Begin typing your search above and press return to search.

కొత్తవలసలో సైట్ ఉంటే చాలు విశాఖలో ఆస్తులు ఉన్నట్లే !

విశాఖలో ఈ రోజున ఇల్లు కొనాలన్నా లేక స్థలం తీసుకోవాలన్న కోట్లు తీయాల్సిందే. అదే కొత్తవలసలో అయితే రీజనబుల్ ధరలలో సైట్లు దొరుకుతున్నాయి.

By:  Tupaki Desk   |   10 Sep 2024 10:45 AM GMT
కొత్తవలసలో సైట్ ఉంటే చాలు విశాఖలో ఆస్తులు ఉన్నట్లే !
X

అవును మీరు వింటున్నది నిజం. ఇపుడు ఇదే నిజం. విశాఖలో ఆస్తులు ఉన్న వారితో సరిసమానంగా కొత్తవలసలో ఆస్తులు ఉన్న వారు కూడా నిలుస్తున్నారు విలువ కడితే కొత్తవలసలో ఆస్తులు ఉన్న వారిదే భవిష్యత్తు అన్నది కూడా తెలుస్తోంది. విశాఖ సిటీలో ఇపుడు విస్తరించడానికి అయితే లేదు, విశాఖ లో గజం స్థలం హార్ట్ ఆఫ్ ది సిటీలో ఏకంగా లక్షన్నర దాకా పలుకుతోంది. దాంతో సొంత ఇల్లు కావాలనుకునే వారు చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది.

అయితే ఇటు విజయనగరం భోగాపురం ఎయిర్ పోర్టు అంటూ ఉన్నా కూడా జనాల చూపు మాత్రం కొత్తవలస మీదనే ఉంది.ఎందుకంటే కొత్తవలస దూరం కాదు అన్నది మానసికంగా జనంలో ఏర్పడిన భావన. పెందుర్తి ఒకనాడు విశాఖకు దూరం అనుకున్నా ఇపుడు పార్ట్ ఆండ్ పార్షల్ అయిపోయింది. అదే తీరున కొత్తవలస కూడా విశాఖలో భాగం అవుతోంది.

ఒక విధంగా చెప్పుకోవాలీ అంటే ఉత్తరాంధ్రాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రాంతంగా కొత్తవలసను చెప్పుకోవాల్సి ఉంది. కొత్తవలస విశాఖకు 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే అటు రైల్వే ట్రాక్ ఉంది. ఇటు సిటీ బస్సులు ఉన్నాయి. దాంతో విశాఖకు వచ్చేందుకు విశాఖ సిటీతోనే ఉండేందుకు ఈ రవాణా సదుపాయం పూర్తిగా ఆస్కారం కల్పిస్తోంది. మరో వైపు చూస్తే కొత్తవలస అన్నది ఒక అందమైన గ్రామీణ ప్రాంతం. అక్కడ నుంచి ఇంకాస్తా వెళ్తే అరకు వైపుగా వెళ్లవచ్చు. అటు అద్భుతమైన పర్యాటక ప్రాంతాలకు చేరువగా కొత్తవలస ఉంది.

నిజానికి చూస్తే భౌగోళికంగా కొత్తవలస విజయనగరం జిల్లాలో ఉంది. ఎస్ కోట నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అయితే ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి నేతలు కొత్తవలసతో పాటు ఎస్ కోటను మొత్తంగా విశాఖ జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు ఎందుకంటే విశాఖ ఎంపీ సీటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆరు విశాఖ జిల్లాలోనే ఉన్నాయి. ఒక్క ఎస్ కోట మాత్రమే విజయనగరంలో ఉంది. దాంతో దానిని విశాఖలో చేర్పించేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అది కనుక జరిగితే కొత్తవలస పూర్తిగా విశాఖ జిల్లాలోకే వస్తుంది. ఇక కొత్తవలసను అటు ఉద్యోగస్తుల నుంచి ఇటు మధ్యతరగతి వర్గాలు అంతా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దానికి కారణం కొత్తవలసలో ఇల్లు ఉన్నా లేక సైట్ ఉన్నా కూడా అది గొప్ప ఆస్తి అవుతుందని వారి ఆలోచన. అంతే కాదు అందమైన విశాఖ నగరానికి ఆనుకుని ఉన్నామని కూడా అంతా అనుకుంటారు.

