Begin typing your search above and press return to search.

షాకిచ్చే రిపోర్టు: నాలుగేళ్లలో హైదరాబాద్ లో పెరిగిన ఇళ్ల ధరలెంతోతెలుసా?

మ్యాజిక్ బ్రిక్స్ సంస్థ తాజాగా తన అధ్యయన రిపోర్టును విడుదల చేసింది.

By:  Tupaki Desk   |   6 Sep 2024 8:30 AM GMT
షాకిచ్చే రిపోర్టు: నాలుగేళ్లలో హైదరాబాద్ లో పెరిగిన ఇళ్ల ధరలెంతోతెలుసా?
X

రోజువారీ జీవితానికి సంబంధించిన అంశమే కానీ.. దాని లోతులకు సంబంధించిన లెక్కను విప్పి చెప్పిందో సంస్థ. హైదరాబాద్ మహానగరంలో గడిచిన నాలుగేళ్లలో పెరిగిన ఇళ్ల ధరల లెక్కను చెప్పిన వైనం.. దాని సారాంశం గురించి తెలిస్తేమాత్రం ఆశ్చర్యంతో అవాక్కు అవుతాం. మరీ.. ఇంత భారీగా ఇళ్ల ధరలు పెరిగాయా? అన్న భావనకు గురి కావటం ఖాయం. మ్యాజిక్ బ్రిక్స్ సంస్థ తాజాగా తన అధ్యయన రిపోర్టును విడుదల చేసింది.

హైదరాబాద్ లోని ఇళ్ల ధరలు గడిచిన నాలుగేళ్లలో 80 శాతం పెరిగినట్లుగా అంచనా వేసింది. దేశం మొత్తంలో ఇదే అత్యధిక పెరుగుదలగా పేర్కొంది. స్థిరాస్తి కన్సల్టెన్సీ సేవల సంస్థగా పేరున్న మ్యాజిక్ బ్రిక్స్.. దేశ వ్యాప్తంగా పది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల తీరుతెన్నులతో ఒక నివేదికను సిద్ధం చేసింది. ఇందులో ఆయా నగరాల్లో పెరిగిన ఇళ్ల ధరల లెక్కను చెప్పింది.

హైదరాబాద్ లో పెరిగిన ఇళ్ల ధరల కారణంగా ఏం జరిగింది? ఇళ్లు కొంటున్న వారి మీద భారం ఎలా ఉంది? వారి ఆదాయంలో ఇళ్ల కొనుగోలు ఖర్చు ఎంత భారీగా పడిందన్న విషయాన్ని ఆసక్తికరంగా వివరించింది. హైదరాబాద్ లో ఇళ్ల ధరలు అనూహ్యంగా పెరిగినా.. ఆ స్థాయిలో ప్రజల ఆదాయాలు పెరగలేదని పేర్కొంది. దీంతో.. ఇళ్లు కొనుగోలు చేసిన వారు రుణాలకు కట్టే ఈఎంఐల భారం ఎక్కువగా ఉందన్నారు. తమ ఆధాయంలో పెద్ద ఎత్తున ఈఎంఐ చెల్లింపుల కోసం వెచ్చిస్తున్నట్లుగా తెలిపింది.

2020 - 24 మధ్య దేశంలో పది నగరాల్లో ప్రజల ఆదాయాలు పెరిగింది 5.4 శాతమే అయినా.. ఇళ్ల ధరలు మాత్రం 9.3 శాతం పెరిగాయని పేర్కొంది. ఈ కారణంగా ప్రజలు ఇళ్ల కొనుగోలు శక్తి తగ్గినట్లుగా చెప్పింది. ‘‘హైదరాబాద్ లో ఇళ్ల ధరలు 80 శాతం పెరిగాయి. ముంబయి.. ఢిల్లీ నగరాల్లో ఇళ్ల ధరలు మధ్యతరగతి వర్గీయులు భరించలేనిస్థాయిలో ఉన్నాయి. చెన్నై.. అహ్మదాబాద్ . కోల్ కతా నగరాల్లో కొంత అందుబాటు ధరల్లో ఇళ్లు లభిస్తున్నాయి’’ అని పేర్కొంది.

బ్యాంకుల్లో తీసుకున్న ఇంటి రుణం మీద చెల్లింపుల్లో వచ్చిన తేడాను కళ్లకు కట్టినట్లుగా వివరించింది. ‘‘మన దేశంలో 2020లో ఇంటికి తీసుకున్న అప్పుకు చెల్లించే ఈఎంఐ వాటా సగటున 46 శాతంగా ఉంది. 2024 నాటికి ఇది61 శాతానికి పెరిగింది. ఇళ్ల కొనుగోలుదారులపై ఈఎంఐ భారం అనూహ్యంగా పెరిగింది’’ అని వెల్లడించింది. నెలసరి ఆదాయంలో ఈఎంఐ వాటా నగరాల వారీగా చూస్తే.. ముంబయిలో 116 శాతం పెరిగితే.. ఢిల్లీలో 82 శాతంగాఉంది. హైదరాబాద్ లో 61 శాతంగా ఉంది. ఈ నగరాల్లోని ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువ భాగంగా ఇంటికి కట్టే ఈఎంఐకే కేటాయిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

అహ్మదాబాద్ .. చెన్నై నగరాల్లో మాత్రం ఈఎంఐ చెల్లింపులు మొత్తం ఆదాయంలో 41 శాతం ఉంటే.. కోల్ కతాలో 47 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు. ఆదాయాలకు మించి ఇళ్ల ధరల్లో పెరుగుదలఉన్న కారణంగా ఇటీవల కాలంలో డిమాండ్ మందగించినట్లుగా పేర్కొన్నారు. కొంతకాలం పాటు ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల్లో పెరుగుదల పెద్దగా ఉండదన్న అభిప్రాయాన్ని మ్యాజిక్ బ్రిక్స్ సీఈవో సుధీర్ పాయ్ అభిప్రాయపడ్డారు.