ఈ 17 నగరాల్లో పెట్టుబడులు పెడితే ఇక తిరుగులేనట్టే!
ఈ 17 నగరాలు రియల్ ఎస్టేట్ రంగ వృద్ధికి హాట్ స్పాట్లుగా ఉన్నాయని తెలిపింది.
By: Tupaki Desk | 19 Jun 2024 5:30 PM GMTప్రముఖ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థ.. కొలియర్స్ సంచలన అధ్యయనాన్ని వెలువరించింది. భారతదేశంలో 17 నగరాలు రియల్ ఎస్టేట్ రంగ వృద్ధికి ఆశాకిరణాలుగా ఉన్నాయని పేర్కొంది. ఈ 17 నగరాలు రియల్ ఎస్టేట్ రంగ వృద్ధికి హాట్ స్పాట్లుగా ఉన్నాయని తెలిపింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి, విశాఖపట్నం చోటు దక్కించుకోవడం విశేషం.
అయితే దేశంలో ఈ 17 నగరాలు కేవలం రియల్ ఎస్టేట్ రంగానికే కాకుండా పలు అవకాశాల ఆధారంగా అభివృద్ధి చెందుతున్నాయని కొలియర్స్ వెల్లడించింది. మన దేశంలో తిరుపతి (ఆంధ్రప్రదేశ్), షిరిడీ (మహారాష్ట్ర), వారణాసి (ఉత్తరప్రదేశ్), ద్వారక (గుజరాత్), అయోధ్య (ఉత్తరప్రదేశ్), పూరి (ఒడిశా) వంటి ఆధ్యాత్మిక నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని కొలియర్స్ తన నివేదికలో వెల్లడించింది.
మనదేశంలో ఎక్కువ మంది హిందువులు దర్శించే పుణ్యక్షేత్రాల్లో తిరుపతి, షిరిడీ, కాశీ, అయోధ్య, ద్వారక, పూరి చోటు దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి ఈ ఆధ్యాత్మిక నగరాల్లో అవకాశాలున్నాయని కొలియర్స్ వెల్లడించింది.
అలాగే ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద నగరమైన విశాఖపట్నం పర్యాటక రంగానికి పేరుపొందింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా ఈ నగరానికి పేరుంది. ఈ నేపథ్యంలో విశాఖలో స్థిరాస్థి వృద్ధికి అపార అవకాశాలున్నాయని కొలియర్స్ తెలిపింది.
అలాగే తమిళనాడులో రెండో అతిపెద్ద నగరంగా ఉన్న కోయంబత్తూరు, కేరళలో అతిపెద్ద నగరమైన కోచి (కొచ్చిన్)లోనూ రియల్ ఎస్టేట్ రంగానికి మంచి పరిస్థితులు ఉన్నాయని కొలియర్స్ తన నివేదికలో వెల్లడించింది.
టాప్ 17 నగరాల్లో అమృత్ సర్ (పంజాబ్), అయోధ్య (ఉత్తరప్రదేశ్), కోయంబత్తూర్ (తమిళనాడు), ద్వారక (గుజరాత్), ఇండోర్ (మధ్యప్రదేశ్) తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయని కొలియర్స్ పేర్కొంది.
దేశంలో తాము గుర్తించిన 17 నగరాల్లో ఆధ్యాత్మిక పర్యాటకం, డిజిటలైజేషన్, డేటా సెంటర్ల ఏర్పాటు, రియల్ ఎస్టేట్ రంగ వృద్ధికి అధిక అవకాశాలున్నాయని కొలియర్స్ తెలిపింది. ఈ నగరాల్లో హౌసింగ్, హాస్పిటాలిటీ, రిటైల్ రంగం, వాణిజ్య, వ్యాపార రంగాల వృద్ధికి ఆశాజనక పరిస్థితులున్నాయని పేర్కొంది. ఈ నగరాల్లో ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ మౌలిక వసతుల కల్పనకు తీసుకుంటున్న చర్యలు కలిసివస్తాయని వివరించింది.
కాగా తాము పేర్కొన్న 17 నగరాల్లో అన్ని రకాల వృద్ధికి అవకాశాలు లేవని కొలియర్స్ తెలిపింది. ఒక్కో నగరం.. కొన్నింటికి అనుకూలంగా ఉన్నట్టు వివరించింది. తిరుపతిలో గృహ నిర్మాణం, ఆతిథ్య రంగం, రిటైల్ రంగాలకు అవకాశాలున్నాయని తెలిపింది. విశాఖపట్నంలో రెసిడెన్షియల్, వేర్ హౌసింగ్ బిజినెస్, రిటైల్, డేటా సెంటర్ల ఏర్పాటు వంటి వాటికి అపార అవకాశాలున్నట్టు పేర్కొంది.