Begin typing your search above and press return to search.

తొక్కిసలాట ప్రభావం చంద్రబాబు మీద ఎక్కువే

By:  Tupaki Desk   |   27 July 2015 5:04 AM GMT
తొక్కిసలాట ప్రభావం చంద్రబాబు మీద ఎక్కువే
X
రాష్ట్ర విభజన పూర్తయి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడిన సమయంలో.. రెండు రాష్ట్రాల్లోని సీఎంవోలపై చాలానే ఆసక్తికర చర్చ నడిచింది. విభజన నేపథ్యంలో.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏపీ పరిస్థితిని చక్కదిద్దేందుకు.. ఏపీ ముఖ్యమంత్రి చాకుల్లాంటి అధికారుల్ని సీఎంలోలోకి తీసుకుంటారని.. వారి సాయంతో తనకున్న గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటారని భావించారు.

అయితే.. చంద్రబాబుకు ఫీడ్ బ్యాక్ వచ్చే విభాగాల ఒత్తిడి పుణ్యమా అని.. వారి మాట కాదనలేక.. వారు కోరుకున్న వారికి స్థానం ఇవ్వటం లాంటి చర్యలతో.. ఏపీ సీఎంవో బలహీనంగా మారిందన్న విమర్శను బాబు మూటగట్టుకున్నారు. అదేసమయంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం.. పనిమంతులకే ప్రాధాన్యం ఇవ్వటం.. ఒత్తిడి అన్న పదం తన దగ్గరకు చేరకుండా కంట్రోల్ చేయటంతో కేసీఆర్ తానేం అనుకున్నారో వారికే అవకాశాలు ఇచ్చారు.

గోదావరి పుష్కరాల సందర్భంగా తొలిరోజున రాజమండ్రిలో చోటు చేసుకున్న తొక్కిసలాట సందర్భంగా ఏపీ అధికారుల నిర్లక్ష్యం.. బాధ్యతారాహిత్యం.. వారి పని తీరు లాంటివి బయటపడటమే కాదు.. జరిగిన ఘటనలో తన తప్పు లేకున్నా.. తనను బద్నాం చేసేలా చేసిన విపక్షాల మాటకే అందరూ మొగ్గు చూపేలా వ్యవహారం మారటంలో అధికారుల వైఫ్యలం స్పష్టంగా బయటకు వచ్చిందంటున్నారు.

తొక్కిసలాటతో ప్రభుత్వంపై పడిన మచ్చ ఎప్పటికి చెరిగిపోనిదిగా మారటంతో.. బాబు ఒక్కసారి ఉలిక్కిపడి తప్పు ఎక్కడ జరుగుతుందన్న కోణంపై దృష్టి సారించారని చెబుతున్నారు. అందుకే.. సీఎంవోను మొత్తంగా ప్రక్షాళన చేస్తారని చెబుతున్నారు. సమర్థవంతంగా పని చేసే అధికారులకు ఈసారి అవకాశం దక్కనుందని.. గతంలో మాదిరి ఒత్తిడి ఇక పని చేసే ఛాన్స్ లేదంటున్నారు.

తొక్కిసలాట జరిగినప్పుడు చంద్రబాబు స్నానం చేసిన స్నానఘట్టానికి.. తొక్కిసలాట ఘటన జరిగిన ప్రదేశానికి మధ్య పెద్ద గోడ ఒకటి ఉందని.. బాబు స్నానం చేసిన ప్రాంతానికి తొక్కిసలాట జరిగినప్లేస్ చాలా దూరం ఉన్నా.. జరిగిన దుర్ఘటనకు తానే కారణమన్న భావన కలగటానికి అధికారుల వైఫల్యంగా బాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. మంత్రులు.. అధికారపార్టీ నేతలు సీఎంవో వద్దకు వచ్చి ఇచ్చే వినతులకు పెద్దగా స్పందన ఉండటం లేదని.. అస్సలు పట్టించుకోవటం లేదన్న ఫిర్యాదుల్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారని చెబుతున్నారు. మొత్తంగా.. సీఎంవో ప్రక్షాళన దిశగా బాబు సిద్ధం అవుతున్నారని చెబుతున్నారు.

ఇక.. పుష్కరాల కోసం రాజమండ్రి వెళ్లిన చంద్రబాబు.. 13 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత.. మళ్లీ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. పుష్కరాల్ని అద్భుతం నిర్వహించారని కీర్తించారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కీర్తి కిరీటాలు పెట్టటం మామూలేగా.