Begin typing your search above and press return to search.

రియాల్టీ బూమ్: రికార్డు స్థాయిలో గృహ రుణాలు

సొంతింటి కలను నెరవేర్చుకునే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది

By:  Tupaki Desk   |   6 May 2024 3:30 PM GMT
రియాల్టీ బూమ్: రికార్డు స్థాయిలో గృహ రుణాలు
X

సొంతింటి కలను నెరవేర్చుకునే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో తమ అవసరాలకు తగ్గట్లుగా ఇంటిని ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య పెరిగింది. ఈ ట్రెండ్ అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా విడుదలైన రిపోర్టు ఒకటి ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇంటి రుణాలకు పెరుగుతున్న డిమాండ్ సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది.

ఈ ఏడాది మార్చి చివరి నాటికి బ్యాంకులు.. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు మంజూరు చేసిన మొత్తం గృహా రుణాలు రూ.27.23 లక్షల కోట్లకు చేరుకున్నట్లుగా పేర్కొన్నారు. రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఇది రూ.10 లక్షల కోట్లు ఎక్కువ కావటం గమనార్హం. తాజాగా రిజర్వు బ్యాంకు విడుదల చేసిన తాజా గణాంకాల్ని చూస్తే.. కోవిడ్ తర్వాత ఇళ్లకు డిమాండ్ ఎంతలా పెరిగిందన్న విషయం స్పష్టమవుతుంది.

డిమాండ్ కు తగ్గట్లే.. గృహా రుణాల విషయంలో ప్రభుత్వ సానుకూల విధానాలు.. ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లతో పాటు.. సొంతింటి మీద పెరిగిన మక్కువ కూడా ఇంటి రుణాల మార్కెట్ ను పెంచాయని చెప్పాలి. ఈ ఏడాది ఎలా ఉంటుందన్న దానిపై మార్కెట్ వర్గాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఈ ఏడాది కూడా గృహా రుణాలకు ఢోకా ఉండదని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే.. రుణాల వృద్ధి రేటు గడిచిన రెండేళ్ల స్థాయిలో మాత్రం ఉండకపోవచ్చంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆరేళ్లలో గృహ రుణాల మార్కెట్‌ లక్ష కోట్ల డాలర్లకు చేరుకునే వీలుందని చెబుతున్నారు. ఇప్పుడున్న విదేశీ మారకం ప్రకారం మన రూపాయిల్లో చూస్తే దాదాపు రూ.83 లక్షల కోట్లకు సమానంగా చెప్పాలి. మారిన అభిరుచులతో ఉన్నత ఆదాయ వర్గాల వారు ధర ఎక్కువైనప్పటికి విశాలమైన ఇళ్ల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నట్లుగా చెబుతున్నారు.