Begin typing your search above and press return to search.

స్థిరాస్థి రంగంలో హైదరాబాద్ కీలకం... ఇళ్ల ధరలతో మరోసారి స్పష్టం!

అవును... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - సెప్టెంబరులోనూ.. గత ఏడాది ఇదే సమయంలోనూ భారతదేశంలోని 7 ప్రధాన నగరాల్లో అమ్ముడైపోయిన ఇళ్ల సగటు ధరలు.. వాటిలోని పెరుగదల

By:  Tupaki Desk   |   21 Nov 2024 3:50 AM GMT
స్థిరాస్థి రంగంలో హైదరాబాద్  కీలకం... ఇళ్ల ధరలతో మరోసారి స్పష్టం!
X

హైదరాబాద్ తో పాటు దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పూణె, కోల్ కతా నగరాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం.. ఏడాది క్రితం ఇదే సమయానికి అమ్ముడైపోయిన ఇళ్ల ధరలు, వాటి సగటు ధరలపై ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఈ మేరకు 2024 - 25 ప్రథమార్ధంపై అనరాక్ గ్రూప్ ఆసక్తికర డేటా వెల్లడించింది.

అవును... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - సెప్టెంబరులోనూ.. గత ఏడాది ఇదే సమయంలోనూ భారతదేశంలోని 7 ప్రధాన నగరాల్లో అమ్ముడైపోయిన ఇళ్ల సగటు ధరలు.. వాటిలోని పెరుగదల.. రియల్ ఎస్టేట్ మార్కెట్ లో హైదరాబాద్ కీలక పాత్ర మొదలైన విషయాలపై కీలక విషయాలు వెల్లడించింది స్థిరాస్థి కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ గ్రూప్.

ఇందులో భాగంగా ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ - సెప్టెంబరులో హైదరాబాద్ తో పాటు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పూణె, కోల్ కతా నగరాల్లో అమ్ముడైన ఇళ్ల సగటు ధర రూ.1.23 కోట్లకు చేరిందని.. 2023-24లో ఇదే సమయంలో ఈ విలువ రూ.1 కోటిగ ఉందని అనరాక్ సంస్థ తెలిపింది. అంటే.. సుమారు 23 శాతం పెరుగుదల కనిపిస్తోందని వెల్లడించింది.

ప్రధానంగా కరోనా మహమ్మారి తర్వాత లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ నగరల్లో రికార్డ్ స్థాయిలో కొత్త నిర్మాణాలు, ఖరీదైన ఇళ్ల అమ్మకాలు జోరందుకున్నాయని వెల్లడించింది. ఈ క్రమంలో పైన చెప్పుకున్న 7 ప్రధాన నగరాల్లోనూ 2024 ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య రూ.2,79,309 కోట్ల విలువైన 2,27,400 ఇళ్లు అమ్ముడయ్యాయని వెల్లడించింది.

ఇదే క్రమంలో.. ఏడాది క్రితం ఇదే సమయంలో అమ్ముడైనవి.. రూ.2,35,800 కోట్ల విలువైన 2,35,200 ఇళ్లు అని తెలిపింది. అంటే... గత ఏడాదితో పోలిస్తే ఈసారి అమ్ముడైన ఇళ్ల సంఖ్య 3శాతం తగ్గిందన్నమాట. అయినప్పటికీ.. విలువ మాత్రం 18% వరకూ వృద్ధి చెందింది.

అయితే.. స్థిరాస్థి మార్కెట్ లో కీలకంగా మారిన హైదరాబాద్ లో విలువ వృద్ధి మరింత భారీగా కనిపిస్తుంది. ఇందులో భాగంగా... గత ఏడాది ప్రథమార్ధంలో హైదరాబాద్ లో అమ్ముడైన ఇళ్ల సగటు ధర రూ.84 లక్షలు కాగా.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే ఈ సగటు ధర రూ.1.15 కోట్లకు చేరింది. అంటే.. విలువ 37% పెరిగిందన్నమాట.