Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : మామా మశ్చీంద్ర

By:  Tupaki Desk   |   6 Oct 2023 8:11 AM GMT
మూవీ రివ్యూ : మామా మశ్చీంద్ర
X

'మామా మశ్చీంద్ర' మూవీ రివ్యూ

నటీనటులు: సుధీర్ బాబు-ఈషా రెబ్బా-మృణాళిని రవి-హర్షవర్ధన్-అలీ రెజా-రాజీవ్ కనకాల-హరితేజ-అజయ్-మిర్చి కిరణ్ తదితరులు

సంగీతం: చేతన్ భరద్వాజ్

నేపథ్య సంగీతం: ప్రవీణ్ లక్కరాజు

ఛాయాగ్రహణం: పి.జి.విందా

నిర్మాతలు: సునీల్ నారంగ్-పుస్కుర్ రామ్మోహన్ రావు

రచన-దర్శకత్వం: హర్షవర్ధన్

నటుడిగా.. రచయితగా మంచి పేరు సంపాదించిన హర్షవర్ధన్ దర్శకుడిగా మారి ఇప్పటికే ఓ సినిమా తీశాడు. అది విడుదలకు నోచుకోకపోయినా నిరాశ చెందకుండా సుధీర్ బాబు హీరోగా 'మామా మశ్చీంద్ర' అనే వెరైటీ టైటిల్‌ తో అతను సినిమా తీశాడు. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

పరశురాం (సుధీర్ బాబు) చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోగా.. ఆస్తి కోసం తన తల్లిని ప్రాణం పోయేలా చేసిన తండ్రి.. అలాగే తనను మోసం చేసిన మేనమామ మీద పగ పెంచుకుంటాడు. తన తండ్రిని చంపి జైలుకు వెళ్లి తిరిగి వచ్చాక తన మేనమామ మీద పగ తీర్చుకోవడానికి అతడి ఇంట్లో పాగా వేస్తాడు. అతను కూతురిలా పెంచుకునే అమ్మాయిని పెళ్లాడతాడు. ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చాక పరశురాం భార్య చనిపోతుంది. ఆ బాధతో అతడి మేనమామ కూడా ప్రాణాలు వదులుతాడు. తన సవతి సోదరినే తన మేనమామ కొడుకు పెళ్లాడటంతో వాళ్లిద్దరూ వారి పిల్లలు తన మీద పగతీర్చుకుంటారేమో అని పరశురాంలో భయం మొదలవుతుంది. వాళ్లందరినీ చంపడానికి ప్రయత్నించినా కుదరదు. ఈ భయంతోనే తన కూతురిని పెంచి పెద్ద చేస్తాడు పరశురాం. అతడి కూతురు మీనాక్షి పెరిగి పెద్దదై పరశురాం మేనల్లుడితోనే ప్రేమలో పడుతుంది. దీంతో తన కూతురు ఏమవుతుందో అన్న భయం పరశురాంలో ఇంకా పెరిగిపోతుంది. ఈ స్థితిలో అతనేం చేశాడు.. చివరికి ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది తెరపైనే చూడాలి.

కథనం-విశ్లేషణ:

'లడ్డు బాబు' అని అల్లరి నరేష్ నటించిన ఓ సినిమా. హీరోను స్థూలకాయుడిగా చూపించి నవ్వుల్లో ముంచెత్తేద్దామని చూశాడు రవిబాబు. కానీ అల్లరి నరేష్ లాంటి బక్క జీవిని ప్రోస్థెటిక్ మేకప్‌ సాయంతో లడ్డు బాబులా చూపించే ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టేసింది. ఆ సినిమాలో కథాకథనాలు సన్నివేశాలు ఎలా ఉన్నాయన్నది పక్కన పెడితే.. చాలా అసహజంగా.. ఎబ్బెట్టుగా అనిపించిన నరేష్ మేకప్పే సినిమాను సగం దెబ్బ కొట్టేసింది. ఆ పాత్ర కనిపించినపుడల్లా తెర వైపు చూడలేనంత వికారం కలిగింది ప్రేక్షకులకు. ఇక విక్రమ్ హీరోగా శంకర్ తీసిన 'ఐ' సినిమా సైతం దాదాపుగా ఇలాంటి ఫీలింగే కలిగించింది. హీరో అందవిహీనంగా కనిపించినా ప్రేక్షకులు తట్టుకుని సినిమా చూడాలంటే.. అందులో ఏదో ఒక వైవిధ్యమైన పాయింట్.. బలమైనఎమోషన్ ఉండటం చాలా అవసరం. అలా కాకుండా హీరోను కేవలం డిఫరెంట్ గెటప్ లో చూపించడమే వైవిధ్యం అనుకుంటే పై సినిమాల్లాగే తయారవుతుంది. ఇప్పుడు 'మామా మశ్చీంద్ర'తో వచ్చిన సమస్య కూడా ఇదే. చిజిల్డ్ బాడీతో కనిపించే సుధీర్ బాబును స్థూలకాయుడిగా చూపించి.. పాత్రలో ఒక వేరియేషన్ తీసుకురావడానికి ప్రయత్నించాడు యాక్టర్ టర్న్డ్ డైరెక్టర్ హర్షవర్ధన్. కథకు సంబంధించిన ఆలోచన పేపర్ మీద చదివితే ఎగ్జైటింగ్ గా అనిపించేదేమో కానీ.. ఎగ్జిక్యూషన్ మాత్రం పేలవంగా తయారైంది.

