Begin typing your search above and press return to search.

హైదరాబాద్ రియల్ బూమ్ ప్లాన్ బయటపెట్టిన రేవంత్!

ఇందులో భాగంగా అధికారులతో నిర్వహించిన తాజా రివ్యూలో ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.

By:  Tupaki Desk   |   19 Dec 2023 8:30 AM GMT
హైదరాబాద్ రియల్ బూమ్ ప్లాన్ బయటపెట్టిన రేవంత్!
X

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ముందున్న సవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే రియల్ ఎస్టేట్ స్తబ్దుగా మారుతుందని. దాన్ని పూర్వ దశకు తీసుకెళ్లాలంటే కాస్త కష్టంతో కూడుకున్నదన్న చర్చ గురించి తెలిసిందే. రియల్ ఎస్టేట్ నుంచి ఎదిగిన రేవంత్ కు.. తాజా పరిస్థితి ఒక సవాలు లాంటిది. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఆరు గ్యారెంటీ హామీల అమలు అంత తేలికైన విషయం కాదు. అందునా తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో కీలకమైన రియల్ రంగం ఇప్పుడు ఒకలాంటి స్తబ్దుగా ఉండటంతో..దానిలో కదలిక తెచ్చేందుకు.. చైతన్యంతో పాత జోష్ ను తీసుకొచ్చేందుకు రేవంత్ తన కార్యాచరణను షురూ చేసినట్లుగా చెప్పాలి.

తాజాగా హైదరాబాద్ రియల్ జోరుకు వీలుగా రేవంత్ తన మాస్టర్ ప్లాన్ రివీల్ చేసినట్లుగా చెప్పాలి. ఇందులో భాగంగా అధికారులతో నిర్వహించిన తాజా రివ్యూలో ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. కొత్త పారిశ్రామికవాడల్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా హైదరాబాద్ ఔటరు రింగురోడ్డు బయట.. కొత్తగా నిర్మితమయ్యే రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) లోపు ఉండేలా భూముల్ని గుర్తించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి. ఎయిర్పోర్టు.. నేషనల్ హైవే కు 50నుంచి 100 కిలోమీటర్ల దూరంలో 500 నుంచి 1000 ఎకరాల వరకు గుర్తించాలన్న సూచనను రేవంత్ చేసినట్లుగా చెబుతున్నారు.

అయితే.. ఈ భూములు సాగుకు అనువుగా లేనివిగా చూడాలన్న ఆయన.. పరిశ్రమల ఏర్పాటుకు ఈ భూముల్ని సేకరించటం ద్వారా రైతులకు నష్టం వాటిల్లదని పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. కాలుష్య సమస్యల మీద అభ్యంతరాలు వ్యక్తం కావని చెప్పినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లోని నివాసిత ప్రాంతాలకు దూరంగా ఉండే ప్రభుత్వ.. బంజరు భూములను ఇవ్వాలని అధికారుల్ని కోరినట్లుగా చెబుతున్నారు.

దీంతో.. తక్కువ ధరకు భూములు అందుబాటులోకి రావటంతో పాటు.. ఒకవేళ భూసేకరణ అవసరమైనా.. ఎక్కువ ఖర్చు కాదన్న అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోని నాచారం.. జీడిమెట్ల.. కాటేదాన్ తదితరపారిశ్రామిక వాడల తరలింపు ప్రత్యామ్నాయం సూచన చేయాలని చెప్పినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. పారిశ్రామిక అవసరాల కోసం థర్మల్ విద్యుత్ కు బదులుగాసౌర విద్యుత్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్న రేవంత్.. అందుకు తగ్గట్లుగా ప్రణాళికల్ని సిద్ధం చేయాలని అధికారులకు సూచన చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా త్వరగా రియల్ జోష్ కు ఏయే చర్యలు చేపట్టాలో.. ఆ దిశగా అడుగులు వేసేలా రేవంత్ వ్యూహాలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.