నిండా మునిగిన 'రియల్' టైటానిక్!
ఆ దేశంలో ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం మరింత అతలాకుతలం కానుంది
By: Tupaki Desk | 18 Aug 2023 7:29 AM GMTచైనా నెత్తిన పులి మీద పుట్రలా మరో సంక్షోభం వచ్చి పడింది. ఆ దేశంలో ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం మరింత అతలాకుతలం కానుంది. చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థ అయిన ఎవర్ గ్రాండే గ్రూప్ సంచలన విషయాన్ని ప్రకటించింది. తమ కంపెనీ దివాలా తీసినట్టు ప్రకటించింది. ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న చైనా రియల్టీ రంగాన్ని తాజా పరిణామం మరింత కుదిపేసింది. ఈ మేరకు న్యూయార్క్ కోర్టులో దివాలా కోసం ఎవర్ గ్రాండే పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే చైనాలో అగ్రశ్రేణి కంపెనీలు తమ నిర్మాణాలను పూర్తి చేయడానికి తీవ్ర నగదు కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ పరిణామం మరింత ఆందోళనకు గురి చేసింది.
దాదాపు రెండేళ్లుగా చైనా ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా.. దేశంలోని రెండో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అయిన ఎవర్ గ్రాండేను దివాలా నుంచి రక్షించలేకపోయింది. ఈ సంస్థ అప్పుల మొత్తం దాదాపు 340 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని తెలుస్తోంది. చైనా జీడీపీలో 2.437 శాతానికి ఎవర్ గ్రాండే అప్పులు సమానమని చెబుతున్నారు.
కాగా ఎవర్ గ్రాండే సంస్థ చైనాలో ఏకంగా 280 నగరాల్లో 1,300 భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. దీంతోపాటు ఈ సంస్థకు రియల్ ఎస్టేటేతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం దాదాపు 15 లక్షల మందికి ఎవర్ గ్రాండే ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉంది. వారందరూ ఇప్పటికే సంస్థకు డబ్బులు చెల్లించారు.
ఈ క్రమంలో భారీ ప్రాజెక్టుల నిర్వహణకు ఎవర్ గ్రాండే భారీగా రుణాలను తీసుకుంది. 2021లో ఈ రుణాలు చెల్లించలేకపోయింది. మరోవైపు కోవిడ్ అనంతరం పరిణామాలు చుట్టుముట్టడంతో ఈ ఏడాది జులైలో ఈ సంస్థ భారీ నష్టాలను చవిచూసింది. గత రెండేళ్ల కాలంలో దాదాపు 81 బిలియన్ డాలర్ల (రూ.6 లక్షల కోట్లు) నష్టం వచ్చినట్లు ప్రకటన జారీ చేసింది. చైనీయుల సంపదలో చాలా భాగం రియల్‌ఎస్టేట్ రంగంలో ఉండటంతో ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు సైతం శరాఘాతమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు చైనా జీడీపీలో రియల్ ఎస్టేట్ రంగానిది దాదాపు 30 శాతం వాటా. 2021లో ఎవర్ గ్రాండే ఆర్థిక కష్టాలు ఆ దేశ స్థిరాస్తి రంగాన్ని అతలాకుతలం చేశాయి. ఈ మొత్తం వ్యవహారానికి చైనా ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థిరాస్తి రంగం రుణ సమీకరణపై ఒక్కసారిగా ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించడమే ఇందుకు కారణమని అంటున్నారు. చైనా ప్రభుత్వ నిర్ణయంతో ఎవర్ గ్రాండే వంటి దిగ్గజ సంస్థలకు రుణాలు లభించడం కష్టంగా మారింది.
ఇప్పటికే చైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కాసియా, ఫాంటాసియా, షిమావో సంస్థలు దివాలా ప్రకటించాయి. ఇప్పుడు పులి మీద పుట్రలా ఆ దేశంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థల్లో రెండోదిగా ఉన్న ఎవర్ గ్రాండే దివాలా తీయడంతో సంక్షోభం తలెత్తింది.