Begin typing your search above and press return to search.

బీజేపీ.. టీఆర్ఎస్ కు తేడా లేదంటూ షర్మిల ఏం చెప్పారు

By:  Tupaki Desk   |   23 Feb 2022 3:50 AM GMT
బీజేపీ.. టీఆర్ఎస్ కు తేడా లేదంటూ షర్మిల ఏం చెప్పారు
X
తనను ఉద్దేశించి ఎవరైనా ఘాటు వ్యాఖ్యలు చేసినంతనే.. విరుచుకుపడే అలవాటున్న టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అలాంటి ఆయన తన తీరుకు భిన్నంగా వ్యవహరిస్తారు టీవైసీపీ అధినేత్రి షర్మిల విషయంలో. ఆమె తనను ఉద్దేశించి ఎన్ని ఘాటు విమర్శలు చేసినా.. ఆ విషయాల్ని అస్సలు ప్రస్తావించకుండా ఉండటం తెలిసిందే.

కేసీఆర్ విధానాల మీద ఆమె ఎంతలా విరుచుకుపడతారో.. సందర్భానికి తగ్గట్లుగా వ్యక్తిగత అంశాల్ని ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా.. గులాబీ పరివారానికి మంట పుట్టేలా మారాయి.

అనూహ్యంగా తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన ఆమె.. తెలంగాణలోని ప్రధాన సమస్యలు చాలానే ఉన్నా.. వాటిని టచ్ చేయకుండా.. ఒక్క నిరుద్యోగ అంశాన్ని టేకప్ చేసి.. దాని మీదే మాట్లాడుతూ పోరడుతున్నారు. మొదట్లో ఆమె వాదనకు పెద్దగా సానుకూలత వ్యక్తం కానప్పటికి.. ఒక అంశం మీద కొద్ది నెలలుగా మాట్లాడుతున్న ఆమె మాటలు ఇప్పుడిప్పుడే కాసింత ఆసక్తికరంగా మారాయన్న వాదన వినిపిస్తోంది.

తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండవని కేసీఆర్ మాటిచ్చారని.. అందరిని రెగ్యులరైజ్ చేస్తామన్నారని.. ఇప్పటివరకు అలాంటిదేమీ చేయలేదన్నారు. ఇంటికో ఉద్యోగమని చెప్పారని.. ఉద్యోగాన్ని ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారే కానీ.. దాన్ని కూడా అమలు చేయలేదన్నారు. ఒకప్పుడు కేసీఆర్ స్కూటర్ మీద తిరిగేవారని.. ఇప్పుడు మాత్రం ప్రగతిభవన్ లో ఆడంబరాల్ని అనుభవిస్తున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతులు.. నిరుద్యోగుల బతుకులు మాత్రం ఎప్పటిలానే ఉండిపోవాలా? అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీకి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక పోలిక ఉందన్న షర్మిల.. వీరిద్దరూ దొందు దొందేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ మతాన్ని అడ్డుపెట్టుకొని సెంటిమెంట్ రాజేస్తే.. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డు పెట్టుకున్నారన్నారు. ఈ ఇద్దరూ సమస్యల గురించి మాట్లాడరని.. సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారన్నారు.

ఆంధ్రా.. తెలంగాణ రాష్ట్రాలు కలిసిపోతాయని ఎలా చెబుతారు? అలా ఎప్పటికి జరగదని షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎంత త్వరగా వస్తే అంత మంచిదన్న ఆమె.. మోడీ.. కేసీఆర్ లు తమ అవసరాన్ని అడ్డుపెట్టుకొని సెంటిమెంట్ ను రాజేస్తుంటారని పేర్కొన్నారు. అంతకంతకూ ఘాటెక్కిపోతున్న షర్మిల వ్యాఖ్యలకు చెక్ చెప్పేలా గులాబీ బాస్ కేసీఆర్ నోరు విప్పుతారా? ఎప్పటిలా మౌనంగా ఉండిపోతారా? అన్నది చూడాలి.