ఈ చిత్రంలో హీరోను స్థూలకాయుడిగా చూపించడం వెనుక దర్శకుడిగా ఉద్దేశం మంచిదే అయినా.. ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం.. తెర మీద దాన్ని చూపించిన తీరే భరించలేని విధంగా తయారైంది. బడ్జెట్ పరిమితుల వల్లో ఏమో.. ప్రోస్థెటిక్ మేకప్ విషయంలో బాగా రాజీ పడిపోగా.. సుధీర్ లుక్ ఘోరాతి ఘోరంగా తయారైంది. ఆ పాత్ర తెర మీద కనిపించినపుడల్లా ఎప్పుడెప్పుడు పక్కకు వెళ్లిపోతుందా అనుకునే పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ పాత్ర అనే కాదు.. సుధీర్ బాబు చేసిన వయసు మళ్లిన పాత్రకు.. అలాగే సినిమాలో కీలక పాత్ర చేసిన హర్షవర్ధన్ క్యారెక్టర్ కు పెట్టిన విగ్గులు.. గడ్డాలు చూస్తే మనం చూస్తున్నది ఫీచర్ ఫిలిమా.. లేక వీధి నాటకమా అని డౌట్ కొడుతుంది. స్వతహాగా అందగత్తెలైన ఈషా రెబ్బా.. మృణాళిని రవి సైతం ఈ సినిమాలో కనిపించిన తీరుకు షాకవుతాం. పాత్రల అప్పీయరెన్సే అతి పెద్ద ప్రతిబంధకంగా మారిన 'మామా మశ్చీంద్ర'లో సన్నివేశాలు కూడా ఏమంత గొప్పగా అనిపించవు. సుధీర్ చేసిన పాత్రల్లో కొంచెం కంటెంట్ ఉన్నట్లుగా అనిపించే పరశురాం పాత్ర తాలూకు నేపథ్యాన్ని చూపించిన విధానం.. కథలో వచ్చే కీలక మలుపులు చూసి హర్షవర్ధన్ నుంచి ఎంతో ఆశిస్తాం. కానీ ఆరంభ మెరుపుల తర్వాత 'మామా మశ్చీంద్ర' ఒక గమ్యం అంటూ లేకుండా ఎటెటో వెళ్లిపోతుంది. మినిమం లాజిక్ లేకుండా అర్థ రహితంగా సాగే సీన్లు సినిమా మీద ఇంప్రెషన్ తగ్గిస్తూ వెళ్తాయి.

హీరోతో హీరోయిన్ నీ గదికి వెళ్దాం అనగానే అతను సేఫ్టీ సేఫ్టీ అంటూ బయటికి పరుగులు తీయడం.. అది పట్టుకుని వచ్చి కథానాయికతో సరస సంభాషణ చేస్తూ బెడ్ మీద పడుకోవడం.. హీరోయిన్ అతణ్ని సెడ్యూస్ చేస్తున్నట్లు కనిపించి చివరికి చావు కబురు చల్లగా చెప్పడం.. ఈ సన్నివేశం సాగే తీరు చూశాక రచయితగా- దర్శకుడిగా హర్షవర్ధన్ అభిరుచి మీద ఎన్నో సందేహాలు కలుగుతాయి. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ పేరుతో నేరుగా ఒక పాత్రను పెట్టి పబ్బులో వేయించిన వేషాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి సెన్స్ లెస్.. సిల్లీ సీన్లు సినిమాలో చాలానే ఉన్నాయి. తొలి పావుగంట తర్వాత కనీస స్థాయిలో కూడా ఎంగేజ్ చేసే ఒక్క సీన్ కూడా లేదు ప్రథమార్ధంలో. ద్వితీయార్ధంలో కథకు సంబంధించిన మలుపులు కొంత ఆసక్తి రేకెత్తిస్తాయి. ఐతే పరశురాం పాత్రకు తన శత్రువుల విషయంలో ఒక క్లారిటీ వచ్చేయడంతో కథ దాదాపుగా సుఖాంతం అయిపోయి సినిమా ముగిసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఆ తర్వాత కూడా ఒక ముప్పావుగంట పాటు సినిమాను అనవసరంగా సాగదీసి విసిగిస్తాడు దర్శకుడు. అప్పటిదాకా థ్రిల్లర్ లక్షణాలతో సాగిన సినిమా.. ఆ తర్వాత ముక్కోణపు ప్రేమకథలా మారి.. మరీ నాటకీయంగా సాగే సన్నివేశాలతో విసిగెత్తిస్తుంది. గమ్యం లేకుండా సాగే ఈ కథకు చివరికి ఏదో ఒక ముగింపు ఇచ్చి మమ అనిపించారు. కథలో విశేషాలన్నీ అయిపోయాక చివరి వరకు కూర్చోవడం చాలా చాలా కష్టమవుతుంది. చివరికి ఇది ఒక పర్పస్ లెస్ సినిమాలా మిగిలిపోయింది.

