అమరావతి, విశాఖల్లో కొందామన్నా భూమి కరువు.. రీజనేంటి?
ఇక, ఇప్పుడు కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. మరోసారి రియల్ ఎస్టేట్ పుంజుకుంది.
By: Tupaki Desk | 29 Oct 2024 3:30 PM GMTఏపీలో గత ఐదేళ్లలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడకేసింది. అనేక మంది వ్యాపారులు హైదరాబాద్ సహా పలు నగరాలకు వలస పోయారు. ఇక, అప్పటికే ప్రారంభించిన నిర్మాణాలను కూడా నిలుపుదల చేసుకునే పరిస్థితి తలెత్తింది. వైసీపీ హయాంలో ఇసుక కొరత.. ఇతర ముడి సరుకుల ధరలు కూడా ఆకాశానికి ఎగబాకడంతో నిర్మాణ రంగం కుదేలైంది. ఫలితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నానా తిప్పలు పడే పరిస్థితి వచ్చింది.
ఇక, ఇప్పుడు కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. మరోసారి రియల్ ఎస్టేట్ పుంజుకుంది. గత నాలుగు మాసాల కాలంలో కూటమి సర్కారు ఇచ్చిన ఫ్రీహ్యాండ్‌తో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తిరిగి ఏపీకి చేరుకు న్నారు. ప్రధానంగా రాజధాని నిర్మాణం విషయంలో సర్కారునిలకడైన నిర్ణయం తీసుకోవడం.. అమరావ తిలో నిర్మాణాలను తిరిగి ప్రారంభించడం, కేంద్రం నుంచి కూడా.. ఆర్థిక సాయం లభిస్తుండడంతో వచ్చే మూడేళ్లలోనే అమరావతి నిర్మాణం దాదాపు 50 శాతం పూర్తవుతుందన్న అంచనా వుంది.
దీంతో అమరావతిలో ఇప్పుడు రియల్ బూమ్ మరోసారి పుంజుకుంది. దీంతో ఇక్కడ ఎగువ మధ్య తరగతి వారు కూడా భూములు, ఫ్లాట్లుకొనుగోలు చేసేందుకు ఎక్కడా ఖాళీ లేక పోవడం గమనార్హం. అంతేకాదు.. ఉన్నా కూడా పోటీ ఎక్కువగా ఉంది. డబుల్ బెడ్ రూమ్ ఫ్లాటు, నిర్మాణంలో ఉండగానే 70 నుంచి 80 లక్షల మధ్య ఉన్నాయి. ఇక, నిర్మాణం పూర్తి చేసుకున్నవి 85 లక్షలకు తగ్గడం లేదు. విల్లాలు 3 నుంచి 5 కోట్ల వరకు పలుకుతున్నాయి.
ఇక, విశాఖలోనూ ఇలానే పరిస్థితి నెలకొంది. విశాఖ విషయంలోనూ కూటమి సర్కారు నిలకడైన నిర్ణయం తీసుకోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. దీనిని ఐటీరాజధానిని చేయాలని, ఆర్థిక రాజధానిని చేయాలని తలపోస్తున్న నేపథ్యంలో రియల్ బూమ్ పుంజుకుంది. పైగా పెట్టుబడిదారులు మళ్లీ విశాఖకు వస్తున్నారన్న సంకేతాలు వస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కూడా రానున్నారు. ఈ పరిణామాలతో ఇక్కడ కూడా స్థలాలు దొరకడం లేదు. ఫ్లాట్లు, విల్లాలకు డిమాండ్ కూడా భారీగానే ఉంది. ఇదీ.. సంగతి!!