Begin typing your search above and press return to search.

ఎన్టీయార్ మావాడే అంటున్న జగన్... ?

By:  Tupaki Desk   |   16 Feb 2022 1:30 PM GMT
ఎన్టీయార్ మావాడే అంటున్న జగన్... ?
X
ఎన్టీయార్ తెలుగు జాతి ఖ్యాతి. ఆయన కీర్తి అజరామరం. అలాంటి ఎన్టీయార్ మావాడే అని వైసీపీ చెబుతోంది. తెలుగు వారి గర్వం అయిన ఎన్టీయార్ ని ఇపుడు వైసీపీ తమ వైపు తిప్పుకోవడానికి చూస్తోంది. ఎన్టీయార్ పార్టీ నిజానికి టీడీపీ. అదిపుడు వైసీపీని గట్టిగా సవాల్ చేస్తోంది. రేపు చాన్స్ ఉంటే మళ్లీ టీడీపీదే ముఖ్యమంత్రి సీటు. అలాంటి ప్రత్యర్ధి పార్టీకి చెందిన మూలపురుషుడిని తమ వాడుగా చేసుకోవడానికి వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

ఇప్పటికే విజయవాడ పేరిట కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టిన జగన్ ఇపుడు మరో బ్రహ్మాండమైన పని చేయబోతున్నారు. అది యావత్తు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీయార్ అభిమానులను ఆందింపచేసేదిగా ఉండడమే ఇక్కడ మ్యాజిక్, ఎన్టీయార్ వంటి మహా నేత విగ్రహాలను ఇప్పటిదాకా టీడీపీ ఏపీ నిండా ప్రతిష్టించింది.

అయితే ప్రభుత్వ పరంగా ఆయన విగ్రహం మాత్రం ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఆయన అల్లుడు చంద్రబాబు విభజన ఏపీకి అయిదేళ్ళ పాటు సీఎం గా ఉండగా అలాంటి ప్రాజెక్ట్ ని టేకప్ చేయలేదు. అయితే ఇపుడు జగన్ తాను ఆ పని చేస్తాను అంటున్నారు. ఎన్టీయార్ పుట్టిన గడ్డ నిమ్మకూరులో ఆ మహనీయుడికి నివాళిగా 25 అడుగుల ఎత్తున ఎన్టీయార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రెడీ అయింది.

నిమ్మకూరులోని పద్నాలుగు ఎకరాల చెరువు సమీప ప్రాంతంలో ఈ భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వైసీపీ ఉత్సాహం చూపిస్తోంది. దీనికి సంబంధించి ఈ నెల 28న జగన్ స్వయంగా నిమ్మకూరు వెళ్లి మరీ ఎన్టీయార్ విగ్రహ స్థాపన కార్యక్రమలో పాలు పంచుకోవడమే కాకుండా శంకుస్థాపన చేస్తారని మంత్రి కొడాలి నాని చెప్పారు.

ఇక ఈ ఏడాది ఎన్టీయార్ కి ప్రత్యేకం. ఆయన శతజయంత్రి వేడుకలు ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. దాంతో మే 28న ఎన్టీయార్ శత జయంతి వేళ ఈ భారీ విగ్రహాన్ని జగన్ చేతుల మీదుగా ప్రారభించేలా చూస్తున్నారు. మొత్తానికి ఎన్టీయార్ పేరుతో కొత్త జిల్లా ఆయన విగ్రహం ఏర్పాటు ద్వారా వైసీపీ దూకుడుగానే ఉంది. ఎన్టీయార్ మా వాడు అని క్లెయిం చేసుకోవడానికి రెడీ అవుతోంది. ఈ పరిణామాలను టీడీపీ ఎలా విశ్లేషించుకుంటుందో చూడాలి.

మరో వైపు నిమ్మకూరుకు చెందిన ఎంటీయార్ బంధువులు జగన్ని తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో కలసి ఎన్టీయార్ పేరిట జిల్లాను ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియచేశారు. అలా వచ్చిన వారికి ఎన్టీయార్ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని జగన్ చెప్పడంతో వారు రెట్టింపు ఆనందం వ్యక్తం చేశారని మంత్రి కొడాలి నాని అంటున్నారు.