హైదరాబాద్ స్థిరాస్తి ప్రత్యేకతను చెప్పిన అన్ రాక్ తాజా నివేదిక!
అంటే.. ఇంటి విలువ ఎక్కువగా పెరుగుతోందా? అద్దె విలువ ఎక్కువగా పెరుగుతుందా? అన్న అంశాల్ని విశ్లేషించింది.
By: Tupaki Desk | 18 March 2025 12:45 PM ISTఅన్ రాక్ స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తరచూ దేశంలోని వివిధ నగరాల్లోని రియల్ ఎస్టేట్ స్థితిగతుల్ని.. మార్కెట్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని విశ్లేషిస్తూ.. ఆసక్తికర అంశాల్ని వెల్లడిస్తూ ఉంటుంది. అలాంటి అన్ రాక్ తాజాగా విడుదల చేసిన నివేదిక ఒకటి అందరిని ఆకర్షిస్తోంది. గతానికి భిన్నంగా తాజా నివేదిక ప్రత్యేకత ఏమంటే.. ఇళ్ల ధరలు వర్సెస్ అద్దె ధరలు. అంటే.. ఇంటి విలువ ఎక్కువగా పెరుగుతోందా? అద్దె విలువ ఎక్కువగా పెరుగుతుందా? అన్న అంశాల్ని విశ్లేషించింది.
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చెప్పటంతో పాటు.. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఈ వ్యత్యాసాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పటం ఆసక్తికరంగా మారింది. తాజా రిపోర్టును దేశంలోని ఏడు ప్రధాన నగరాలైన ఢిల్లీ ఎన్ సీఆర్.. బెంగళూరు.. పుణె.. కోల్ కతా.. హైదరాబాద్.. చెన్నై నగరాల్లోని స్థితిగతుల్ని ఈ సంస్థ విశ్లేషించింది. 2021 నుంచి 2024 మధ్య కాలంలో పరిస్థితుల్ని మదింపు చేసింది.
ఆసక్తికరమైన అంశం ఏమంటే 2021 - 2024మద్య కాలంలో ఈ నగరాల్లో ఇళ్ల ధరలు 128 శాతం పెరిగినట్లు చెప్పింది. బెంగళూరు.. ఎన్ సీఆర్ ఢిల్లీ.. హైదరాబాద్ నగరాల్లో అద్దెల పెరుగుదలతో పోలిస్తే.. ఇళ్ల ధరలు పెరిగినట్లుగా పేర్కొంది. అదే సమయంలో పుణె.. కోల్ కతా.. చెన్నై నగరాల్లో మాత్రం ఇళ్ల ధరల కంటే కూడా అద్దెలు ఎక్కువైనట్లుగా గణాంకాల సహితంగా వివరించింది.
హైదరాబాద్ మహానగరాన్నే తీసుకుంటే గచ్చిబౌలి.. హైటెక్ సిటీ ప్రాంతాల్లో అద్దె పెరుగుదల.. ఇంటి ధరల కంటే ఎక్కువగా ఉన్నట్లుగా పేర్కొంది. హైటెక్ సిటీలో ఇళ్ల ధరల్లో వృద్ధి 62 శాతం ఉంటే.. అద్దెల్లో పెరుగుదల 54 శాతమేనని చెప్పింది. గచ్చిబౌలిలో ఇళ్ల ధరల్లో 78 శాతం ఉండగా.. అద్దెల్లో 62 శాతం వృద్ధి ఉన్నట్లు చెప్పింది. ఇళ్ల విలువ పెరగాలని ఆశించే వారికి హైదరాబాద్.. నోయిడా.. ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ అనుకూలమని చెబుతూ.. అద్దెల విలువ ఎక్కువగా ఉండాలని భావించే వారికి మాత్రం.. మిగిలిన నగరాలు బాగుంటాయని పేర్కొంది. ఈ రిపోర్టును చూస్తే.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇస్పెషాలిటీ ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.