విశాఖలో ఈ రోజున ఇల్లు కొనాలన్నా లేక స్థలం తీసుకోవాలన్న కోట్లు తీయాల్సిందే. అదే కొత్తవలసలో అయితే రీజనబుల్ ధరలలో సైట్లు దొరుకుతున్నాయి. కొత్త వెంచర్లు అన్నీ అక్కడే స్టార్ట్ చేస్తున్నారు. దాంతో కొత్తవలస సరికొత్తగా కనిపిస్తోంది. ఒక ఇంటి వారు కావాలనుకున్న వారికి ఇంతకు మించిన చాయిస్ లేదు అన్నట్లుగా కొత్తవలస ఊరిస్తోంది.

ఆ మధ్య దాకా కొత్తవలసలో గజం పది వేల రూపాయలు ఉండేది, కానీ ఇపుడు మారిన పరిస్థితులు జనాలలో వచ్చిన మార్పు, విశాఖలో అంతర్భాగంగా ఉండడం, ఏ రోజు అయినా విశాఖలోనే కలుస్తుంది అన్న ఆలోచనలు అన్నీ కలసి ఒక్కసారిగా ధరలను పెంచేశాయి. గజం ఇపుడు పదిహేను వేల పై దాటి పలుకుతోంది అంటే కొత్తవలసలో భూములకు రెక్కలు వచ్చినట్లే అని అంటున్నారు.

అంతకంతకు తన గిరాకీ పెంచుకుంటూ పోతున్న కొత్తవలసలో ఏమి లేదు అన్నదే ప్రశ్న. అంటే అన్నీ ఉన్నాయనే అంటున్నారు. కొత్తవలసలో నుంచి విశాఖలో ఉద్యోగ ఉపాధి కోసం నిత్యం షటిల్ సర్వీస్ చేసే వారు కూడా అత్యధికంగా ఉన్నారు అంటే అది విశాఖతో ఎంతలా ముడి వేసుకుని పోయిందో కూడా చూడాల్సి ఉంది.

ఇంకో వైపు చూస్తే కొత్తవలస కేరాఫ్ మధ్యతరగతి అన్న భావన ఉంది. మధ్యతరగతి జీవులకు అది స్వర్గధామంగా మారుతోంది. విశాఖలో తమకూ ఒక సైట్ ఉండాలనుకునే వారి కోరికను ఎంచక్కా తీరుస్తున్న కల్పవల్లిగా కూడా కొత్తవలసను అంతా చూస్తున్నారు. ఫలితంగా కొత్తవలసలో ఒక కొత్త వెంచర్ వేయాలీ కానీ హాట్ కేకుల్లా స్థలాలు అమ్ముడు పోతున్నాయని కూడా రియల్ బిజినెస్ లెక్కలు చెబుతున్నాయి.

ఇక కొత్తవలసలో భూములు స్థలాలు కొనడం ద్వారా భవిష్యత్తు పెట్టుబడులకు మార్గంగా కొంతమంది మదుపరులు భావిస్తున్నారు. అయితే ఈ పెట్టుబడులు పెట్టేవారు ఎవరైనా లాంగ్ టెర్మ్ లో పెట్టుబడులు పెడితే హైదరాబాద్లో భూములకు మించి అంతకు అంతా కొత్తవలసలోనూ వస్తుందని అంటున్నారు

ఈ రోజున కొత్తవలసలో రెండు వందల గజాల స్థలం ఇరవై లక్షలకు వస్తోంది. ఇదే ఫ్యూచర్ లో కోటికి మించినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఎందుకంటే భూమికి ఉన్న డిమాండ్ ఒకటైతే కొత్తవలసకు ఉన్న ప్రయారిటీ దానికి రెట్టింపు చేస్తోంది.

మొత్తమ్మీద చూస్తే కొత్త కొత్త ఆశలతో ఉన్న వారికి కొత్తవలస నేనున్నాను అని అభయం ఇస్తోంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ నే కాదు సామాన్యుడిని దీవిస్తోంది. రానున్న రోజులలో కొత్తవలస గ్రేటర్ విశాఖ లో అతి ముఖ్య భాగం అవుతుంది అనడంలో అయితే సందేహం లేదు అన్నది అందరి మాటగా ఉంది.