Begin typing your search above and press return to search.

పీకే టీమ్‌.. కేసీఆర్ తెలంగాణ హీట్‌

By:  Tupaki Desk   |   3 Feb 2022 7:04 AM GMT
పీకే టీమ్‌.. కేసీఆర్ తెలంగాణ హీట్‌
X
ప్ర‌త్యేక రాష్ట్రంగా తెలంగాణ‌ ఏర్ప‌డ్డ‌ప్ప‌టి నుంచి జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్‌కు తిరుగులేకుండా పోయింది. రాష్ట్ర సాధ‌న ఉద్య‌మ పార్టీగా టీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను ప్ర‌జ‌లు ఆద‌రించారు. రాజ‌కీయంగా కూడా ఇత‌ర పార్టీల నుంచి పోటీ లేక‌పోవ‌డం కూడా క‌లిసొచ్చింది. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. అటు కాంగ్రెస్‌.. ఇటు బీజేపీ రాష్ట్రంలో బ‌లోపేతం అవుతుండ‌డంతో కేసీఆర్ జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేశార‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

అందుకే ఇటీవ‌ల కేసీఆర్.. ప్ర‌ధాని మోడీ స‌హా బీజేపీ నాయ‌కుల‌పై మాట‌ల‌తో విరుచుకుప‌డుతున్నార‌ని తెలుస్తోంది. అయితే ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌స్తుతం కేసీఆర్ నోటి వెంట వ‌స్తున్న మాట‌ల వెన‌క మ‌రో వ్య‌క్తి ఉన్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఆయ‌నే.. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ అలియాస్ పీకే.

అదే ల‌క్ష్యం..

దేశ రాజ‌కీయాల్లో ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా పీకే పేరు సంపాదించారు. వివిధ రాష్ట్రాల్లో ఆయా పార్టీల విజ‌యం కోసం ఆయ‌న ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న టీమ్‌తో క‌లిసి ప‌ని చేస్తే క‌చ్చితంగా అధికారంలోకి రావొచ్చ‌ని పార్టీలు న‌మ్ముతున్నాయి. మ‌రోవైపు ఎలాంటి ప‌రిస్థితులు ఎదురైనా.. ఎంత‌టి ప్ర‌తికూల ప్ర‌భావాలు ఉన్నా త‌న‌తో ఒప్పందం కుదుర్చుకున్న పార్టీని గెలిపించ‌డం కోసం పీకే ఏమైనా చేస్తార‌ని టాక్‌. అందుకోసం ప్ర‌జ‌లు, రాష్ట్రం చివ‌ర‌కు దేశం ఏమైనా కానీ త‌న‌కు అవ‌స‌రం లేద‌నే భావ‌న‌తో పీకే ముందుకు సాగుతార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి అక్క‌డ పార్టీల మ‌ధ్య విద్వేషాలు రెచ్చ‌గొట్టి త‌న క్లైంట్‌కు మాత్రం మేలు చేస్తార‌ని చెబుతున్నారు.

అదే రూట్లో..

గ‌తేడాది ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ పీకే టీమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఓ వైపు నుంచి ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ద్వ‌యం క‌లిసి మ‌మ‌త‌ను ఓడించేందుకు ఎన్ని ఎత్తులు వేసినా.. చివ‌ర‌కు ఆమె మూడోసారి సీఎం అయ్యారు. అందుకు ప్ర‌ధాన కార‌ణం పీకే అన‌డంలో సందేహం లేదు. త‌న అనుభ‌వాన్ని ఉప‌యోగించిన ఆయ‌న‌.. ఆ రాష్ట్రంలో టీఎంసీ, బీజేపీ మ‌ధ్య రాజ‌కీయ విద్వేషాన్ని రెచ్చ‌గొట్టార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఎన్నిక‌ల‌కు ముందు.. ఎన్నిక‌ల స‌మయంలోనూ ఈ రెండు పార్టీల కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ దాడుల‌న్నింటికీ కార‌ణం కేంద్రంలోని బీజేపీనే అని గొంతెత్తిన మ‌మ‌త అందుకు ఫ‌లితం సాధించార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఇప్పుడు తెలంగాణ‌లోనూ పీకే అదే రూట్లో సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో కేసీఆర్ న‌టిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అందుకే ఎప్పుడూ లేనిది బీజేపీని ల‌క్ష్యంగా చేసుకుని కేసీఆర్ తీవ్రంగా విరుచుకుప‌డుతున్నార‌ని స‌మాచారం. ప్ర‌జ‌ల గురించి ఆలోచించ‌కుండా కేవ‌లం త‌న‌ను న‌మ్ముకున్న పార్టీని గెలిపించ‌డం కోసం పీకే ఎంత‌కైనా తెగిస్తార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అది స‌రికాద‌ని ప్ర‌జాస్వామ్య వాదులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.