కోకాపేటలోనే కాదు అక్కడ కూడా భూముల ధరల మోత!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలో ప్లాట్లను వేలం వేస్తున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 24 Aug 2023 7:11 AM GMTతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలో ప్లాట్లను వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోకాపేటలో మొదటి విడతలో వేలం వేసిన 65 ఎకరాలతో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. ఏకంగా రూ. 2 వేల కోట్లకుపైనే ప్రభుత్వం దండుకుంది. కోకాపేటలో ఎకరం గరిష్టంగా రూ.100 కోట్లకు, కనిష్టంగా రూ.45 కోట్లు పలికిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మరిన్ని ఆదాయ వనరులపై దృష్టి సారించిన ప్రభుత్వం ఇప్పుడు శంకరపల్లి మండలంలో మోకిలలో ప్లాట్లను అమ్ముతోంది. ఇక్కడ హెచ్‌ఎండీఏ లేఅవుట్ ని అభివృద్ధి చేసింది. దాదాపు 165 ఎకరాల విస్తీర్ణంలో 1,321 ప్లాట్లలతో కూడిన భారీ రెసిడెన్షియల్ లేఅవుట్ ను సిద్ధం చేసింది. ఆగస్టు మొదటి వారంలో జరిగిన అమ్మకంలో కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఈ నేపథ్యంలో రెండో దశలో 300 ప్లాట్లను ఆన్‌లైన్ వేలం ద్వారా ఆగస్టు 23 నుంచి 29 వరకు విక్రయించనుంది. మోకిలలో మొదటి ఫేజ్ లో మంచి డిమాండ్ వచ్చిన నేపథ్యంలో రెండో దశలో 300 ప్లాట్లకు ప్రీబిడ్ లను ఆహ్వానించింది.
ఈ క్రమంలో మోకిలలో ఆగస్టు 23 బుధవారం ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో 60 ప్లాట్లను వేలం వేయగా.. గరిష్ఠంగా చదరపు గజానికి రూ.లక్ష ధర లభించింది. 361 నంబరు ప్లాటు చదరపు గజానికి రూ.లక్ష చొప్పున 375 గజాలకు రూ.3.75 కోట్లు పలకడం విశేషం. రెండు మినహా మిగతా 58 ప్లాట్లు వేలంలో అమ్ముడుపోవడం విశేషం.
సరాసరి చదరపు గజం ధర రూ.63,512 చొప్పున వేలంలో అమ్ముడైంది. కనిష్ఠ ధర చదరపు గజానికి రూ.55 వేల వరకు పలికింది. మొత్తం 20,025 చదరపు గజాలకు గాను 19,275 చదరపు గజాలు అమ్ముడుపోయాయి. దీనిద్వారా హెచ్‌ఎండీఏకు రూ.122.42 కోట్ల ఆదాయం వచ్చింది. అప్‌సెట్ ధర రూ.50 కోట్లు కంటే రెండు రెట్లకు పైగా రావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
కాగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో ఆగస్టు మొదటి వారంలో మోకిలలో నిర్వహించిన మొదటి విడత వేలంలో ప్లాట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా.. చదరపు గజం గరిష్ఠంగా రూ.1.05 లక్షల వరకు ధర పలికింది. కనీస ధర రూ.72 వేలకు విక్రయించారు. ఒక్కో ప్లాట్ 300-500 చదరపు గజాల్లోపు ఉంది. కోకాపేట నియోపోలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగిలకు సమీపంలో ఉండటంతో కొనుగోలుదారులు ఎగబడ్డారు. అప్‌సెట్ ధర చదరపు గజానికి రూ.25 వేలు నిర్ణయించగా.. కొన్ని మూడు, నాలుగు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడయ్యాయి. మొత్తం 50 ప్లాట్లకు రూ.40 కోట్లు ఆశించగా.. అంతకు మూడు రెట్లు అధికంగా రూ.121.40 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.