నటీనటులు:

సుధీర్ బాబు మూడు పాత్రల్లో వేరియేషన్ చూపించడానికి బాగానే కష్టపడ్డాడు. కాకపోతే బొద్దుగా కనిపించే పాత్రకు వేసిన ప్రోస్తెటిక్ మేకప్ ఘోరాతి ఘోరంగా తయారై ఆ క్యారెక్టర్ కనిపించినపుడల్లా చాలా ఇబ్బందిగా తయారవుతుంది. చాలా అసహజంగా ఉన్న ఆ పాత్రను సుధీర్ మీద మోయలేని బరువును పెట్టింది. మిగతా రెండు పాత్రల్లో సుధీర్ ఓకే అనిపించాడు. ముఖ్యంగా పరశురాం పాత్రలో ప్రతినాయక లక్షణాలను సుధీర్ బాగా చూపించగలిగాడు. ఒక దశ వరకు ఆసక్తికరంగా అనిపించే ఈ పాత్ర తర్వాత నిరాశ పరుస్తుంది. డీజే పాత్రలో సుధీర్ బాబు తన బాడీని తెగ ఎక్స్ పోజ్ చేశాడు. అది ఒక దశ దాటాక శ్రుతి మించినట్లు అనిపిస్తుంది. దర్శకుడు హర్ష కీలక పాత్రే చేశాడు కానీ.. నటన వరకు బాగున్నా ఆ పాత్ర గెటప్ కూడా సరిగా కుదరలేదు. హీరోయిన్లు ఈషా రెబ్బా. మృణాలిని రవి స్క్రీన్ ప్రెజెన్స్ ఏమంత బాగా అనిపించదు. వాళ్ల నటన పర్వాలేదు. అజయ్ ఓకే. హరితేజ అవసరానికి మించి నటించింది. రాజీవ్ కనకాలది మామూలు పాత్రే. అలీ రెజా.. మిర్చి కిరణ్ సహాయ పాత్రల్లో పర్వాలేదనిపించారు.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా 'మామా మశ్చీంద్ర' సోసోగా అనిపిస్తుంది. చేతన్ భరద్వాజ్ పాటలు మామూలుగా సాగిపోయాయి. గుర్తుంచుకునేలా.. మళ్లీ వినాలనిపించేలా ఏవీ లేవు. ప్రవీణ్ లక్కరాజు నేపథ్య సంగీతం కూడా ప్రత్యేకంగా ఏమీ అనిపించదు. పి.జి.విందా ఛాయాగ్రహణం బాగానే సాగింది. నిర్మాణ విలువల విషయంలో 'మామా మశ్చీంద్ర' తీవ్రంగా నిరాశ పరుస్తుంది. ఆరంభం నుంచి ఒక లో క్వాలిటీ సినిమా చూస్తున్న ఫీలింగ్ వెంటాడుతుంది. దుర్గ పాత్రలో సుధీర్ బాబుకు వేసిన మేకప్ దగ్గరే నిర్మాణ విలువల విషయంలో ఎంత రాజీ పడ్డారో అర్థమవుతుంది. ఏషియన్ మూవీస్ సునీల్ నారంగ్ మరీ ఇంత రాజీ ఎలా పడ్డాడో అని ఆశ్చర్యం కలుగుతుంది. హర్షవర్ధన్ రైటింగ్ విషయంలో కష్టపడ్డ విషయం తెలుస్తుంది కానీ.. ఎగ్జిక్యూషన్లో బాగా తడబడ్డాడు. అతను కథను మొదలుపెట్టిన తీరుకు.. ముగించిన విధానానికి అసలు పొంతన లేదు. తనేం చెప్పాలనుకున్నాడో సరైన క్లారిటీ లేకపోయింది. రకరకాల జానర్లు కలిపేసి కంగాళీగా తయారు చేశాడు. దర్శకుడిగా హర్షవర్ధన్ తీవ్రంగా నిరాశ పరిచాడు.

చివరగా: మామా మశ్చీంద్ర.. అంతా అయోమయం

రేటింగ్ - 1.75/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater