Begin typing your search above and press return to search.

పాత ఇళ్లు కావలెను... కొత్త ట్రెండ్ ఇదే... కారణాలు ఇవే!

అవును... ఆర్థికంగా తమ వెసులుబాటు పెరుగుతున్న కొద్దీ మరిన్ని వసతులతో కూడిన ఇళ్ల కోసం ప్రయత్నిస్తున్నారనేది తెలిసిన విషయమే.

By:  Tupaki Desk   |   10 Feb 2024 2:30 PM GMT
పాత ఇళ్లు కావలెను... కొత్త ట్రెండ్  ఇదే... కారణాలు ఇవే!
X

ప్రతీ మనిషీ తన జీవితకాలంలో.. చిన్నదో పెద్దదో, గుడిసే గుడారమో, బిల్డింగో ప్యాలెస్సో.. ఏదైనా కానీ ఒక స్థిర శాస్వత సొంత నివాసం ఉండాలని భావిస్తుంటాడు.. దానికోసమే పరితపిస్తుంటాడు. ఈ క్రమంలో పెరుగుతున్న జనాభాకు అనువుగా స్థలాలు పెరగవు కాబట్టి.. వాటి రేట్లు మాత్రం భారీగా పెరుగుతూ ఉంటాయి. దీంతో... అపార్ట్మెంట్ కల్చర్ అనేది పురుడుపోసుకుంది! ఇక రెండు తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే విశ్వనగరంగా మారుతోన్న హైదరాబాద్‌ లో జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి.

బైక్ సైతం వెళ్లడానికి ఇబ్బందిగా అనిపించే బస్తీలు.. ఇప్పుడు కాలనీలుగా మారుతున్నాయి. కాలనీలు గేటేడ్ కమ్యునిటీలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ సమయంలో పలు రియల్ ఎస్టేట్ సంస్థలు కొత్త కొత్త రకాలుగా కనస్ట్రక్షన్స్ చేస్తున్నాయి. సరికొత్త హంగులతో నిర్మాణాలు చేపడుతున్నాయి. మొన్నటికంటే నిన్న, నిన్నటికంటే నేడు, నేటి కంటే రేపు బాగుండేలా ప్లాన్స్ చేస్తూ, సరికొత్త డిజైన్స్ తో మార్కెట్ లోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో... మరి పాత ఇళ్ల పరిస్థితి ఏమిటి అనే సందేహం రావడం సహజం.

అవును... ఆర్థికంగా తమ వెసులుబాటు పెరుగుతున్న కొద్దీ మరిన్ని వసతులతో కూడిన ఇళ్ల కోసం ప్రయత్నిస్తున్నారనేది తెలిసిన విషయమే. ఈ సమయంలో చాలా కొత్త ఇళ్ల కోసమే వెతకడమే కాకుండా... తమ అభిరుచికి అనుగుణంగా ఉన్న పాత ఇళ్లను సైతం చూస్తున్నారట. దీంతో.. ప్రస్తుతం హైదరాబాద్‌ లో పాత ఇళ్లకు ఫుల్‌ డిమాండ్‌ పెరిగిందని చెబుతున్నారు. పైగా కొత్త సింగిల్, డబుల్ బెడ్ రూం కంటే... పాత ట్రిపుల్ బెడ్ రూం వైపు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు.

కొత్తగా తీసుకునే డబుల్ బెడ్ రూం ఇంటి డబ్బుతో పాత ట్రిపుల్ బెడ్ రూం వచ్చే అవకాశాలు ఉండటం కూడా ఇందుకు కారణం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో పాత ఇళ్లకు డిమాండ్ పెరుగుతుందని అంటున్నరట. దీంతో... కొత్తగా కడుతున్న అపార్టుమెంట్లతో దీటుగా పాత ఫ్లాట్స్‌ ధరలు పోటీ పడుతున్నాయని రియల్టర్లు చెబుతున్నారని తెలుస్తుంది. దీనికి పలు కారణాలు చెబుతున్నారు పరిశీలకులు.

పాత ఫ్లాట్లు కొనేవారు కార్పస్‌ ఫండ్‌ చెల్లించాల్సిన అవసరం కూడా లేకపోవడం.. అదేవిధంగా కారు పార్కింగ్‌, ఇతర మెయింటినెన్స్ ఛార్జీలు కూడా కొత్త అపార్ట్మెంట్లకు చెల్లించాల్సిన వాటితో పోల్చుకుంటే తక్కువగా ఉండడం వంటివి కూడా కారణాలని అంటున్నారు. ఈ ఆలోచన సరే కానీ... పాత ఇళ్లను, ఫ్లాట్స్‌ ను కొనుగోలు చేసే ముందు.. వాటిని నిశితంగా పరిశీలించి తీసుకోవడం మంచిదని నిర్మాణరంగ నిపుణులు సూచిస్తున్నారు.