Begin typing your search above and press return to search.

ఏడాది క్రితం 50 ఎకరాలకు రూ.2వేల కోట్లు.. తాజాగా ఎంతంటే?

ఈసారి హాట్ టాపిక్ గా మారి రూ.100.75 కోట్లు ఎకరం పలికిన భూమి బిట్ మొత్తం 3.6 ఎకరాలు.

By:  Tupaki Desk   |   4 Aug 2023 4:29 AM GMT
ఏడాది క్రితం 50 ఎకరాలకు రూ.2వేల కోట్లు.. తాజాగా ఎంతంటే?
X

ఏడాది వ్యవధిలో వచ్చిన మార్పు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రియల్ ఎస్టేట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. హెచ్ఎండీఏ వారు కోకాపేటలో గురువారం నిర్వహించిన నియో పోలిస్ వెంచర్ కింద భూముల అమ్మకాలకు వచ్చిన ఆదాయం ఇప్పుడు కొత్త చర్చనీయాంశంగా మారింది. తాజాగా వేలం వేసిన 45 ఎకరాలకు హెచ్ఎండీఏ వర్గాలు రూ.2వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తే.. చివరకు రూ.3319.6 కోట్ల ఆదాయం రావటంపై విస్మయం వ్యక్తమవుతోంది.

గత ఏడాది జులై 15న హెచ్ఎండీఏ కోకాపేటలో దగ్గర దగ్గర 50 ఎకరాలు (కచ్ఛితంగా చెప్పాలంటే 49.94 ఎకరాలు) వేలం వేస్తే వచ్చిన ఆదాయం రూ.2వేల కోట్లు. పెరిగిన డిమాండ్ నేపథ్యంలో గత ఏడాది కంటే దాదాపు నాలుగు ఎకరాలు తక్కువగా వేలం వేయటంతో రూ.2వేల కోట్ల ఆదాయం వస్తే అదే గొప్పగా అధికారులు భావించారు. కానీ.. వేలం మొదలైన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఎకంగా రూ.3319 కోట్ల ఆదాయం రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గత ఏడాది జరిగిన వేలంలో ఎకరం భూమి అత్యధికంగా రూ.60.20 కోట్లు పలికితే.. అత్యల్పంగా ఎకరం రూ.31.20 కోట్లు పలికింది. తాజా వేలం విషయానికి వస్తే అత్యధికంగా ఎకరం రూ.100.75 కోట్ల రికార్డు ధర పలకటం పెను సంచలనంగా మారింది. ఎకరం భూమి రూ.100కోట్లా? అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం విస్మయానికి గురయ్యే పరిస్థితి. ఈసారి వేలంలో ఎకరం భూమి గరిష్ఠంగా రూ.100.75 కోట్లు అత్యధికం కాగా అత్యల్పంగా ఎకరం రూ.67.25 కోట్లు పలకటం గమనార్హం.

అంటే.. ఏడాది వ్యవధిలో అప్పటి గరిష్ఠం ఇప్పుడు కనిష్ఠంగా మారటం చూస్తే.. హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ జోరు ఏ రీతిలో ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. గత ఏడాది నిర్వహించిన వేలంలో నగరానికి చెందిన సంస్థలే భూముల్ని సొంతం చేసుకోగా.. ఈసారి వేలంలో మాత్రం ఇతర రాష్ట్రాలకు చెందిన సంస్థలు కూడా సొంతం చేసుకోవటం గమనార్హం.

గత ఏడాది భూముల్ని సొంతం చేసుకున్న రియల్ సంస్థలు.. ఈసారి కూడా ఎక్కువ మంది భూముల్ని సొంతం చేసుకోవటం విశేషం. ఈసారి హాట్ టాపిక్ గా మారి రూ.100.75 కోట్లు ఎకరం పలికిన భూమి బిట్ మొత్తం 3.6 ఎకరాలు. ఇందుకోసం ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ రాజపుష్ప రూ.362.70 కోట్లకు కొనుగోలు చేసింది.

తాజాగా వేలంలో పాల్గొన్న వ్యక్తులు కానీ సంస్థలు కానీ రూ.5కోట్లు డిపాజిట్ చెల్లించిన తర్వాతే వేలంలో పాల్గొనే వీలు ఉంటుంది. వేలంలో భూముల్ని సొంతం చేసుకున్న వారు తాము కొన్న ఖరీదు మొత్తంలో 33 శాతాన్ని ఏడు రోజుల వ్యవధిలో చెల్లించాల్సి ఉంటుంది. రెండో విడత మొత్తాన్ని 30 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. చివరి విడత మొత్తాన్ని 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. ముందుగా కట్టిన అడ్వాన్సు మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.