కారణంగా అస్తవ్యస్ధమైన జనజీవితంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చిన ఉచిత రేషన్ చాలా మందికి బాగా ఉపయోగపడ్డాయి. అలాగే కోవిడ్ కు విరుగుడుగా కేంద్రం అందించిన ఉచిత టీకాలు కూడా ప్రజలకు వరంగా మారాయనే చెప్పాలి. పెరిగిపోయిన నిరుద్యోగం కన్నా ఉచిత రేషన్, ఉచిత టీకాలు జనాలపై ఎక్కువ ప్రభావం చూపటం బీజేపీకి అనుకూలించే అంశాలే.

అలాగే యోగి ఆదిత్యనాథ్ సీఎం అయినాక లా అండ్ ఆర్డర్ దారిలోకి రావటం, అమలవుతున్న సంక్షేమ పథకాలు కూడా బీజేపీకి సానుకూలాంశమనే చెప్పాలి. అయితే గోవధపై యోగి ప్రభుత్వం నిషేధం విధించటం చాలా మైనస్సయిపోయింది. గోవులను చంపటం నేరమైన కారణంగా వట్టిపోయిన ఆవులను యజమానులు రోడ్లపైన వదిలేస్తున్నారు. అలాంటివన్నీ తిండికోసం పంటలపైన పడుతున్నాయి. దాంతో చేతికొచ్చిన పంటలను పశువులు తిన్నంత తిని పాడు చేసేస్తున్నాయి. దాంతో రైతాంగమంతా ప్రభుత్వంపై మండిపోతున్నది.

గడచిన ఐదేళ్ళలో రాష్ట్రంలో ఠాకూర్లదే రాజ్యమైపోయింది. యోగి కూడా ఠాకూరే కావటంతో మిగిలిన సామాజక వర్గాలను అణిచివేతకు గురవుతున్నారు. దాంతో ఠాకూర్ల పాలన అంతమైతే కానీ తమకు స్వేచ్చ రాదని మిగిలిన సామాజిక వర్గాల్లో ఆగ్రహం పేరుకుపోయింది. ఇక ముస్లింలు, యాదవులు, జాట్లు అనుకూలంగా సంఘటితం అవటం ఎస్పీకి బాగా కలిసొచ్చేదే. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, బీఎస్పీలకు వ్యతిరేకంగా పై సామాజిక వర్గాలు ఎస్పీకి అనుకూలంగా మారుతున్నాయి. జరగబోయే రెండు విడతల పోలింగ్ లో పై సమీకరణలతో అధికారం ఎవరిదో దాదాపు తేలిపోతుందనే అంటున్నారు. మొత్తానికి యూపీ ఎన్నికలు ఉత్కంఠగా మారుతున్నాయి.