విరాట్ స్వార్థపరుడే అంటున్న ప్రసాద్... రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
వన్డే చరిత్రలో 49 శతకాలు సాధించిన రెండో బ్యాటర్ గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో... సెంచరీల విషయంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ను కోహ్లీ సమం చేశాడు.
By: Tupaki Desk | 6 Nov 2023 11:02 AM GMTవన్డే చరిత్రలో 49 శతకాలు సాధించిన రెండో బ్యాటర్ గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో... సెంచరీల విషయంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ను కోహ్లీ సమం చేశాడు. దీంతో సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. నెట్టింట కొహ్లీ నామస్మరణ మారుమ్రోగిపోతుంది. పలువురు సీనియర్ క్రికెటర్లూ ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఈ సమయంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రీకీపాంటింగ్.. ఇండియన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ స్పందించారు.
అవును... విరాట్ 49 శతకాలు సాధించిన విషయంపై ప్రపంచ క్రీడాభిమానులంతా పాజిటివ్ గా స్పందిస్తుంటే.. మరికొంతమంది మాత్రం స్వార్ధపరుడు అని, సెంచరీల కోసం ఆడతాడని కామెంట్ చేస్తున్నారు. వ్యక్తిగత మైలురాళ్ల కోసం జట్టు ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నాడనేది వారి అభిప్రాయం! ఈ ఆరోపణలపై టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కీలకంగా స్పందించారు.
ఇందులో భాగంగా... "అవును.. కోహ్లి స్వార్థపరుడే. కోట్లాది మంది కలలను నిజం చేయడంలో అతడు పూర్తి స్థార్థంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన రికార్డులు సాధించినా.. అరుదైన ఘనతలెన్నో సాధించినా... జట్టును గెలిపించేందుకు ఇప్పటికీ శాయశక్తులా కృషి చేస్తున్నాడు. అందుకు.. నిజంగానే కోహ్లి స్వార్థపరుడు" అంటూ వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్ వేదికగా ఉద్వేగపూరిత నోట్ రాశాడు. ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారగా.. విరాట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ విరాట్ ను అభినందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు ఉన్న భారమంతా దిగిపోయిందని.. ఇక నుంచి కోహ్లీ మరింత స్వేచ్ఛగా ఆడతాడని తాను భావిస్తున్నట్లు వెల్లడించాడు. ఇదే క్రమంలో కొహ్లీ "ఛేజింగ్ కింగ్" అనిపించుకున్నాడని కొనియాడాడు. ఇకపై కొహ్లీ మరింత చెలరేగిపోతాడని చెప్పుకొచ్చాడు.
ఇందులో భాగంగా... "విరాట్ పై ఉన్న భారమంతా దిగిపోయింది. సచిన్ శతకాల రికార్డును సమం చేశాడు. దీని కోసం తీవ్రంగా శ్రమించి ఉంటాడు. ఇప్పుడు సాధించాడు. అదికూడా కీలకమైన వరల్డ్ కప్ లో కావడం విశేషం. సెమీస్ కు ముందు భారత్ లీగ్ స్టేజ్ లో ఒక మ్యాచ్ ఆడనుంది. అందులోనూ సెంచరీ సాధిస్తే భారత క్రికెట్ కు గొప్ప రోజుగా మారిపోతుంది. ఇక నాకౌట్ దశలో విరాట్ మరింత స్వేచ్ఛగా ఆడేస్తాడు." అని పాంటింగ్ అన్నాడు.
ఇదే సమయంలో... ఛేజింగ్ కింగ్ అనిపించుకున్న కోహ్లీ ఆల్ టైం ప్లేయర్ల జాబితాలో ముందుంటాడని.. అతడి ఆటతీరు అత్యుత్తమం అనే విషయం తాను చాలా ఏళ్ల కిందటే తాను చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు పాంటింగ్. ఇదే సమయంలో అతడికేమీ సచిన్ రికార్డును సమం చేయాల్సిన అవసరం లేదని.. అతడి బ్యాటింగ్ రికార్డులను గమనిస్తే ఛేజింగ్ లో అత్యుత్తమంగా రాణించాడని.. అందుకేనేమో.. సచిన్ 49 శతకాల రికార్డును సమం చేయడానికి తక్కువ ఇన్నింగ్స్ లను తీసుకున్నాడని అని పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
కాగా.. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో తన 49వ సెంచరీ చేయడంతో కొహ్లీ నామస్మరణతో సోషల్ మీడియా షేక్ అయిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దిగ్గజ క్రికెటర్లు వెంకటేష్ ప్రసాద్, రీకీ పాంటింగ్ లు పై విధంగా స్పందించారు.