చైనాలో గృహ సంక్షోభం... 300కోట్ల మందికి సరిపడా ఇళ్ళు!
చైనాలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అన్నట్లుగా సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది.
By: Tupaki Desk | 24 Sep 2023 11:30 PM GMTచైనాలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అన్నట్లుగా సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. అది కూడా ఏ స్థాయిలో అంటే... ఇప్పుడు ఆ దేశంలో ఉన్న జనాభాకంటే ఇళ్లు ఎక్కువ! దీంతో లక్షల సంఖ్యలో ఖాళీ ఇల్లు ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది!
అవును... చైనా ఇప్పుడు గృహ సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఎంతలా అంటే... ప్రస్తుత చైనా జనాభా 140 కోట్లు కాగా, 300 కోట్ల మంది నివసించడానికి సరిపడా ఇల్లు ఉన్నాయంట. వాస్తవానికి ఒకప్పుడు చైనాలో దేశ ఆర్థిక వ్యవస్థకు రియల్ ఎస్టేట్ రంగమే వెన్నెముకగా ఉండేది. అయితే 2021లో ఏర్పడిన ఎవర్ గ్రాండ్ సంక్షోభంలో పడినప్పటినుంచీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
ఇదే క్రమంలో ఎవర్ గ్రాండ్ సంక్షోభానికి తోడు కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్ వంటి సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ వరుస దెబ్బలతో చైనా రియల్ ఎస్టేట్ రంగం ఆల్ మోస్ట్ పూర్తిగా పడిపోయినస్థితికి చేరుకుంది. దీంతో... ఈ ఏడాది గత నెలాఖరు నాటికి చైనాలో సుమారు 700 కోట్ల చదరపు అడుగుల మేర నిర్మాణాలు అమ్ముడవకుండా మిగిలిపోయాయంట.
ఈ 700 కోట్ల చదరపు అడుగులలో ఒక్కో ఇంటిని సగటున 970 ఎస్.ఎఫ్.టీ చొప్పున కట్టారని అనుకున్నా.. అమ్ముడు కాని ఇళ్ల సంఖ్య సుమారు 72 లక్షల ఇళ్లకు సమానం అన్నమాట. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ చెప్పిన ఈ ఒక్క లెక్క చాలు... చైనాలో సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్ధంకావడానికి.
దీంతో ఈ రియల్ సంక్షోభంపై చైనా స్టాస్టిక్స్ బ్యూరో మాజీ డిప్యూటీ హెడ్ హెకెంగ్ స్పందించారు. దక్షిణ చైనాలోని డాంగ్యూన్ నగరంలో జరిగిన సదస్సులో మాట్లాడిన ఆయన... ఒక్క మాటలో తాజా పరిస్థితిని పూసగుచ్చినట్లు చెప్పారు. ఇందులో భాగంగా... ప్రస్తుతం చైనాలో ఉన్న ఇళ్లు సుమారు 300 కోట్ల మంది నివసించడానికి సరిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ పరిస్థితితో ఖాళీగా ఉన్న రెసిడెన్షియల్ టవర్స్ ని పశ్చిమదేశాల మీడియాలు ఘోస్ట్ సిటీలు అని సంబోధిస్తూ వెటకారమాడుతుంటాయి. ఇలా... చైనా జీడీపీలో కీలక భూమిక పోషించే రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో దీన్ని "గృహ సంక్షోభం"గా పేర్కొంటున్నారు.
చైనా జీడీపీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి 29శాతం వాటా రియల్ ఎస్టేట్ రంగానిదే కావడం గమనార్హం. అంటే... అత్యంత వేగంగా ఈ రంగం డెవలప్ అయిపోయిందన్న మాట. అయితే పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా అయిపోయింది తాజా పరిస్థితి. ఈ రంగంలో నిర్మాణాలతోపాటు స్పెక్యూలేషన్ కూడా విపరీతంగా పెరిగిపోవడంతో డబ్బున్నవాళ్లు ఇళ్లను కొనుగోలు చేసి ఖాళీగా ఉంచుతున్నారు. ఫలితంగా... సుమారు రెండేళ్ల క్రితం వరకు చైనాలో దాదాపు 20శాతం నిర్మాణాలు ఖాళీగా ఉన్నట్లు ఎన్.పీ.ఆర్.ఓ.ఆర్.జీ. పేర్కొంది.